– అదనపు కలెక్టర్‌కు విద్యార్థి సేన వినతి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ అధునాతన సాంకేతిక కేంద్రం (ఏటీసీ)ను బిక్నూర్ మండలం గుర్జాకుంటలో కాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సేన నాయకులు సోమవారం అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక కేంద్రం విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అని పేర్కొన్నారు. అలాంటి కీలకమైన సంస్థను జిల్లాలోని అన్ని మండలాల విద్యార్థులు సులభంగా చేరుకునే విధంగా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుర్జాకుంటలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జిల్లాలోని అనేక మండలాల విద్యార్థులు ప్రతిరోజూ రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. రవాణా, వసతి, వైద్య సేవలు, ఇతర మౌలిక వసతుల పరంగా కామారెడ్డి జిల్లా కేంద్రం మరింత అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
జిల్లా కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వసతి గృహాలు, బస్సు, రైల్వే రవాణా సౌకర్యాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రధాన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల విద్యార్థులు సులభంగా చేరుకుని అత్యాధునిక సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, సమాన అవకాశాలు, రవాణా సౌకర్యం, అందుబాటును దృష్టిలో ఉంచుకొని గుర్జాకుంటలో కాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్త్మికార్ వినయ్ కుమార్, నాయకులు చందు, నోమన్, ప్రణయ్, పాషా తదితరులు పాల్గొన్నారు.



