ప్రేమించడం సులభం. పెళ్లి చేసుకోవడం చాలా కష్టం. తమ ప్రేమను వ్యక్తం చేయలేక కొందరు, తమకు ఆ స్థాయి లేదని కొందరు, ధైర్యం చేయలేక మరికొందరు, తమ ప్రేమను తమలోనే దాచుకొని కుమిలిపోయే మూగ ప్రేమికులు ఉంటారు. ప్రేమ వరకు అంతా బాగానే ఉంటుంది. పెళ్లి అనగానే ఎక్కడా లేని కులం, మతం, ప్రాంతం, డబ్బు అవరోధాలుగా నిలుస్తాయి. ఆర్థిక స్వాతంత్య్రం లేక కొందరు తమ ప్రేమను పెళ్లి దాకా రానివ్వరు. ప్రేమలు, పెళ్లిళ్లుగా మారి సుఖ జీవనం గడిపేవారు చాలా కొద్ది మందే ఉంటారు. ఈ కాలంలో చదువు, ఉద్యోగం ఏం లేకపోయినా ప్రేమించవచ్చని యువకులు అనుకోవడానికి సినిమాలే కారణం. టీనేజీ ప్రేమలు, స్కూల్ పిల్లల ప్రేమలను చూపించే సినిమాలు రావడంతో, ప్రైమరీ స్కూల్ లెవెల్ లోనే ప్రేమలేఖలు రాసుకోవడం మామూలు అయిపోయింది. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రేమ వేరు, పెళ్లి వేరు అని భావించే స్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ దశ కూడా దాటి లవ్ అండ్ ఎంజారు సిద్ధాంతానికి వచ్చేశారు. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కీర్తి ఇనుగుర్తి రాసిన” ఆరేళ్ల ప్రేమ ” నవలను చదవాల్సిందే.
ఇందులో ఫేస్బుక్ పరిచయం ప్రేమగా ముదరడమేమిటి? సూర్య ఏకంగా ఇంటికి వచ్చి బసచేయడం, ఇంటిల్లిపాది వారిని అల్లుడుగా ట్రీట్ చేయడం ఏమిటి? స్వాతి రైలు ఎక్కి ప్రయాణం చేసి సూర్య రూమ్ కి పోవడం, తనను తాను అర్పించుకోవడం ఏమిటో? ప్రేమ పేరుతో గంటలకొద్ది సేపు చాటింగ్ లు, షికార్లు, హోటల్లు, సినిమాలు, షాపింగ్ లు అన్నీ జరుగుతూనే ఉంటాయి. హఠాత్తుగా సూర్య ‘ఇక మనం కలుసుకోవడం, కలిసి ఉండడం జరగదు’ అని తేల్చేస్తాడు. స్వాతి కూడా’ నేను నిన్ను కారణం లేకుండానే ప్రేమించాను. కారణం లేకుండానే విడిపోదామని’ చెబుతుంది. చివరిసారిగా అతని గదిలోకి వెళ్లి అతడిని సంతప్తి పరిచి వస్తుంది. సూర్య మోసగాడు కాదు. సూర్య నాకు కేవలం ప్రేమే ఇచ్చిండు. అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమ. నా ప్రేమ కూడా అంతే. ఆయనకు తెలియకుండా రెండేళ్లు, ఆయనతో రెండేళ్లు, ఆయన లేకుండా రెండేళ్లుగా ప్రేమిస్తూనే ఉంది. ఇదే ఆమె ఆరేళ్ల ప్రేమ.
స్వాతి తెలంగాణ, సూర్య ఆంధ్ర కావడం సినిమాటిక్ గా ఉన్నప్పటికీ – సంభాషణలపరంగా నవల కొనసాగడానికి దోహదపడింది. అమెరికా లాంటి దేశాలలో ఉన్న డేటింగ్ తలదన్నే స్థాయికి మన తెలుగు వాళ్ళు ఎదగాలని రచయిత్రి కోరుకుంటున్నారేమో? సహజీవనమైనా ,యూస్ అండ్ త్రో పద్ధతి అయినా ,చివరకు అది మగాడికే లాభిస్తుంది అన్న విషయాన్ని రచయిత్రులు ఇంకా ఎప్పుడు గుర్తిస్తారో…
– కుమార్
యూజ్ అండ్ త్రో ప్రేమలు
- Advertisement -
- Advertisement -



