Sunday, March 15, 2026
E-PAPER
Homeహెల్త్వినికిడి సమస్య-కొన్నివివరాలు

వినికిడి సమస్య-కొన్నివివరాలు

- Advertisement -

ప్రస్తుత సమయంలో ప్రపంచ జనాభాలోని సుమారుగా ఐదు నుండి ఏడు శాతం ప్రజలు ఎదుర్కుంటున్న సమస్య ఇది! నిపుణుల అంచనా ప్రకారం ఈసమస్యను ఆరోగ్యవేత్తలు, సంస్థలు తగినంతగా పట్టించుకోకపోతే, ఈ తీవ్రత 2050 సంవత్సరానికి ద్విగుణీకతమవ్వ వచ్చని నిపుణుల అంచనా!

సమస్య ఎలా మొదలవ్వవచ్చు?
లింగ/ వయసుతో నిమిత్తం లేకుండా, ఒక సమూహంలో ఉన్న ఒకవ్యక్తికి తోటివారికంటే, ఒకేరకమైన ధ్వనులకు, తక్కువ వినికిడి కలుగుతుందంటే, దానిని వినికిడి సమస్యగానే పరిగణించవచ్చు.
రెండు రకాలు -ఒకటి మంద్రస్థాయిలో మొదలయ్యి, క్రమేణా తీవ్రస్థాయికి చేరుకోవచ్చు. కొన్నికారకాలను బట్టి మొదలైన వెనువెంటనే త్వరితగతిలో తీవ్రస్థాయికి చేరుకోవచ్చు; సంభాషణల్లో పాల్గొనడం కష్టమవచ్చు. దీనిని వినికిడి కొంత లోపించినట్టుగా భావించడం జరుగుతుంది; ఆ తరువాత వినికిడిని పూర్తిగా కోల్పోవచ్చు.
చెవి పరీక్ష ద్వారా నిర్ధారించబడే వినికిడి స్థాయి మామూలుగా ఉండవలసిన 0-20/25 డెసిబుల్స్‌ పరిమితి కంటే పెరిగి ఉండడాన్ని వినికిడి లోపం అని, సాధారణ పరిమితికంటే ఎన్నోరేట్లు పెరిగి, తొంభై దాటితే, తీవ్రమైన వినికిడిలోపం/ పూర్తి చెవుడుగా పరిగణించవచ్చు.
(సాధారణ పరిమితి 0-20/25; సమస్య-మంద్ర 26-40; మధ్యమ 41-55-60; తీవ్ర 61/71-90.)
ఒకచెవి/ రెండుచెవులూ సమస్యకు గురికావొచ్చు.
కారణాలు:
రుబెల్లా, సైటోమెగాలో వైరస్‌ వంటి జనన పూర్వ మాతగర్భాశయ వ్యాధులు, జన్యుపరమైన/ ఇతర కారణాలవలన కలిగే అభివద్ధి లోపాలు, జనన సమయంలో బిడ్డకు సరిగా ఆక్సిజన్‌ అందనప్పుడు, తీవ్రమైన జాండిస్‌, తక్కువ బరువు, చెవికి సంబంధించిన అంటువ్యాధులు ముఖ్యంగా దీర్ఘకాల-తిరగబెడుతున్నటువంటి వ్యాధులు, చెవిలో నీరు చేరి ఉండడం, మెదడు వాపు, ఇతర చెవి- ముక్కు-గొంతుకు సంబంధించిన వ్యాధులు, పెద్దవారిలో పొగ తాగడము, వయసుతో కూడుకొన్న సెన్సోరిన్యూరల్‌ వినికిడిలోపం, చెవిలో చిక్కుకొన్న గులిమి, చెవి-తలకు గాయం, పెద్దచప్పుళ్లకు గురి కావడం, చెవిలో రసాయనరాల- నూనెల, పని/ వత్తిపరంగా వినికిడిని ప్రభావితం చేసే మందుల/ రసాయనాల, ఎక్కువ ఫ్రీక్వెన్సీ మైక్రోఫోన్‌ వాడకం, పోషకాహార లోపాలు, చెవిలో టూమర్లు, స్విమ్మింగ్‌ పూల్‌ ఇన్ఫెక్షన్లు, దుమ్ము- దుమారం- ధ్వని నుండి చెవులను కాపాడక పోవడం, చెవులను పిన్నులు/ పుల్లలతో శుభ్రపరచే ప్రయత్నాలు.
గుర్తించడం ఎలా?
సామాన్యంగా అందరికీ వినిపించే పరిధిలో/ ధ్వని మోతాదులో అలవాటు పడినవాళ్ళు, కొత్తగా చెవులు నిక్కబొడుచు కొని వినడం, చెప్పింది అర్థం కానట్టు ముఖ కవళికలు, మళ్ళీ చెప్పమని అడగడం, మాట్లాడుతున్న వారి పెదవుల కదలికపై దష్టి పెట్టడం వంటి సూచికలు పెద్దవాళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది.
పుట్టుకతోటే సమస్య ఉన్న పిల్లలు సమయానుకూలంగా శబ్దాలకు ఇవ్వాల్సిన స్పందన ఇవ్వకపోవడం మొదటి సూచనగా తల్లితండ్రులు అనుమానించి/ గుర్తించి, వెనువెంటనే పిల్లల వైద్యులను సంప్రదించాలి. వయసుకు తగ్గ శారీరక, మానసిక, ప్రవర్తన తీరుతెన్నులు, ఎదుగుదల మైలురాళ్లు తగుపాళ్లల్లో/ రీతిలో లేకపోవడం, మాటలు రాకపోవడం, స్కూల్లో టీచర్లు చెప్పేది గ్రహించలేక పోవడం, ఎవరితోనూ కలవడం ఇష్టపడకపోవడం ఇలా రకరకాల సూచికలు వినికిడి సమస్యగా తేలే అవకాశముంది.
నిపుణుల సంప్రదింపు, తగు పరీక్షలు చేయించడం ద్వారా ముందస్తుగా వినికిడి సమస్యను నిర్ధారించి తగు చికిత్సా ప్రక్రియలు చేపట్టడం వలన సమస్యను అరికట్టవచ్చు; నిర్ములించడం కూడా సాధ్యమవచ్చు.
వినికిడి లోపం వలన కలిగే పర్యవసానాలు:
వ్యక్తిగతంగా, లోపం ఉన్న వ్యక్తుల సాంఘిక సామర్థ్యతలు సన్నగిల్లుతాయి; కుటుంబ సభ్యులు, మిత్రులు, సహోద్యోగుల నుండి దూరమౌతారు. వారితో ఎవరూ కూడా యధాలాప సంభాషణలు జరుపలేకుండా అయిపోతారు. సామజిక వివక్షకు గురయ్యే అవకాశం ఎక్కువ. వారు నేర్చుకొనే అవకాశాలు కోల్పోతారు; ఒంటరితనం, ఇతరుల చిన్నచూపుకు గురౌతారు. మంచి చదువుకు, ఉద్యోగాలకు, భవిష్యత్తుకు, మేధస్సు, పనితనం ఉన్నా, అనర్హులయి పోతారు; మానసికంగా కృంగిపోతారు.
నివారణ?
ఆడా- మగా తేడా లేకుండా, అందరినీ కలవరపరిచే, తల్లిగర్భం నుండి కూడా మొదలు కాగలిగే ఈ సమస్య, ఆరోగ్యపరమైన అవగాహనతో పొందుపరిచే ప్రజారోగ్య రక్షణపథకాల అమలు ద్వారా అరికట్టవచ్చు.
గర్భాశయ వ్యాధులు రాకుండా తల్లికి సరైన సమయాల్లో టీకాలు ఇవ్వడం, తల్లి-బిడ్డ సంరక్షణ, జన్యుపరమైన కౌన్సిలింగ్‌, తరచుగా వచ్చే చెవి అంటువ్యాధులు, వాటినుండి రక్షణ పొందే సూచనలు, చికిత్సపట్ల అవగాహన – అన్ని వయసుల వారికీ తగిన నివారణ చర్యలు చేపట్టాలి.
ఉద్యోగ/ వత్తిపరంగా తీవ్రస్థాయి ధ్వనుల/ చప్పుళ్ల నుండి ఏవిధంగా చెవులను కాపాడుకోవాలి, వినికిడిని ప్రభావితం చేసే రసాయనాలు- మందుల పట్ల అవగాహన, వినోద భరిత కార్యకలాపాల్లో జరిగే శబ్ద కాలుష్యాన్ని ఎలా తట్టుకోవాలో, ఇయర్‌ఫోన్‌ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి చర్యలు వివిధ మీడియా ద్వారా చేపట్టాలి.
చికిత్స:
వినికిడి సమస్యను ఎంత ముందస్తుగా గుర్తించగలిగితే చికిత్స అంత సులువౌతుంది. ఈ సమస్యను ప్రప్రథమంగా గుర్తించగలిగేది తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, టీచర్లు, తోటివిద్యార్థులు, సహచరులు, మిత్రులు! వెంటనే ప్రణాళికపూర్వకంగా, వైద్య సంప్రతింపు ద్వారా, పద్ధతిలో పరీక్షలు జరిపించాలి. చికిత్స విధానాల వైవిధ్యం దష్ట్యా ఈ శీర్షికలో పొందుపర్చడం వీలుకాదు!
వినికిడి సమస్య/ పూర్తి చెవుడు ఉన్నవారిని, వారి జీవితాలు వీలైనంత సాధారణ పద్ధతిలో గడపగలిగి, తమ ధ్యేయాలను సాధించుకునే విధంగా పునరావాస వసతులు కల్పించడం, వారి సమస్యకు స్తోమతానుకూల చికిత్సా విధానాలను అందుబాటులో ఉండేటట్టు చూడడం ఆరోగ్య వ్యవస్థ కర్తవ్యం; ఈ దిశగా డబ్ల్యూహెచ్‌ఓ ముమ్మరంగా కషిచేసి వినికిడి సమస్య తీవ్రత, సమస్య ఎలా మొదలవచ్చు, నివారణ చర్యలు, తప్పని పరిస్థితుల్లో సమస్య ఎదురైతే ఎవరిని సంప్రతించాలి, చికిత్సా విధానాలు, అవిలభించే కేంద్రాలు, వాటికీ అయ్యేఖర్చు, పేదవర్గం ప్రభుత్వం నుండి సహాయం ఏవిధంగా పొందవచ్చు వంటి కీలక విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కొన్ని మార్గదర్శకాలను తయారు చేసింది.
వినికిడి సమస్య సకాల సరైన చికిత్సా విధానాలను చేపడితే, తాత్కాలిక ఇబ్బందికి మాత్రమే గురిచేస్తుంది; నిర్లక్ష్యం చేస్తే జీవితగతి విధుల్ని మార్చేసి, వ్యక్తుల్ని నిర్వీర్యంగా చేయగలదు. రోజువారీ ఎవరితోనూ సంభాషించలేక, ఏ విషయమూ సమగ్రంగా తెలుసుకోలేక, నేర్చుకోలేక, స్వీయన్యూనతతో, జీవిత ప్రామాణ్యత కోల్పోయేలా చేస్తుంది. ఇప్పుడున్న మెడికల్‌ టెక్నాలజీతో అలా అవ్వవల్సిన అవసరం ఏమాత్రమూ లేదు; సకాల సరైన వైద్యనిపుణుల సంరక్షణలో మీ వినికిడి క్షేమంగా తిరిగి వస్తుంది!!!

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ / ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -