పులిని చంపి గోర్లను కత్తిరించిన వేటగాళ్లు
ముగ్గురిని అదుపులో తీసుకున్న అధికారులు
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మజీ పేట్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుత పులి అనుమానాస్పద మృతి చెందింది. శనివారం సాయంత్రం హన్మజీ పేట్ శివారు అటవీ ప్రాంతంలో ఏడాది వయస్సు ఉన్న ఓ చిరుత మరణించినట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అలాగే డివిజన్ ఫారెస్ట్ అధికారుల తోపాటు జిల్లా ఫారెస్ట్ అధికారిణి బి.నిఖిత, ఐ.ఎఫ్.ఎస్ సంఘటన స్థలం కు చేరుకొని అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెంది ఉండడంతో అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
వెటర్నరీ వైద్యులు వచ్చి పోస్టుమార్టం అక్కడే నిర్వహించారు. స్థానికుల సమాచారం మేరకు చిరుత ఎక్కడో విద్యుత్ ఘాతంతో గాని లేక వేటగాళ్ల దాడిలో మృతి చెంది ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల క్రితమే చిరుత మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉండవచ్చు అని అంటున్నారు. అప్పటికే చిరుత కళేబరాన్ని అడవి కుక్కలు తిన్నట్లు కనిపిస్తుంది, ఇందులో ఒక కాలు పూర్తిగా కనిపించడం లేదు. అలాగే చిరుత పులి కళ్ళ పంజా గోర్లు కత్తిరించినట్లు తెలుస్తుంది.
ఈ చిరుతలు మరణించి నాలుగు ,ఐదు రోజులై ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో జిల్లా అటవీశాఖ అధికారిణి పర్యవేక్షణలో సిబ్బంది విచారిస్తున్నారు. చిరుత పులి మృతితో అనుమానస్పద వ్యక్తులపై విచారణ చేపట్టింది ఇందులో భాగంగా ముగ్గురిని అనుమాన వ్యక్తులను పోలీసుల సమక్షంలో ఫారెస్ట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. వీరివెంట డివిజన్ పారెస్ట్ అధికారి సునీత, రేంజ్ ఆఫీసర్ హబీబ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.



