మూడ్రోజుల్లో సమాధానమివ్వాలంటూ ఆదేశాలు
ప్రధాని మోడీపై కార్టూన్లు వేసినందుకు ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ కార్టూనిస్టు సతీశ్ ఆచార్యకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మూడ్రోజుల్లో వాటికి సమాధానమివ్వాలంటూ ఆయన్ను ఆదేశించింది. ప్రధాని మోడీపై కార్టూన్లు వేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు నోటీసులు జారీ చేసింది. అమెరికా-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న క్రమంలో ఆచార్య… మన విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తూ, మోడీనుద్దేశించి కార్టూన్లు వేశారు. ‘ఒకప్పుడు ఇరాన్ మన మిత్రుడంటూ పేర్కొన్న భారత ప్రభుత్వం, ఇప్పుడు ఖమేనీ హత్యపై మౌనం దాలుస్తోంది.. హిందూ మహాసముద్ర తీరంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా జలాంతర్గామి ముంచివేసిన సంఘటనపై ప్రధాని మోడీ మౌనంగా వహిస్తున్నారు…’ అనేది ఆయన కార్టూన్లలోని సారాంశం.
వీటిని వెంటనే తన ఎక్స్ ఖాతా, సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలంటూ ఆచార్యను కేంద్రం ఆదేశించింది. కాగా తాను ప్రచురించే కార్టూన్లకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఎక్స్‌లో అలాంటి నోటీసులే వస్తున్నాయని ఆయన వివరించారు. ‘నాకు ఇలాంటి నోటీసు అందడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేండ్లుగా ఇది కొనసాగుతోంది. కేంద్రం నేరుగా నోటీసులు పంపటం లేదు.. కానీ దాన్ని విమర్శించే కార్టూన్లను తొలగించమని అడుగుతోంది. ఆ పని చేయకపోవటంతో నాకు నోటీసులు పంపుతోంది…’ అని తెలిపారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమే. నేను కార్టూనిస్ట్‌ని, నాకు కార్టూన్లు గీయడానికి, ప్రచురించడానికి హక్కు ఉంది. ఈ కార్టూన్లు అభ్యంతరకరంగా ఏమీ లేవు…’ అని ఆయన వ్యాఖ్యానించారు.



