బంగారక్క : ఎగిరిపడకు ఎగిరిపడకు సిరిగలనా కొడకా… సిరిగలనాకొడకా.. నీవు తొందరపడకా… తొందరపడితే నీకు ముందరికాళ్ల బంధమే.. ముందరికాళ్ల బంధమే (డాన్స్)
కేతిగాడు : ఏందమ్మీ.. ఎప్పుడూ మేం పాడుతూ గంతులేస్తాం. ఈసారేంది నీకు నువ్వే పాడుకుంటూ డాన్స్ చేస్తున్నావ్.
బంగారక్క : సీన్ రివర్స్ అయింది మావా..
కేతిగాడు : ఒరే జుట్టుపోలుగా, అల్లాటప్పాగా… అందరూ ఇటురాండ్రి. బంగారక్క మంచి విషయం చెప్తుంది.
బంగారక్క : అరె జుట్టుపోలుగా, నీవు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేషం కట్టావ్. అల్లాటప్పాగా.. నీవు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వేషం కట్టావ్. ఇద్దరూ నరహంతకులు అవునా….
ఇద్దరూ : అవును కట్టాం. ఏమైంది?
బంగారక్క : (కేతిగాడ్ని చూపుతూ) మావా.. నీవు ఇప్పుడు ఇరాక్ పులి. మీరిద్దరూ ఈ పులిని చంపాలని అకస్మాత్తుగా దానిపై దాడిచేశారు. దాంతో అది ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. మీరు జారిపడి చేసేది లేక దాని తోకట్టుకున్నారు. అది కోపంతో ఇష్టం వచ్చినట్టు గాండ్రిస్తూ… కొండలు గుట్టలు, అడవులు తిరుగుతుంది. దాంతో పాటు దాని తోకట్టుకున్న మీరూ ఈడ్వబడుతున్నారు. మీ వంటినిండా గాయాలు రక్కుకుపోతున్నాయి.
ఇద్దరూ : అయితే మేం తోక వదిలేస్తాం.
కేతిగాడు : వెంటనే వెనక్కి తిరిగి అమాంతం మిమ్మల్ని మింగేస్తానుగా..
జుట్టుపోలుగాడు : ఇప్పుడెలారా చచ్చేది. తోక వదిల్తే ఆ పులి మమ్మల్ని తినేస్తది.
అల్లాటప్పాగాడు : వదలకపోతే వళ్లంతా చీరుకుపోతుంది. మరిప్పుడేం చేయాలి?
బంగారక్క : సరిగ్గా అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇదే పరిస్థితి. అందుకే నా పాట.. నా డాన్స్. ‘ఇరాన్ పనైపోయింది. ఇరాన్ పాలకుల్ని మేమే నిర్ణయిస్తాం అని విర్రవీగిన ట్రంప్‌కు ఇరానే షరతులు పెడుతుందిప్పుడు.
ముగ్గురూ : ఏం షరతులు?
బంగారక్క : ముచ్చటగా మూడు షరతులు. 1. ఇరాన్ దేశ చట్టబద్దమైన హక్కులు గుర్తించాలి. 2. యుద్ధం వలన ఇరాన్‌కు జరిగిన నష్టపరిహారం చెల్లించాలి. 3. తమ దేశంపై భవిష్యత్లులో ఎలాంటి దురాక్రమణ దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ ఇవ్వాలి. ఇవన్నీ సబబుగానే వున్నాయి. ఇందులో న్యాయం వుంది. ప్రజాస్వామ్య భావన వుంది. ఎవరైనా వీటిని గౌరవించాల్సిందే. కానీ మరో చిక్కొచ్చింది.
ముగ్గురూ : చిక్కా… ఏమిటది?
బంగారక్క : ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా ఖొమైనీ స్థానంలో వచ్చిన ఆయన కొడుకు మొజ్తబా ఖొమైనీ ఇంతకు ఇంత బదులు తీసుకుంటానని ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు. తమ పిల్లలనూ నేతలను, ప్రజలను నిష్కారణంగా బలి తీసుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేనే లేదని పట్టుబడ్తున్నాడు.
కేతిగాడు : వదలా.. బొమ్మాళీ..
బంగారక్క : ‘మా చుట్టుపక్కలున్న గల్ఫ్ దేశాలతో మేం స్నేహం చేస్తాం. అదే సందర్భంలో ఆ దేశాల్లో ఏర్పాటు చేసుకున్న అమెరికా సైనిక స్థావరాలపై మేం నిరంతరం దాడులు చేస్తూనే వుంటాం. మా దేశం కోసం ప్రాణాలివ్వడానికి సైనికులతో పాటు యువత కూడా అసంఖ్యాకంగా రంగంలోకి దిగుతున్నది. అన్యాయంగా దెబ్బతిన్న మా ప్రజలకు అండగా నిల్వడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొస్తున్నది’ అని చెప్తున్నాడు.
కేతిగాడు : మరైతే యుద్ధం ఇప్పట్లో ముగియదా అమ్మీ?
జట్టుపోలుగాడు : ఇప్పటికే తిండి తిప్పలు మొదలయ్యాయి. గ్యాస్ ధర పెరిగి హోటళ్లు మూతపడ్తున్నాయి. చిన్నచిన్న ఉద్యోగాలు పోతున్నాయి.
అల్లాటప్పాగాడు : ఇక ఇప్పుడు పరిష్కారం ఏంటి?
బంగారక్క : పరిష్కారం రాత్రికి రాత్రి ఒక్కసారిగా రాదు. యుద్ధం మొదలెట్టడం అంటే అడవికి అగ్గిరాజెయ్యడమే. ఆ కార్చిచ్చు దావానలంలా శరవేగంతో నలుదిక్కులా పాకుతుంది. అందుకే దేశాధినేతలు ఇష్టం వచ్చినట్టు లేడికి లేచిందే పరుగులా వ్యవహరించకూడదు. ప్రజలకు, ప్రజల ప్రాణాలకు బాధ్యత వహిస్తూ కడు జాగ్రత్తగా మెలగాలి. మూర్ఖులు హంతకులు నేతలైతే ప్రపంచ మానవాళికి తీరని నష్టం అని మరోసారి రుజువవుతుంది. రాజులకాలం నాటి దండయాత్రలు దాటి ఆధునిక డిజిటల్ శకంలో ప్రవేశించాం. అయినా హింస, ఉన్మాదం, యుద్ధపిచ్చి ముదరడం ఎవరికీ ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. సర్వేజనా సుఖినోభవంతు.
– కె.శాంతారావు, 9959745723
పెద్దపులి తోకట్టుకున్నారు
- Advertisement -
- Advertisement -



