Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

- Advertisement -

పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు..
వివాహానికి వెళ్తుండగా మరో ఇద్దరు

నవతెలంగాణ-శంషాబాద్‌/నిర్మల్‌/సిరికొండ/ మరిపెడ/ రాజాపూర్‌
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి తొమ్మిది మంది మృతిచెందారు. శుభకార్యాలకు వెళ్తూ కొందరు.. పరీక్షకు వెళ్తూ మరో ఇద్దరు ప్రమాదాలకు గురై మృతిచెందారు. ఇంటర్‌ పరీక్షకు వెళ్తూ ప్రమాదానికి గురై రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మృతిచెందారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన విక్కీ సింగ్‌(22) లేబర్‌. యూపీ రాష్ట్రానికి చెందిన సూరజ్‌(17) ఇంటర్‌ విద్యార్థి. సూరజ్‌ ఇంటర్‌ పరీక్ష రాసేందుకు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై కొత్తూరు నుంచి శంషాబాద్‌కు వస్తున్నారు. మదనపల్లి పాత తండా గ్రామ పరిధిలోని జాతీయ రహదారి 44 రాగానే గుర్తు తెలియని వాహనం వెనుకాల నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వాహన డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు శంషాబాద్‌ పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు.

వివాహానికి వెళ్తుండగా పగిలిన వాహనం టైర్‌
ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామస్తులు ఆర్మూరులో వివాహానికి వెళ్లేందుకు వాహనాన్ని(మ్యాక్స్‌) ఏర్పాటు చేసుకొని బయలుదేరారు. నిర్మల్‌ దగ్గరలో బుర్కపల్లి సమీపంలో వాహనం వెనుక భాగంలోని ఎడమ వైపు టైరు పగిలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. ఘటనా స్థలంలోనే బోయిన్‌వాడ్‌ తులసీదాస్‌(38), గరాడే లక్ష్మణ్‌(55) మృతిచెందారు. సౌదర్వాడ్‌ బాలాజీతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. తలకు గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో పరామర్శించారు. నిర్మల్‌ ఎస్పీ డా.జానకి షర్మిల నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని
మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామానికి చెందిన బల్లెం ఉపేందర్‌ -శిలారాణి నాలుగో కుమారుడు ఉదయ్ కిరణ్‌ హైదరాబాద్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. బండి ఉపేందర్‌-లక్ష్మమ్మ మూడో కుమారుడైన బిక్షం స్థానికంగా వాటర్‌ సప్లైర్‌గా పనిచేస్తున్నాడు. బెల్లం ఉదయ్ కిరణ్‌(22), బండి బిక్షం(22) స్నేహితులు. ఇద్దరూ ఒక ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లచ్చ తండా సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్‌ఐ టి.కోటేశ్వరరావు తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలంలోని చెన్నవెల్లి గ్రామానికి చెందిన నరేష్‌ రాజాపూర్‌ నుంచి షాద్‌నగర్‌ వైపు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు.

వృద్ధురాలిని ఢీకొట్టిన బస్సు
నల్లగొండ బస్టాండ్‌ వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ(70) తన భర్త పిచ్చిరెడ్డికి చెవుల మిషన్‌ కొనేందుకు గురువారం ఉదయం నల్లగొండకు వచ్చింది. బస్టాండ్‌ సమీపంలోని సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా బస్సు ఢీకొట్టింది. డ్రైవర్‌ పరారయ్యాడు. టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో డివైడర్‌ పైన ఉన్న విద్యుత్‌ స్తభానికి కంటైనర్‌ లారీ తగలడంతో స్తంభం విరిగి మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న పాలకవీడు మండలం బెట్టే తండాకు చెందిన మాలోతు లక్ష్మా(42)పై పడి అక్కడికక్కడే మృతిచెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -