– 2000 మందికి ఉద్యోగ అవకాశాలు
నవతెలంగాణ – కామారెడ్డి
ఉద్యోగ, విద్యా, ఉపాధి, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో జి సి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 వ తేదీన కామారెడ్డి పట్టణంలోని పార్శి రాములు కళ్యాణ మండపం వద్ద మేగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్, బ్యాంకింగ్, ఫార్మసీ, సర్వీస్ సెక్టార్, మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఎస్సెస్సీ, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తి చేసిన యువతకు కామారెడ్డిలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలోని 50 కి పైగా ప్రముఖ కంపెనీలు, కామారెడ్డి ప్రాంతంలోని వివిధ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు అందించాలనే సదుద్దేశంతోనే జి సి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి ముందుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ గడ్డం మీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, రంగ రమేష్ గౌడ్, సబ్బాని హరికృష్ణ, గంగారాములు, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్, రాశేఖర్, సునీల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.



