‘మావాడు నిద్ర లేవనే లేవడు.. లేస్తే మాత్రం కథ మామూలుగా ఉండదు…’ అప్పుడప్పుడు మనోళ్లు చెప్పే మాట ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురించి ఇదే ముచ్చట నడుస్తోంది. ప్రతీసారీ..’సారు బయటకొస్తారు, అసెంబ్లీలో ఇరగదీస్తారు.. ఇగజూస్కో నా సామిరంగా.. అధికార పార్టీకి మామూలుగా ఉండదు మరి…’ అనటం గులాబీ దళానికి మామూలైపోయింది. కానీ, సారు బయటకు వచ్చేది లేదు.. వచ్చినా అసెంబ్లీలో ఒక్కరోజైనా కుదురుగా కూర్చునేది లేదు.. ఇదీ జరుగుతున్న తంతు. సాంకేతికంగా ఆర్నెల్లకోసారి అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు పెట్టాలే కాబట్టి.. దాని కోసం ‘ఇలా వచ్చుడు.. అలా పోవుడు…’ అన్నట్టుంది బీఆర్ఎస్ బాస్ పరిస్థితి. ఆయన ఏ కారణం చేత రాలేకపోతున్నారో ఎవ్వరికీ తెలియదు. అయినా తన స్థానం (అపోజీషన్ లీడర్ ప్లేసు)లో ఇంకొకర్ని కూర్చోబెట్టొచ్చుగదా.. అంటే అదీ లేదు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల పంచాయితీల్లో ఈ స్థానం ఎవరికివ్వాలో తేల్చుకోలేక పోతున్నడు పెద్దసారు. దీంతో అసెంబ్లీ సమావేశాల తొలి రోజు నుంచే సభలో లొల్లి స్టార్ట్ చేయటం, ఆ తర్వాత సమావేశాలను బాయ్ కాట్ చేయటం కారు పార్టీ ఎమ్మెల్యేలకు షరా మామూలైపోయింది. కానీ ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఇది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వం ఎంత రెచ్చగొట్టాలని చూసినా, రెచ్చిపోకుండా ఓపికతో, సహనంతో ప్రజా సమస్యలను సభలో ఏకరువు పెట్టటం ద్వారా వాటి పరిష్కారానికి ప్రధాన ప్రతిపక్షం కృషి చేయాలిగదా..? అంటున్నారు మేధావులు. అప్పుడే అపోజీషన్ పార్టీకి సరైన గౌరవం, గుర్తింపు దక్కుతాయన్నది వారి విశ్లేషణ. ఈ వాదనలు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. ఈసారైనా టైగర్ (కేసీఆర్) అసెంబ్లీకి వస్తారా? వచ్చి కార్యకలాపాల్లో, చర్చల్లో పాల్గొంటారా? అనేది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న.
-బి.వి.యన్.పద్మరాజు
టైగర్ బయటకొచ్చేనా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


