Sunday, March 15, 2026
E-PAPER
Homeజోష్ఒంటి వైకల్యం మనసుకంటనీకు

ఒంటి వైకల్యం మనసుకంటనీకు

- Advertisement -

”వైకల్యపు జీవితమని వగపేల నీకు/ ఒంటికె వైకల్యము మనస్సుకంటనీకు” అన్న కవి శేషగిరి పాట తాన్యా నాథన్‌ లాంటి గురించే అయి ఉంటుంది.

శారీరక వైకల్యం అనేది కేవలం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని కేరళకు చెందిన తాన్యా నాథన్‌ నిరూపించారు. అంధత్వాన్ని శాపంగా భావించకుండా, తన ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారామె. చట్టం కండ్లకు గంతలు ఉంటాయి. అది నిష్పక్షపాతానికి సంకేతం. కానీ, అదే న్యాయపీఠంపై ఒక అంధురాలు కూర్చుని తీర్పులు ఇస్తే.. ఆ ఆలోచనే ఒకప్పుడు అసాధ్యం. కానీ, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు 24 ఏండ్ల తాన్యా నాథన్‌.
కేరళ జుడీషియల్‌ సర్వీస్‌ పరీక్షల్లో వికలాంగుల విభాగంలో మొదటి ర్యాంకు సాధించి, రాష్ట్రంలోనే తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డు సష్టించారు. ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది వికలాంగులకు కొత్త ఆశలను, ఆశయాలను చిగురింపజేస్తోంది.

పట్టు పడితే అంతే…
‘చట్టం, న్యాయం అత్యంత శక్తిమంతమైన ఆయుధాలు. వాటిని అందుకోవడంలో ఏ ఒక్కరూ వెనకపడకూడదు’ అన్న ఆలోచన తాన్యకు పదో తరగతి చదువుతున్నప్పుడే వచ్చింది. ఇంటర్మీడియట్‌ పూర్తయిన వెంటనే లా ప్రవేశ పరీక్ష రాసి కన్నూర్‌ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించారీమె. ఆ బ్యాచ్‌లో తాన్య ఒక్కరే దష్టిలోపం ఉన్న విద్యార్థిని. దాంతో మిగతా వాళ్లతో సమానంగా చదవలేక పోయేవారట. అయినా వెనకడుగు వేయలేదు. బ్రెయిలీ మెటీరియల్‌ లేక మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డిందామె. తర్వాత స్క్రీన్‌ రీడింగ్‌ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి మెళకువల్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు. మెటీరియల్‌లో ఉన్న విషయాల్ని విని, బ్రెయిలీలో పాయింట్లు రాసుకోవడం అలవాటు చేసుకున్నారు. తన కషికి ఫలితంగా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. 2024లో బార్‌ కౌన్సిల్‌లో చేరి, స్థానిక లాయర్‌ దగ్గర ట్రైనీగా శిక్షణ ఆరంభించారు. విద్యాభ్యాసాన్ని ఎన్నో సవాళ్ల మధ్య కొనసాగించారు తాన్యా. దష్టి లోపం ఉన్నప్పటికీ, పట్టుదలతో బ్రెయిలీ లిపి సాయంతో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. చదువుకునే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఎక్కడా వెనకడుగు వేయకుండా తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. కేవలం అక్షరాలను చదవడమే కాదు, న్యాయ సూత్రాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని పోటీ పరీక్షల్లో తన ప్రతిభను చాటారు. ఒక సామాన్య విద్యార్థిగా మొదలైన ఆమె ప్రయాణం నేడు న్యాయపీఠం ఎక్కే స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది.

సవాళ్లను అధిగమించి
శిక్షణ ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారీమె. కోర్టు రూమ్‌లోకి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకి అనుమతి ఉండేది కాదట. దాంతో ఆర్గ్యుమెంట్‌ నోట్స్‌ను ముందుగానే బ్రెయిలీలో సిద్ధం చేసుకునేవారట. అలా ఏడాదిగా శిక్షణలో ఉన్నారు. ఈ క్రమంలో జ్యుడీషియల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో సీనియర్లు ఆ ఎగ్జామ్‌ రాయమని సలహా ఇచ్చారు. ఈ పరీక్షకు సిద్ధం కావాలంటే సామాన్యమైన విషయమా? అందుకు శిక్షణ చాలా అవసరం. ఈ క్రమంలో ఆమెను ‘కోర్టుకి దూరమవుతానా- అన్న భయం వెంటాడింది. గెలుస్తా అన్న నమ్మకం కంటే… ఓడినా అదో పాఠం అవుతుందన్న ఆలోచనతోనే ప్రయత్నాలు ప్రారంభించారు. స్వయంగా నోట్స్‌ తయారుచేసుకుని చదవడం మొదలుపెట్టారు. కట్‌ చేస్తే వికలాంగుల కేటగిరీలో టాపర్‌గా నిలిచారు. 24ఏండ్ల వయసులోనే కేరళలో సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)గా విధులు నిర్వర్తించనున్నారు. ‘ఇప్పటికీ సవాళ్లు ఉన్నాయి. అయినా భవిష్యత్తులో వాటన్నింటినీ దాటగలను అన్న నమ్మకం నాకుంది. వైకల్యం కారణంగా ఎవరూ బలహీనులు కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి సానబెట్టే ప్రయత్నాలు చేస్తే విజయం తప్పక వరిస్తుందని’ అంటారీ యువ న్యాయమూర్తి.

అత్యున్నత న్యాయస్థానం గుర్తించడం
గతంలో ఉన్న కొన్ని పరిమితుల వల్ల దష్టి లోపం ఉన్నవారు న్యాయమూర్తులుగా పనిచేయడానికి అడ్డంకులు ఉండేవి. అయితే, దష్టి లోపం ఉన్న అభ్యర్థులు కూడా న్యాయ వ్యవస్థలో సమర్థవంతంగా విధులు నిర్వహించగలరని సుప్రీంకోర్టు గత ఏడాది సంచలన తీర్పు వెలువరించింది. ఈ చారిత్రాత్మక తీర్పు తాన్యా వంటి ఎంతోమంది కలలకు రెక్కలు తొడిగింది. న్యాయ వ్యవస్థలో వికలాంగుల భాగస్వామ్యం అవసరమని అత్యున్నత న్యాయస్థానం గుర్తించడం, తాన్యా తన కలను నిజం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మారింది.
తాన్యా నాథన్‌ విజయం కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, అది సామాజిక మార్పుకు నిదర్శనం. అడ్డంకులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, పోరాడే గుణం ఉంటే ఆకాశమే హద్దు అని ఆమె నిరూపించారు. త్వరలోనే ఆమె న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, తన వివేచనతో బాధితులకు న్యాయం అందించనున్నారు. వైకల్యం అనేది ప్రతిభకు అడ్డుకాదని, బలమైన సంకల్పం ఉంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని తాన్యా ప్రయాణం మనందరికీ నేర్పే గొప్ప పాఠం.

– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -