Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర సమగ్రాభివృద్ధికి 'రేర్‌'పై దృష్టి సారించాలి

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ‘రేర్‌’పై దృష్టి సారించాలి

- Advertisement -

త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ సాధనలో పోలీసు శాఖ పాత్ర కీలకం
దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలు వినియోగంలోకి తేవాలి : ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ 2047 నాటికి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ లక్ష్యసాధనలో పోలీస్‌ శాఖ పాత్ర కీలకమని చెప్పారు. గురువారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మొదట హోంశాఖ తర్వాత మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబుతో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ బడ్జెట్‌ సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కీలకమని అన్నారు. ఈ అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని సూచించారు.

ప్రతి కదలిక పోలీసుల కనుసన్నల్లో ఉండాలన్నారు. విధుల నిర్వహణ క్రమంలో హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని వివరించారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచంలో మేటి నగరంగా ఎదుగుతున్న క్రమంలో వేగంగా పలు సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. పోలీస్‌ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలనీ, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని కోరారు. చిన్న కదలికను సైతం వెనువెంటనే గుర్తించి నిఘాను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలన్నారు.

పీపీ మోడల్‌ అనివార్యం
2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ లక్ష్య సాధనలో పబ్లిక్‌, ప్రయివేట్‌ (పీపీ) మోడల్‌ అనివార్యమని అన్నారు. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలనీ, పరిశ్రమల శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. క్యూర్‌, ప్యూర్‌తోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూరల్‌ అగ్రి రీజియన్‌ ఎకానమీ (రేర్‌)కు సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రేర్‌ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. మైక్రో, స్మాల్‌, మీడియం ఇండిస్టీస్‌ (ఎంఎస్‌ఎంఈ)లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా రాష్ట్ర నలుమూలల్లోని యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధితోపాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్న రంగం అదేనని వివరించారు.

41 జీసీసీలతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇదే వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు అన్నారు. డాటా సెంటర్లలో ఏఐ వినియోగాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌, ఏడీజీ శిఖాగోయల్‌, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేశ్‌ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి, టీజీఐఐసీ ఎండీ శశాంక, జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ రమేష్‌, మల్కాజిగిరి సీపీ అవినాశ్‌ మహంతి, ప్యూచర్‌ సిటీ సీపీ సుధీర్‌బాబు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్ కుమార్‌, నార్కొటిక్‌ చీఫ్‌ సందీప్‌ శాండిల్య, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -