Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగడ్డి, కలుపు మందులు ప్రమాదకరం

గడ్డి, కలుపు మందులు ప్రమాదకరం

- Advertisement -

– విష రసాయనాలతో నేలంతా ఖరాబ్‌
– వాటి నిషేధంపై అసెంబ్లీలో చర్చ జరిగేలా చూస్తాం : రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గడ్డి, కలుపు మందులు రెండూ ప్రమాదకరమేనని రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి నొక్కి చెప్పారు. కూలీల కొరతతో చాలా మంది అమాయక రైతులు వాటిని వాడుతున్నారని తెలిపారు. విదేశాల్లో తయారైన ఆ మందులు ఇక్కడ విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మందులు తయారయ్యే దేశాల్లో వాటిపై నిషేధం ఉందని ఎత్తిచూపారు. ఆ మందుల్లోని విష రసాయనాలతో నేలంతా చెడిపోతున్నదనీ, కమిషన్‌ సభ్యులు కేవీఎన్‌ రెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకి ఇస్తే నేలంతా ఖరాబైతే దాన్ని మాములు స్థితికి తేవడానికి మూడేండ్లు పట్టిందని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారానే నేల, పంట బాగుంటాయని చెప్పారు. ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు ముందుకొచ్చి గడ్డిమందు నిషేధంపై పోరాటం చేయడాన్ని ప్రశంసించారు. గడ్డిమందు తాగి చనిపోయినవారి డేటాను ఐఎంఏ ఇస్తే అసెంబ్లీలో చర్చ జరిగేలా చూస్తామనీ, స్పీకర్‌, సీఎం, శాసనసభా వ్యవహారాల మంత్రికి నివేదిక అందజేస్తామని హామీనిచ్చారు. క్షణికావేశంలో చాలా మంది రైతులు గడ్డిమందు తాగి చనిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కమిషన్‌ సభ్యులు భవానీ రెడ్డి, గోపాల్‌రెడ్డి, కేవీఎస్‌.రెడ్డి మాట్లాడుతూ..పారాక్వాట్‌ నిషేధించేలా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని కోరారు. ఖమ్మం జిల్లాలోనే ఈ ఏడాది 200 మంది చనిపోయారనీ, గడ్డిమందు తాగిన వారిలో 99 శాతం మంది చనిపోతున్నారని వాపోయారు. పారాక్వాట్‌ మందు వాడకం మొదలు పెట్టినప్పటి నుంచి ఆరుద్ర పురుగులు కనిపించడం తగ్గిపోయిందన్నారు. భూమి కాలుష్యమవుతుందనీ, ఆ మందుపై 70 దేశాల్లో నిషేధం ఉందని తెలిపారు. ఐఎంఏ చలో ఢిల్లీకి పిలుపునివ్వడం మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో పీజేటీఎస్‌ఏయూ ప్రిన్సిపల్‌ సైంటిస్టు డాక్టర్‌ పద్మజ, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గీతారెడ్డి, ఎన్‌ఐపీహెచ్‌ఎమ్‌ నిపుణులు డాక్టర్‌ ఓపీ.శర్మ, ఐఎమ్‌ఏ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్‌ కిషన్‌, డీఏపీపీ అధ్యక్షులు డాక్టర్‌ సతీశ్‌ నారాయణ చౌదరి, డీఏపీపీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ రాకేశ్‌కుమార్‌ చెన్నా, వ్యవసాయ నిపుణులు సత్యసాయి, పబ్లిక్‌ హెల్త్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ వి.శశి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -