ప్రధాని కార్యక్రమాన్ని బహిష్కరించిన కేరళ సీఎం, మంత్రులు
కోచి : కేరళ అసెంబ్లీకి మరికొద్ది వారాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో, సీపీఐ(ఎం), బీజేపీల మధ్య తాజా రాజకీయ ఘర్షణ తలెత్తింది. కోచిలో బుధవారం ప్రధాని మోడీ పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాన్ని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం బహిష్కరించింది. రూ.10,800కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అలాగే కోచి రిఫైనరీలో ప్రతిపాదిత పాలీ ప్రొపిలీన్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. కాగా ఈ అధికార కార్యక్రమాలకు దూరంగా వుండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇద్దరు క్యాబినెట్ మంత్రులు స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎం.బి.రాజేశ్, విద్యుత్ శాఖ మంత్రి కె.కృష్ణన్‌కుట్టిలు నిర్ణయించారు. కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి మహ్మద్ రియాజ్‌ను కేంద్రం ఈ అధికారిక కార్యక్రమానికి దూరంగా పెట్టిందని, అందువల్లే తాము కూడా బహిష్కరించామని వారు తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.బి.గోవిందన్ తిరువనంతపురంలో విలేకర్లతో మాట్లాడుతూ, పీడబ్ల్యూడీ మంత్రి రియాజ్‌ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి కేంద్రం తిరస్కరించడం సరికాదని అన్నారు. దీనిపై మంత్రి రియాజ్ మాట్లాడుతూ, ఇది కేరళను అవమానించడమేనన్నారు. ” కేరళలో జాతీయ రహదారిని ప్రారంభించే కార్యక్రమంలో నితిన్ గడ్కరీ కార్యాలయం రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి పేరును చేర్చడం సాధారణమైన పద్ధతి. గతంలో కూడా ఇలాంటి ప్రారంభోత్సవాలు అనేకం జరిగాయి. అలాంటి కార్యక్రమాలకు నేను కూడా హాజరయ్యాను. కానీ ఇప్పుడు ఇలా రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రిని పక్కకు తప్పించడమనేది సరికాదు, ఇది కేరళను అవమానించడమే.” అని రియాజ్ విలేకర్లతో అన్నారు. ఒకప్పుడు ఎన్‌హెచ్-66 ప్రాజెక్టులు కేరళలో స్తంభించాయి. కేవలం ముఖ్యమంత్రి పినరయి విజయన్ చొరవ వల్లే వాటిని పునరుద్ధరించడం జరిగిందని రియాజ్ చెప్పారు.
2014లో అప్పటి యూడీఎఫ్ ప్రభుత్వ అసమర్ధ వైఖరి వల్లనే ఇదంతా జరిగిందని మనందరికీ తెలుసునని అన్నారు. కానీ 2016లో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని, శ్రద్ధ తీసుకుని ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా చేశారన్నారు. ప్రధానిని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్వయంగా కలుసుకున్న విజయన్ ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడారని, కానీ కేరళలో అంత పెద్ద మొత్తంలో ఈ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేమని కేంద్రం చేతులెత్తేసిందని చెప్పారు. జాతీయ హైవేల అభివృద్ధి చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రాజెక్టులపై ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది లేదన్నారు. కానీ కేరళ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఆ పని చేసిందన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిన స్థానిక స్వపరిపాలనా శాఖ మంత్రి ఎం.బి.రాజేశ్ మాట్లాడుతూ, కేవలం 24గంటలు ముందు తనకు తెలియచేశారని చెప్పారు. అయినా తాను కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్టు చెప్పారు.



