ఎస్‌హెచ్‌జీలోని ప్రతి మహిళకూ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి : మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లోని 46 లక్షల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించవద్దని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. ఆ కార్యక్రమం అమలు తీరుపై బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి సెర్ప్, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, డీఎంహెచ్ఓలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… టెస్టుల కోసం గ్రామాల నుంచి మహిళలను ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు, పరీక్షల అనంతరం ఇండ్ల వద్ద సురక్షితంగా దింపేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్ మెయింటేయిన్ చేయాలనీ, మహిళలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని డాక్టర్లకు సూచించారు. స్క్రీనింగ్‌లో అనారోగ్య సమస్యలున్నట్టు తేలితే వెంటనే చికిత్సలు ప్రారంభించాలన్నారు. మహిళల నుంచి రక్త నమూనాల సేకరణ మొదలుకొని.. వాటిని ల్యాబ్‌లకు చేర్చే వరకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. డీఎంహెచ్వోలు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు క్షేత్రస్థాయిలో పర్యటించి స్క్రీనింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించాల్సిందేనని నొక్కి చెప్పారు.
ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు
-46 లక్షల మంది ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలకు 30 రకాల పరీక్షలు నిర్వహించడం.
-బ్లడ్ షుగర్, బైలిరుబిన్ టోటల్, బైలిరుబిన్ డైరెక్ట్, క్రియాటీన్, బ్లడ్ యూరియా, ఎస్‌జీపీటీ, ఎస్జీఓటీ, ఆల్కలైన్ పాస్పటేస్, ప్రొటీన్ ప్రొఫైల్, అల్బుమిన్+ఏజీ రేషియో, హిమోగ్లోబిన్, టీఎన్సీ, డీఎల్సీ, ప్లేట్లెట్ కౌంట్, ఆర్బీసీ, హెచ్‌సీటీ, ఎమ్‌సీవీ, బ్లడ్ గ్రూపింగ్, హైట్, వెయిట్, బీఎమ్ఐ, బ్లడ్ ప్రెషర్, డిసబులిటీ స్క్రీనింగ్, హార్ట్‌బీట్, రెస్పరేంటరీ రేట్, కంటి పరీక్షలు, ఓరల్ ఎగ్జామినేషన్, స్కిన్, నెయిల్ ఎగ్జామినేషన్, టీఎస్‌హెచ్ పరీక్షలు చేయనున్నారు.
-సెర్ప్, వైద్యారోగ్య సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 542 మండలాల పరిధిలో పరీక్షల నిర్వహణ.
-తొలి దశలో ప్రతి జిల్లాలోని ఐదు మండలాల్లో ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
-మౌలిక వసతులు, సిబ్బంది లభ్యత ఆధారంగా రెండో దశలో మిగిలిన అన్ని మండలాలకు విస్తరిస్తారు.
-టీ-డయాగస్టిక్స్కు శాంపిల్స్ తరలించి, అక్కడ పరీక్షలు చేస్తారు.
-లబ్దిదారుల ఆరోగ్య సమాచారాన్ని పదిలంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేసి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తారు. ఈ-హెచ్ఎంఐఎస్ ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానిస్తారు. ఈ రిపోర్టులను నేరుగా లబ్దిదారుల మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో, అలాగే ‘ఈ-ఆరోగ్యం’ యాప్ ద్వారా అందిస్తారు.
-ఏ ప్రభుత్వాస్పత్రికెళ్లినా ఈ డిజిటల్ డేటా ద్వారా మహిళలు సులభంగా వైద్య సేవలు పొందే అవకాశం లభిస్తుంది.
ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్‌లో అలసత్వం వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



