తొలి వారం ఖర్చు 11 బిలియన్ డాలర్లకు పైనే!
అమెరికాకు ఆర్థికంగా తీవ్ర భారం
భారీ ఆయుధ వినియోగంతో తడిసి మోపెడవుతున్న ఖర్చు
‘చిన్న’ ఆయుధాలతో పొదుపుగా ఇరాన్
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యతో మొదటి వారంలోనే 11.3 బిలియన్ డాలర్లు ఖర్చు అయినట్టు పెంటగాన్ అంచనా వేసింది. అమెరికా- ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉందని అమెరికాలోని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఇది అమెరికాకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. మరోపక్క ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆయుధాలను వాడుతోందనీ, వాటిని అడ్డుకోవడానికి అమెరికా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని వివరిస్తున్నారు.
ఏఐతో లక్ష్యాలు గుర్తింపు
అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి ఇరాన్ సైనిక స్థావరాలు, లీడర్లే టార్గెట్‌గా పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించిన విషయం విదితమే. ఫలితంగా అమెరికాకు ఆర్థికంగా తీవ్ర వ్యయం ఏర్పడిందని నివేదికలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికా సైన్యం 5500కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు కమాండర్లు తెలిపారు. ఈ లక్ష్యాలను గుర్తించడం కోసం అమెరికా కృత్రిమ మేధస్సు (ఏఐ)ని కూడా ఉపయోగించినట్టు వెల్లడించారు.
రెండు రోజుల్లోనే 5.6 బిలియన్ డాలర్లు
యుద్ధం ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే అమెరికా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయు ధాలు వినియోగించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏజీఎం -154 జాయింట్ స్టాండాఫ్ వెపన్ (జేఎస్ఓడబ్ల్యూ) వంటి ఖచ్చితమైన బాంబులు ఉపయోగించనట్టు తెలుస్తోంది. ఒక్క దానికి సుమారు 2.8 లక్షల నుంచి 7 లక్షల డాలర్ల వరకు ఖర్చవుతందని అంచనా. అలాగే అమెరికా పాట్రియాట్, ‘థాడ్’ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఇంటర్సెప్టార్ క్షిపణులు ఒక్కోటి మిలియన్ డాలర్ల ఖర్చవుతాయని తెలుస్తోంది.
యుద్ధం కొనసాగితే అదనంగా 50 బిలియన్ డాలర్లు అవసరం
కాగా యుద్ధం కొనసాగితే అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌ను సంప్రదించి సుమారు 50 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కోరే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ యుద్ధంలో ప్రాణ నష్టం కూడా పెరుగుతోంది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సమాచారం ప్రకారం… అమెరికా-ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్లో 1300 మందికి పైగా మరణించారు. అయితే అమెరికా, ఇజ్రాయిల్‌లు మాత్రం తమ దగ్గర నమోదైన మరణాల సంఖ్యను మాత్రం బటయకు రానివ్వడం లేదు. ఈ మేరకు మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుంటూ, తమకు అనుకూల ప్రచారాలను కొనసాగించేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆర్థిక వ్యయం మాత్రమే కాకుండా మానవ నష్టం కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ ఆర్థిక క్రమశిక్షణ
ఇరాన్ మాత్రం అమెరికాకు భిన్నంగా, ఒక వ్యూహాత్మక పద్ధతిలో ముందుకెళ్తోంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే షాహెద్ డ్రోన్లు ఉపయోగిస్తోంది. ఒక్కో డ్రోన్ తయారీకి ఖర్చయ్యేది వేల డాలర్లు మాత్రమే. అయితే వాటిని కూడా అడ్డుకోవడానికి అమెరికా మిలియన్ డాలర్ల విలువైన క్షిపణులను వినియోగించాల్సి వస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో ఇరాన్ ఒక ఆర్థిక క్రమ శిక్షణను పాటిస్తోందని వివరిస్తున్నారు.



