Sunday, March 15, 2026
E-PAPER
Homeమానవిపుస్తకం అందించే అనుభూతే ప్రత్యేకం

పుస్తకం అందించే అనుభూతే ప్రత్యేకం

- Advertisement -

ఉషా ప్రత్యూష.. చిన్నతనం నుండి పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తకాలే ప్రపంచంగా పెరిగారు. తాను చదివే క్రమంలో కొన్ని పుస్తకాలు తెలుగు పాఠకులకు అందుబాటులో లేకపోవడం ఆమెను ఆలోచింపజేసింది. ఆ ఆలోచనల నుండే ‘బాలా బుక్స్‌’ పుట్టుకొచ్చింది. డిజిటల్‌ యుగంలోనూ పుస్తక ప్రాధాన్యం గురించి పాఠకులకు అర్థం చేయిస్తున్నారు. తన పబ్లికేషన్స్‌ ద్వారా ఎన్నో పుస్తకాలు ముద్రిస్తున్నారు. పుస్తక ప్రేమికులకు వాటిని చేరువ చేస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…

నా స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు. నేను చదివింది అంతా ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలల్లోనే. మా అమ్మ లక్ష్మి, నాన్న భాస్కర్‌. మా నానమ్మ, నాన్న, అత్తలు, అమ్మ అందరూ టీచర్లే. అందుకే మా ఇంటికి స్కూల్‌కి పెద్ద తేడా అనిపించేది కాదు. ఇతర పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చాక ఆటలకెళ్తే, మా ఇంట్లో మాత్రం చేతిలో పుస్తకం ఉండాలి. అది కఠిన నియమంలా కాకుండా ప్రేమగా ఇచ్చే మార్గదర్శనం. మా నాన్న తెచ్చే కథల పుస్తకాలు మా బాల్యంలో పెద్ద ఆనందం. ఒకే కథను మళ్లీ మళ్లీ చదవడం, పాత్రలతో మమేకం కావడం, ఆ ప్రపంచంలో జీవించడం.. అలా పుస్తకాలతో నా అనుబంధం బలపడింది.

పుస్తకాల నుండి దూరం కాలేదు
ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక డిగ్రీలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదివాను. తర్వాత బి.ఎడ్‌ పూర్తి చేశాను. అనంతరం ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో ఎమ్మే చేశాను. మా నాన్న కోరిక నేను కూడా టీచర్‌ అవ్వాలి అనే దాని మీదే ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. కానీ బోధనా వాతావరణంలో పెరిగిన నేను పుస్తకాల నుంచి మాత్రం దూరం కాలేదు. 2016లో నా వివాహం జరిగింది. నాలుగేండ్లలో ఇద్దరు పిల్లలు. ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, కుటుంబ అవసరాలు.. ఇవన్నీ నా రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ పుస్తకాలపై ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు. గత ఐదేండ్లుగా నిశ్శబ్దంగా ప్రచురణకు సంబంధించిన బ్యాగ్రౌండ్‌ పనులు నేర్చుకుంటూ వచ్చాను. ఒక పుస్తకం ఎలా తయారవుతుంది, టైపింగ్‌ నుంచి లేఅవుట్‌ వరకు, కవర్‌ డిజైన్‌ నుంచి ప్రింటింగ్‌ వరకు, పంపిణీ.. ఇలా ప్రతి దశ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను.

కొన్ని పుస్తకాలు దొరకలేదు
పిల్లలు స్కూల్‌కి వెళ్లడం మొదలైన తర్వాత మళ్లీ నా పఠనం మొదలైంది. దొరికిన ప్రతి పుస్తకం చదువుతూ ముందుకు సాగాను. చదవాలని ఎంత ఆశించినా కొన్ని పుస్తకాలు తెలుగులో లేవని తెలిసి అసంతృప్తి కలిగింది. ఎందుకు ఇతర భాషలలో ఉన్న గొప్ప సాహిత్యం మన భాషలో అందుబాటులో ఉండకూడదు? అనే ప్రశ్న నన్ను వెంటాడింది. కొంతమంది ప్రచురణ సంస్థలను అడగగా అవి అవుట్‌డేటెడ్‌ పుస్తకాలని, కావాలంటే పీడీఎఫ్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చదవమని చెప్పారు. నాకు అది సరిపోలేదు. పుస్తకం అంటే కేవలం అక్షరాలు కాదు. చేతిలో పట్టుకుని పుటలు తిరగేయడం, పేపర్‌ వాసన, మళ్లీ మళ్లీ చదవగల అనుభూతి.. ఇవన్నీ పుస్తకానికే ప్రత్యేకం.

విలువలు అందివ్వాలనే…
సంస్థను ప్రారంభించిన ఏడాది కాలంలోనే 39 పుస్తకాలను ప్రచురించగలిగాం. 2026 ప్రారంభంలోనే తిరుపతి పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంలో మరో 23 పుస్తకాలు ప్రచురణ జాబితాలో చేరాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థల నుండి అనువాద హక్కులు పొందేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే జాతీయ స్థాయి ప్రచురణ సంస్థల నేషనల్‌ బెస్ట్‌ సెల్లర్లు కూడా తెలుగువారి కోసం ‘బాలా బుక్స్‌’ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇది ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక తెలుగు పాఠకురాలిగా నా ప్రయాణం. టీచర్‌ కాలేకపోయినా, పుస్తకాల ద్వారా నేర్చుకున్న విలువలను సమాజానికి తిరిగి ఇవ్వాలనే నా ప్రయత్నం. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది.. కొన్ని పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలి. అవి కాలానికి అతీతం. అవి మన సంస్కృతిని, మన జ్ఞాపకాలను, మన భావోద్వేగాలను కాపాడేవి. అందులో భాగంగానే ‘బాలా బుక్స్‌’ ఆ బాధ్యతను స్వీకరించి ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది.

బాలా బుక్స్‌
టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఇంటి నుంచే ఒక పుస్తకాన్ని సృష్టించగలనని నాకు నమ్మకం వచ్చింది. నాకు ఎంతో ఇష్టమైన, అందుబాటులో లేని కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటిని మళ్లీ టైపింగ్‌ చేయించి, బుక్‌ మేకింగ్‌ చేసి, కొత్త రూపంలో ముద్రించాను. ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకున్న క్షణం నాకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన ఒక కల నెరవేరిన భావన. నాకే ఇంత అనిపిస్తే, ఆ పుస్తకాలతో పెరిగిన ముందుతరం పాఠకులకు ఇవి చేరితే బాగుంటుందనే ఆలోచించాను. అదే క్షణంలో ఓ నిర్ణయం తీసుకున్నాను. కొన్ని పుస్తకాలు కాలంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండాలి. ‘బాలా బుక్స్‌’ ఆ ఆలోచన నుంచే పుట్టింది.

ప్రచురణ కర్తగా…
2025 జనవరి 20వ తేదీన మా అమ్మా నాన్నలైన లక్ష్మి, భాస్కర్‌ మొదటి అక్షరాల కలయికగా ‘బాలా బుక్స్‌’ అనే పేరుతో నా ప్రచురణ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇది ఒక వ్యాపార ఆలోచన కంటే ఎక్కువ. నా బాల్యం, నా కుటుంబం, నా పుస్తకాల పట్ల ప్రేమకు ఒక రూపం. లాభనష్టాల లెక్కలకంటే విలువైన పుస్తకాలను అందించాలనే కోరికతోనే మొదలైంది. కేవలం రీప్రింట్‌ పుస్తకాలే కాదు.. దేశీయ, జాతీయ, అంతర్జాతీయ భాషలలోని రచనలను తెలుగులోకి తీసుకురావడం, ప్రాంతీయ కథలను వెలుగులోకి తేవడం, ఇతర భాషల నవలలను అనువదించడం, పిల్లల సాహిత్యాన్ని సమృద్ధిగా అందించడం.. ఇవన్నీ మా ప్రయాణంలో భాగం.

అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -