బొట్టు బొట్టుకూ, ప్రతి కన్నీటి బొట్టుకూ సమ్మిళితమైన ‘మిళింద’ కథా ప్రవాహం సాగిపోతూ ఉంది. మానస ఎండ్లూరి ‘మిళింద’ లో మొత్తం ఇరవై రెండు కథలు ఉన్నాయి.వాటిలో బొట్టు మీద ఐదు కథలు ఉన్నాయి. ఈ బొట్టు కథలు వివిధ వ్యధల సమాహారం. ఒక బొట్టు మీదనే దాదాపు ఐదు కథలు మిళింద కథల్లో ఉన్నాయంటే… బొట్టు వల్ల సమాజంలో సామాజికంగా, ఆర్ధికఅసమానతలుగా, మత పరంగా ఎంతటి అమానవీయ సంఘటనలు పెనవేసుకున్నాయో గమనించవచ్చు. ఈ ‘తుమ్మెద’ బొట్టుపై వాలి వివిధ వ్యధలను సమీకరించి మానవ జీవితాన్ని, లింగ వివక్షను, అట్టడుగు స్తీల జీవన గతుల్ని స్పశించి వారి వెతల్ని మనకి అందించింది మానస ఎండ్లూరి.
”స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి ఆమెకి మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి ఆమెకి హదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి” (1 స్త్రీ, బిడ్డల శిక్షణ పుట 7) అంటూ చలం ఏనాడో చెప్పాడు. బొట్టు కథలో గరికపాటి తన రచల్లో స్త్రీల గురించి చాలా గొప్పగా రాసాడు. కానీ వాస్తవజీవితంలో తన భార్య కరుణను వంటగదికే పరిమతం చేసిన గొప్ప స్త్రీ వాద రచయిత. ఎంత గొప్ప ద్వంద్వ నీతో గదా. పితస్వామ్య వవస్ధలో కపటత్వాన్ని ఎండగడితే, రూప పరంగా ఒక చిన్న కథ ద్వారా మానవుని సంక్లిష్ట భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు మానస. సమాజం సుందర్ వంటి వారిని దేవుడిగా చూస్తుంది. కానీ వాస్తవానికి స్త్రీకి పూర్తి స్వచ్ఛను ఇచ్చింది కామాక్షి భర్త సుబ్రహ్మణ్యం.
విద్యావంతురాలైన కామాక్షి బాధితురాలు కాదు. భర్తను తక్కువజేసి చూస్తుంది. కామాక్షి ఒక కళాశాల ప్రిన్సిపాల్, ఉన్నత చదువులు చదివినా కానీ ఆమెలోని వర్ణ వివక్ష, వర్గ వివక్ష పోలేదు. మోసగాడైన గరికపాటి మీద కోపంతో, ఆశాజ్యోతికి అర్హత ఉన్నా, 92% మార్కులు వచ్చినా, ఆమె కులం/మతం (బొట్టు లేకపోవడం) చూసి సీటు నిరాకరించడం ఆమెలోని ‘సంకుచితత్వాన్ని’ బయటపెడుతుంది. మేధావి వర్గం లోని దాగివున్న కుల, మత, వర్ణ, వర్గ వైషమ్యాలను ఎత్తి చూపించారు మానస. హిందూ సంప్రదాయంలో ‘బొట్టు’ అనేది ఒక అలంకారం, ఒక గుర్తింపు. గరికపాటి సుందర్ భార్యకు బొట్టు లేకపోవడం చూసి, ఆమె ఏ వర్గానికి చెందినదో కామాక్షి ఇట్టే కనిపెట్టేస్తుంది. కానీ సమాజంలో ‘అన్నిటికన్నా – విద్యకన్నా – ముఖ్యం – స్త్రీ స్వతంత్ర ఆర్జన. మనుష్యుల్ని గానీ, దేశాల్నీ గాని అణగదొక్కాలంటే, ఆర్థిక అసహాయత్వం ముఖ్య సూత్రం. అందుచేతనే స్త్రీ ముఖ్యంగా బానిస అయింది తాను సంపాయించుకునే శక్తిలేక, తనపొట్ట పోషించుకోడానికి తగిన పనీ, విద్యా స్త్రీ సంపాయించిందా ఈ పురుష ప్రభుత్వం నేలకూలిందన్నమాటే’! గరికపాటి సుందర్ ఇంట్లో భార్యను అక్షరజ్ఞానం లేని దానిలా, కేవలం సేవకురాలిలా ఉంచాడు. సుబ్రహ్మణ్యం విద్యావంతురాలైన కామాక్షికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇక ఈ కథలో ఆశాజ్యోతి కళ్ళలో రాలిన ‘కన్నీటి బొట్టు’ అసలైన బొట్టుగా మారుతుంది. ఇది వ్యవస్థలోని అన్యాయానికి నిదర్శనంగా మనం చూడవచ్చు.
కామాక్షి ఘనాపాటి అనుకున్న గరికపాటి ఫోన్ నంబర్ డిలీట్ చేయడం వల్ల ఒక అబద్ధపు లోకం నుండి బయట పడింది. కానీ మరొక అన్యాయానికి పాల్పడింది. నేటి ఆధునిక సమాజంలో మనుషులను వారి మాటలను బట్టి కాకుండా, వాళ్ల ప్రవర్తనను బట్టి వాళ్ల ఎదుటివారికిచ్చే స్వేచ్ఛ చేంజ్ బట్టి అంచనా వేయాలి. సాధారణంగా ఇటువంటి కథల్లో భర్త మరిపోవడమో, భార్య మరిపోవడమో కాకుండా కొన్ని మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు కలగలిసి ఉన్న సమాజాన్ని,అందులోని వ్యక్తుల స్వభావాన్ని మన ముందు పెట్టారు మానస.
కపటి గరికపాటి, పగతీర్చుకునే కామాక్షి. చేతకాని వాడిలా ముద్రపడిన సుబ్రహ్మణ్యం, అమాయక కరుణ. భావితరాలకు వెలుగు ఆశాజ్యోతి. ఈ పాత్రల ద్వారా తెలుగు కథా సాహిత్యంలో ఒక బలమైన చర్చను లేవనెత్తారు మానస ఎండ్లూరి. ‘బొట్టు’ కేవలం ఒక స్త్రీకి సంబంధించిన విషయం కాదు, అది మనిషిలోని సంకుచితత్వానికి, సామాజిక విలువల డొల్లతనానికి అద్దం పట్టే ఒక అద్భుతమైన కథా ఖండం ఈ బొట్టు కథ. – కట్టూరి వేంకటేశ్వరరావు
‘మిళింద’ బొట్టు కథలు- పరిశీలన
- Advertisement -
- Advertisement -



