– రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం
– ఫిరాయింపులపై హైకోర్టును ఆశ్రయిస్తాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికమనీ, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. స్పీకర్ నిర్ణయం వెనుక రాహుల్‌గాంధీ తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. ఫిరాయిపు ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ కూడా రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కట్టల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ లేనే లేదని చెప్పారు.
స్పీకర్ చేతుల్లో ఏమీ లేదనీ, కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేరపూరిత ఆలోచన రాహుల్ గాంధీదేననీ, ఆయనే అసలు దోషి అని అన్నారు. రాహుల్ అనుమతి లేకుండా స్పీకర్ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునే సాహసం చేయలేరని చెప్పారు. ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై దాడి అని విమర్శించారు. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతూ దానికి రక్షకుడినంటూ చెప్పుకుంటూ, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయంపైన రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్‌గా అనర్హత వేటు పడుతుందని చెప్పిన రాహుల్ గాంధీ, స్పీకర్ తీసుకున్న నిర్ణయంపైన ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఒక పార్టీ బీఫారంపైన గెలిచిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బీఫారంతో ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించకుండా, విచారణ పేరుతో సాగదీసి ఆ ఎమ్మెల్యేకు అనుకూలంగా తీర్పు చెప్పడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదని కేటీఅర్ ఎద్దేవా చేశారు. అందుకే తాము వారిని చప్పట్లతో, శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏ బీ-ఫారమ్ వాడారు, ఎంపీగా ఏ బీ-ఫారమ్ వాడారో అక్కడ స్పష్టంగా ఉందన్నారు. ఆధారాలు ఉన్నా స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారంటే, ఖచ్చితంగా ఆయన్ను నడిపిస్తున్న కాంగ్రెస్ నేతలను సత్కరించాల్సిందేనని ఎద్దేవా చేశారు.
ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు
ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ లేనే లేదని కేటీఆర్ అన్నారు. ఇందిరా గాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపుల రాజకీయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ విస్తరించిందని చెప్పారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ కాదా?అని ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశంపైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు.
కడియం శ్రీహరికి బీఆర్ఎస్ చేసిన అన్యాయం ఏంటని ప్రశ్నించారు. ఆయన 2013లో బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఆయన్ను ఎంపీని చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ చేశారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని కడియం శ్రీహరి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే అంశంపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
స్పీకర్ తీర్పు అప్రజాస్వామికం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



