మట్టితో పూడ్చివేసి దర్జాగా ఆక్రమణ
అధికారుల అండదండలు..?
ఫిర్యాదులు వచ్చినా.. స్పందన నిల్
బ్యాతోల్ శివారు నుంచి చిద్రుప్ప శివారులోకి వాగు మళ్లింపు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రకృతి సంపదలైన వాగులు, వంకలు, కాలువలు చెరబడుతున్న వారిని, అక్రమంగా ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని ఊపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే చెరువులు ఆక్రమించి ఇండ్ల నిర్మాణాలు, అక్రమ కట్టడాలు చేపట్టిన వాటిని హైడ్రా కూల్చివేస్తూ భూములను కాపాడుతున్నది. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నా, మరో వైపు నక్కవాగును ఆక్రమించి పూడ్చివేస్తున్నా అధికారులు మాత్రం మౌనం పాటిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న బ్యాతోల్ -చిద్రుప్ప శివారులోని నక్కవాగును ఆక్రమణదారులు యధేచ్ఛగా ఆక్రమించి పూడ్చి వేస్తున్నారు. ఓ ఫాంహౌస్ యజమాని.. సుమారు మూడు ఎకరాల మేర వాగును ఆక్రమించి పూడ్చివేస్తుంటే ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు.
నక్కవాగు.. పటాన్ చెరు శివారు నుంచి ప్రవహిస్తూ కంది మండలం బ్యాతోల్, చిద్రుప్ప, సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట, గౌడిచర్ల మీదుగా ప్రవహించి మంజీర నదిలో కలుస్తున్నది. బ్యాతోల్ – చిద్రుప్ప శివారు నుంచి వెళ్తున్న నక్క వాగును బ్యాతోల్ శివారు నుంచి వచ్చే వాగును చిద్రుప్ప శివారులోంచి ప్రవహించేలా మట్టితో వాగును పూడ్చి వేస్తున్నారు. అంతేకాదు, తన చేనుకు చుట్టూ రోడ్డు ఏర్పాటు చేసుకున్నా అధికారులు చూసి చూడనట్టు ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు ఫాంహౌజ్ యజమానికి నోటీసులు జారీ చేశామని చెబుతున్నారు. అయినా యదేచ్ఛగా వాగును పూడ్చివేస్తుంటే చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నోటీసులు ఇవ్వడంతో సరిపుచ్చారు. వాగు విస్తీర్ణం, బఫర్ జోన్ నిర్ధారించలేదు. ఫాంహౌజ్ యజమాని అడిగిన వారిపైనే కాకుండా అధికారులపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిసింది.
నోటీసులిచ్చినా బెదరని అక్రమార్కులు..
మట్టితో వాగును పూడ్చుతూ దారి మళ్లిస్తున్న విషయమై చిద్రుప్ప గ్రామానికి చెందిన పలువురు.. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నక్కవాగు పరిసర ప్రాంత రైతులు కూడా ఫిర్యాదులు చేయగా తప్పని పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నక్కవాగును ఎలా ఆక్రమిస్తావంటూ అధికారులు వివరణ కోరగా ”నేను రెవెన్యూలోనే పనిచేశాను.. నాకు అన్నీ తెలుసు.. ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ బెదిరింపులకు పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. నోటీసులు అందించినా బెదరని అక్రమార్కులు వాగు మొత్తాన్ని ఆక్రమిస్తారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూలో పనిచేస్తే నక్కవాగును ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సుమారు మూడు ఎకరాలను ఆక్రమించి మట్టితో వాగును పూడ్చి వేయడమే కాకుండా చిద్రుప్ప గ్రామ శివారులోని పట్టా భూముల్లోకి వాగు ప్రవాహం వెళ్లేలా చేస్తున్నారని, న్యాయం చేయాలని చిద్రుప్ప పట్టా రైతులు కోరుతున్నారు.
జాయింట్ సర్వే నిర్వహిస్తాం : బాలగణేష్, డీఈ, ఇరిగేషన్ శాఖ
బ్యాతోల్-చిద్రుప్ప శివారులోని నక్కవాగును ఓ మాజీ వీఆర్ఓ ఆక్రమించి మట్టితో పూడ్చివేసినట్టు ఫిర్యాదులు అందాయి. అయితే నక్కవాగును పరిశీలించి ఆక్రమణదారుడికి నోటీసులు అందించాం. నోటీసులు ఇచ్చిన సందర్భంగా నక్కవాగు నాది మీరెవరు అడగడానికి నేనేం చేయాలో నాకు తెలుసుంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నక్కవాగు ఆక్రమణ జరిగిందా.. అది పట్టా భూమా అనే దానిపై రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు లెటర్ పెట్టాం. రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేయాలి. వాగుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాం. చర్యలు తీసుకోవాల్సింది రెవెన్యూ అధికారులే.
నక్కవాగు కబ్జా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



