ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘పాతాళభైరవి’కి 75 వసంతాలు
పాతాళభైరవి.. జానపద చిత్రాలకు కొత్త ఒరవడిని సృష్టించిన చిత్రం. అప్పట్లోనే పక్కా కమర్షియల్ సినిమాకి నిర్వచనమిచ్చి, ఏకంగా 200 రోజులు ఆడింది. ప్రేమించిన రాజకుమారి కోసం ఓ సామా న్యుడు చేసిన సాహసభరిత ప్రయాణం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. కథా కథనాలతోపాటు సాంకేతిక నైపుణ్యం కూడా అందర్నీ అబ్బురపరిచింది. ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసిన ఈ చిత్రం విడుదలై (మార్చి 15, 1951) నేటితో (ఆదివారం) 75 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు..
విజయా బ్యానర్ ఆస్థాన రచయిత పింగిళి నాగేంద్ర రావుతో కలిసి బి.ఎన్.రెడ్డి అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లావుద్దీన్ అండ్ వండర్ల్యాండ్ ప్రేరణతో, కాశీ మజిలీ కథల ధోరణిలో ఈ కథని సిద్ధం చేశారు. తోట రాముడు.. నేపాళ మాంత్రికుడు.. ఈ రెండు పాత్రలు ఈ సినిమాలో చాలా కీలకం. తొలుత ఈ పాత్రలకు ఏయన్నార్, గోవిందరాజుల సుబ్బారావుని తీసుకోవాలనేది నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డిల అభిప్రాయం. అయితే వీరి అభిప్రాయాన్ని దర్శకుడు కె.వి.రెడ్డి అంగీకరించలేదు. చివరికి తోట రాముడి పాత్రలో ఎన్టీఆర్‌ని, నేపాళ మాంత్రికుడిగా ఎస్వీ రంగారావును కె.వి.రెడ్డి ఫైనల్ చేశారు. అయినప్పటికీ నిర్మాతల్లో ఎక్కడో చిన్నపాటి అసంతృప్తి. వారి అసంతృప్తిని కనిపెట్టిన కె.వి.రెడ్డి సినిమాలోని బొడ్డుదేవరను పగలగొట్టే సన్నివేశాన్ని ఎన్టీఆర్‌తో చిత్రీకరించి, నిర్మాతలకు చూపించారు. రష్ చూసి ఓకే అన్నాక, ఎన్టీఆర్‌ను తోటరాముడిగా ఖరారు చేశారు.
ఏయన్నార్‌కి బదులు ఎన్టీఆర్‌ని తోటరాముడు పాత్ర ఎలా వరించిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఓ రోజు వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఏయన్నార్ సరదాగా టెన్నిస్ ఆడుతున్నారు. వరుసగా నాలుగు బంతులను ఎన్టీఆర్ మిస్ చేశారు. దీంతో ఆయనలో ఒక్కసారిగా కసి పెరిగింది. రెండు చేతులతో గట్టిగా రాకెట్‌ను పట్టుకుని బలంగా బంతిని బాదారు. అది కాస్తా స్టూడియో దాటి దొరక్కుండా పోయింది. దూరం నుంచి ఇదంతా గమనించిన కె.వి.రెడ్డి ‘తోటరాముడు’ పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. తోటరాముడుగా ఎన్టీఆర్, నేపాళ మాంత్రికుడిగా ఎస్వీఆర్‌ల నటన వెండితెరపై అత్యద్భుతమైన మాయాజాలం చేసింది. ఇక ఎన్టీఆర్‌కు తోడుగా ఉండే అంజిగాడు పాత్రను హాస్య నటుడు బాలకృష్ణ, ఉజ్జయినీ మహారాజు బావమరిది వీరధీర శూరసేనుడిగా రేలంగి, మాంత్రికుడి సహాయకుడు సదా జపుడిగా పద్మనాభం, సురభి కమలాబాయి తోటరాముడి తల్లిగా, కథా నాయికగా మాలతి సైతం అద్భుతంగా నటించారు.
మార్కస్ బార్ట్లే కెమెరా పనితనం, పింగళి నాగేంద్ర రావు రాసిన మాటలు, ఘంటసాల అందించిన సంగీతం, పాటలు.. వెరసి సినిమాని ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. ‘సాహసం సేయరా డింభకా.. రాకుమారి దక్కునురా..మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా..జనం అడిగింది మనం చేయ వలెనా? మనం చేసింది జనం చూడవలెనా?. వంటి డైలాగులు, ‘కలవరమాయె మదిలో..’, ‘ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు’ వంటి తదితర పాటలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి.
10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీసిన సినిమా కూడా. మనం దేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించిన ఏకైక దక్షిణ భారతీయ చిత్రమిది. ఈ సినిమా రిలీజైన 30 ఏళ్ళ తరువాత జితేంద్ర, జయప్రదతో హిందీలో రీమేక్ చేశారు.


