లిఫ్ట్ చైన్ తెగి జర్నలిస్టులకు గాయాలు
ఆస్పత్రికి తరలింపు- పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన ప్రమాదంలో పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, అలాగే నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మెన్లకు అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ రోడ్డులోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు సభ ముగిసిన అనంతరం వెనుతిరిగే క్రమంలో కన్వెన్షన్ హాల్‌లోని లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ ప్రారంభమైన కొద్దిసేపటికే దానికున్న చైన్ తెగిపోవడంతో అందులో ఉన్న జర్నలిస్టులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఘటనలో జర్నలిస్టులు ఎడ్ల సంతోష్, పావుశెట్టి శ్రీనివాస్, బండారి రాజు, తాళ్ళపల్లి వెంకట సమ్మయ్య, సామల శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మెన్ బుర్ర కొమురయ్య, స్థానికులు వెంటనే స్పందించి వారిని జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు.
పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ ఆస్పత్రికి వెళ్లిమీడియా ప్రతినిధులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పెద్ద పెద్ద భవనాల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర తనిఖీలు చేపడతామని తెలిపారు.
భవనాల నాణ్యత, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పెద్ద భవనాలకు నిబంధనల మేరకు తప్పనిసరిగా పార్కింగ్ సౌకర్యం ఉండాలని అన్నారు. పరామర్శించిన వారిలో.. మున్సిపల్ చైర్మెన్ బుర్ర కొమురయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్‌ఎంఓ దివ్య, సంక్షేమ అధికారి మల్లీశ్వరి తదితరులు ఉన్నారు.
‘ప్రజాపాలన’లో అపశృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



