దిగుమతులు సగానికి పైగా పతనం
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాద చర్యలతో పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత వంట నూనెల కొరతకు దారి తీసే సంకేతాలు స్పష్టంగా కనబడుతోన్నాయి. గతేడాదితో పోల్చితే ఫిబ్రవరిలో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఏకంగా 51 శాతం క్షీణించి 1.45 లక్షల టన్నులకు పరిమితమయ్యాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) వెల్లడించింది. మరోవైపు అంతర్జాతీయంగా ముడి నూనె ధర టన్నుకు 1,216 డాలర్ల నుండి 1,420 డాలర్లకు ఎగిసింది.
ఇది గతేడాది ఫిబ్రవరిలోని ధరలతో పోల్చితే 17 శాతం ఎక్కువ కావడం ఆందోళనకరం. దీనికి తోడు రూపాయి విలువ 4.2 శాతం మేర క్షీణించడం దిగుమతిదారులపై అదనపు ఒత్తిడిని పెంచుతోంది. సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాల వల్ల మార్కెట్లో సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో నిల్వలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులోనే ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని స్పష్టమవుతోంది.



