నేడు సీఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
కొలిక్కి వచ్చిన డీపీఆర్
మొదటి దశలో 21 కిలోమీటర్లు
రివర్బెడ్ నుంచి 50 మీటర్లు బఫర్ జోన్
టీడీఆర్ రూపంలో పరిహారంతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లు
నేడు ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూసీ పునరుజ్జీవనంపై ముందు కెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ మొదటి దశ పనులకు సంబంధించి డీటేయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీ సీఎల్) సిద్దం చేసింది. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.5, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కలిపి మొత్తం 21 కిలోమీటర్ల పనులకు రూ.7 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందులో రూ.4,100 కోట్లు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణంగా అందజేయనుంది. మిగతా మొత్తాన్ని ఇతర మార్గాల ద్వారా సేకరించాలని నిర్ణయించారు.
ప్రతి పక్షాల అభ్యంతరాలు, బాధితుల ఆందోళనలను నివృత్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నేడు హైదరాబాద్‌లో అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వ ఆలో చనలు, చేపట్టే ప్రణాళికలు, హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వయంగా వెల్లడించనున్నారు. నగరం మధ్యనుంచి దాదాపు 55 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ నది కాలుష్యమయంగా మారడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసక బారుతున్నదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో దీన్ని పూర్తిగా మార్చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లండన్ లోని థేమ్స్, సియోల్‌లోని చియోంగ్ జియోన్ నదీ లాగా తీర్చిదిద్దాలని సంకల్పించింది.
మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.5 కిలోమీటటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు కలిపి మొత్తం 21 కిలోమీటర్లు, రెండో దశలో ప్రతాప సింగారం నుంచి నాగోల్ వరకు, మూడో దశలో నాగోల్ నుంచి బాపూఘాట్ వరకు పనులు చేపట్టనున్నారు. ఇందుకు గాను నది కిరువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్ పరిధిలో నిర్మాణాలన్నింటిని తొలగించనున్నారు. రివర్బెడ్, బఫర్జోన్లలో మొత్తం 11 వేల పైచిలుకు ఇండ్లు మూసీలో ఉన్నట్టు సర్కార్ నిర్ధారించింది. వీరిని విడతల వారీగా తరలించాలని ప్రభుత్వం యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. దీని ప్రకారం దాదాపు లక్ష మంది ప్రజలను మూసీ పరివాహక ప్రాంతం నుంచి తరలించాలి. అంటే ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద పునరావాసంగా రికార్డులకెక్కనుంది.
మార్కింగ్ ప్రారంభం
హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ దాకా ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్ట్ పేరిట రివర్ బెడ్ నుంచి బఫర్‌జోన్‌ను 50 మీటర్లుగా పేర్కొంటూ మార్కింగులు చేస్తున్నారు. మార్కింగ్ చేసిన ప్రాంతంలో నది పొడవును మీటర్లలో సూచిస్తూ ఎంఆర్డీసీఎల్ పేరున్న స్తంభాలను నాటుతున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి బండ్లగూడ జాగీర్ పరిధిలోని కిస్మత్పూర్ దాకా మార్కింగ్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. రివర్ బెడ్, బఫర్‌జోన్‌గా గుర్తించిన స్థలంలో శ్మశాన వాటికలు, గుడులు ఉన్నాయి. వాటిని తొలగిస్తారా? అలానే ఉంచుతారా? ప్రత్యామ్నాయం చూపిస్తారా? అనే దానిపై అధికారులు ఎటూ తేల్చలేక పోతున్నారు.
అందుబాటులోకి 2వేల ఎకరాలు
హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ నదీకిరువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్‌లోని ఇండ్లను తొలగించడం ద్వారా దాదాపు 2 వేల ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. ఇందులో పార్కులు, రహదారుల నిర్మాణం, హోటళ్లు, క్రీడా వసతులు, షాపింగ్ మాళ్లు, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే పని మీన్‌హార్ట్, కష్మన్ అండ్ వేక్ఫీల్డ్, జోహా, రియో మొదలగు ఐదు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు ఆయా సంస్థలు నది పునరుజ్జీవనంతో పాటు అవసరమయ్యే నిధుల అంచనా, సేకరణ లాంటి ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వానికి డిటేయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) అందించాయి. డీపీఆర్ దక్కించుకున్న కంపెనీలకు నిర్మాణ, రియల్ ఎస్టేట్, ఆర్కిటెక్, నిధుల సేకరణ, బ్యాంకు రుణాలు ఇప్పించడంలో అపార అనుభవం ఉంది. మూసీకి ఇరువైపులా బఫర్‌జోన్ వరకు నిర్మాణాలు ఉండొద్దని చెబుతున్న ప్రభుత్వం, రియల్, టూరిజం పేరిట తిరిగి అదే పని చేయడం సముచితమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పరిహారంపై మల్లగుల్లాలు
మూసీ బాధితుల పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటూ తేల్చలేదు. టీడీఆర్‌తో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. గతంలోనే బాదితులందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్వాసితుల కోసం 16వేల ఇండ్లను కేటాయిస్తూ 2025 సెప్టెంబరు 26న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఇండ్లు ఒకే చోట లేవు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 కిలోమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. బాధితుల్లో చాలా మంది అంత దూరం వెళ్లేందుకు సిద్ధంగా లేరు. 2013 ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలా? బాధితులను కేటగిరీల వారీగా విభజించి కోల్పోయిన ఆస్తులు, భూములకు తగు పరిహారం నిర్ణయించి ఇవ్వాలా? మరేదైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలా? అనే అంశంపై సర్కార్ కసరత్తు చేస్తున్నదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
పునరావాసం తర్వాతే తరలించాలి
మూసీ నదీ గర్భంలో ఉన్న వారికి పునరావాసం కల్పించిన తర్వాతే తరలించాలి. బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మూసీ ప్రక్షాళన పేరుతో నదికిరువైపులా ఇండ్లను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీలోకి పరిశ్రమల నుంచి మురికి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలి. ఎస్టీపీలను ఏర్పాటు చేయడం ద్వారా మూసీ నీటిని శుద్దిచేయాలి. -ఎండి.అబ్బాస్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ వ్యాపారం
మూసీ ప్రాజెక్ట్ పేరిట పెద్దమొత్తంలో ఇండ్ల తొలగింపు తర్వాత అందుబాటులోకి రానున్న రెండు వేల ఎకరాల భూమిని ఏం చేస్తారనే దానిపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఆ స్థలంలో ఆకాశహర్మ్యాలను, సుందర నందన వనాలను పీపీపీ పద్దతిలో నిర్మించి రియల్, టూరిజానికి తెరతీయనుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూసీ రివర్‌ను అభివృద్ధి చేస్తే అభ్యంతరం లేదు. కాని మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ఇరువైపులా ఇండ్లను తొలగించి భూములు సేకరిస్తే ఊరుకునేది లేదు. -ఎం.శ్రీనివాస్, కన్వీనర్, అర్బన్ డెవలప్మెంట్ పోరం



