Friday, March 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యకు బడ్జెట్‌ పెంచాలి

విద్యకు బడ్జెట్‌ పెంచాలి

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం విద్యాకుసుమాలతో వికసించాలంటే బడ్జెట్‌ కేటాయింపుల్లో చిత్తశుద్ధి ఉండాలి. కానీ, దశాబ్ద కాలంగా పాలకులు మారుతున్నా, విద్యారంగానికి దక్కుతున్న వాటా మాత్రం ‘అరకొర’గానే మిగులుతోంది. రాజ్యాంగంలోని 112వ ప్రకరణ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదిక (బడ్జెట్‌) అంటే కేవలం ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు, అది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి. ఈనెల 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, విద్యారంగంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టో హామీని నిలబెట్టుకుంటుందా? లేదా గత పాలకుల బాటలోనే ‘అంకెల గారడీ’తో సరిపెడుతుందా? అన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

తెలంగాణ సిద్ధించిన కొత్తలో (2014-15) అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌లో 10.89 శాతం (రూ.10,200 కోట్లు) విద్యకు కేటాయించింది. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ ఆ శాతం పెరుగుతుందనుకుంటే, విచిత్రంగా తగ్గుతూ వచ్చింది. 2023-24 నాటికి అది అత్యల్పంగా 6.57 శాతానికి పడిపోయింది. మార్పు కోరుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, తన మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, గత రెండు బడ్జెట్‌లను (2024-25లో 7.7శాతం, 2025-26లో 7.93శాతం) పరిశీలిస్తే, ఆచరణలో మాత్రం 8 శాతం మార్కును కూడా దాటలేకపోయింది. బడ్జెట్‌ పరిమాణం లక్షల కోట్లకు పెరుగుతున్నా, విద్యకు ఇచ్చే వాటాలో మాత్రం ‘పైసా’ మేరకే పెరుగుదల కనిపిస్తోంది.

రాష్ట్రంలో 58 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం కోసం రూ.11,600 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక చోట్ల కేవలం శిలాఫలకాలే దర్శనమిస్తున్నాయి తప్ప, ఒక్క పాఠశాల కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరోవైపు, రాష్ట్రంలో 1,920 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ‘సున్నా’గా ఉండటం ఆందోళనకరం. దేశంలోనే ఈ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందంటే మన విద్యావ్యవస్థ ఏ స్థాయిలో కునారిల్లుతుందో అర్థం చేసుకోవచ్చు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నా, బడ్జెట్‌ మద్దతు లేని ప్రతిపాదనలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి.

రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నేడు నిధుల లేమితో విలవిలలాడుతున్నాయి. గత బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన రూ.500 కోట్లు కనీసం ప్రొఫెసర్ల జీతాలకే సరిపోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించి జీవో ఇచ్చిన సర్కారు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. తెలంగాణ విద్యా విధానం-2026 రిపోర్ట్‌ ప్రకారం, వర్సిటీల్లో ఎనభై శాతం టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధకులు లేనిచోట పరిశోధనలు ఎలా సాగుతాయి? పరిశోధనలు లేని విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కర్మాగారాలుగా మారిపోతున్నాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి విద్యాశాఖను ముఖ్యమంత్రి తన వద్ద ఉంచుకున్నారు.విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం వల్ల క్షేత్రస్థాయి సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్లడం లేదు. ఫలితంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో పాలనాపరమైన స్తబ్దత ఏర్పడింది.విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే తక్షణమే పూర్తిస్థాయి మంత్రిని నియమించి, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో సమూల మార్పుల కోసం 1964-66లోనే కొఠారి కమిషన్‌ చారిత్రాత్మక సిఫార్సులు చేసింది. మొత్తం బడ్జెట్‌లో 30 శాతం నిధులను విద్యకు కేటాయించాలని, విశ్వవిద్యాలయాల బడ్జెట్‌లో 6.5 నుండి 10 శాతం నిధులను కేవలం గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చించాలని సూచించింది.

విద్యను ఒక ఖర్చుగా కాకుండా, దేశ సామాజిక, ఆర్థిక చోదకశక్తిగా చూడాలని పేర్కొంది. కానీ, మన పాలకులు ఈ సిఫార్సులను తుంగలో తొక్కి, విద్యను కేవలం ఒక ‘సంక్షేమ పథకం’లా చూస్తున్నారు తప్ప, అభివృద్ధికి పెట్టుబడిగా చూడటం లేదు. బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని మేధావులు, విద్యార్థి సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయి. యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, వర్సిటీల్లో మౌలిక వసతులు, పరిశోధనలకు నిధులివ్వడం, సంక్షేమ హాస్టళ్లలో సోలార్‌ విద్యుత్‌, డైట్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపై ముందస్తు చర్చల్లో ఇచ్చిన హామీలు బడ్జెట్‌లో ప్రతిబింబించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టోను గౌరవించి, విద్యా బడ్జెట్‌ను పెంచినప్పుడే తెలంగాణలో విద్యావిప్లవం సాధ్యం.

రాచకొండ విఘ్నేష్‌
6302246641

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -