Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేటీఆర్‌ను కలిసిన లైసెన్సుడ్‌ సర్వేయర్లు

కేటీఆర్‌ను కలిసిన లైసెన్సుడ్‌ సర్వేయర్లు

- Advertisement -

అటు పని ఇటు జీతభత్యాలపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్‌ఎస్‌ నేత హామీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సుడ్‌ సర్వేయర్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. దాదాపు ఐదు వేలకుపైగా నియమించినా నెలల తరబడిగా అటు పని, ఇటు జీతభత్యాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి స్థానంలో పేరుకు భూభారతిని తెచ్చినా అందులో భాగంగా ఎంపిక చేసిన లైసెన్సుడు సర్వేయర్లకు మాత్రం అన్యాయం చేస్తున్నారని వివరించారు.

కర్ణాటకలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ప్రతినెల గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేశారనీ, ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ సర్కారు అన్యాయం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారి ప్రధాన సమస్యలతో కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. తమకు లైసెన్సు పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జీతభ త్యాల గురించి పట్టించుకోకుండా తమ కుటుంబాలను రోడ్డున పడేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన భూ సర్వే పనులు నిర్వహించే తమకు స్థిరమైన వేతనం లేకపోవడం వల్ల ఆర్థికంగా చితికిపో తున్నామని వివరించారు.

ప్రతినిత్యం తమను తహశీల్దార్‌ కార్యాలయాలకు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోపెడుతున్నారు తప్ప ఒక్క పని కూడా అప్పగించడం లేదని కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమకు వర్క్‌ అలాట్‌మెంట్‌ విషయంలో స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే ప్రధానంగా సమస్య ఉత్పన్నమైందని వెల్లడించారు. ప్రతి లైసెన్సుడు సర్వేయర్‌కు సమానంగా, పారదర్శకంగా పనులను కేటాయించే విధంగా ఒక సమగ్రమైన విధానాన్ని అమలు చేయాలని సూచించారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -