Sunday, March 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆరని యుద్ధ జ్వాలలు

ఆరని యుద్ధ జ్వాలలు

- Advertisement -

ఖర్గ్‌ దీవిపై అమెరికా దాడి
ఐదు రీఫ్యూయలింగ్‌ విమానాలను ధ్వంసం చేసిన ఇరాన్‌
సౌదీపై కొనసాగుతున్న క్షిపణి, డ్రోన్‌ దాడులు
షరతులకు ఓకే అంటేనే యుద్ధాన్ని ముగిస్తాం : ఇరాన్‌ రాయబారి ఫతాలీ
హార్ముజ్‌ను దాటిన రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు
మొజ్తాబాను పట్టిస్తే పది మిలియన్‌ డాలర్లు : అమెరికా ఆఫర్‌

నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌

మధ్యప్రాచ్యంలో ఎగిసిపడుతున్న యుద్ధ జ్వాలలు రెండు వారాలు గడిచినా చల్లారేలా లేవు. పదిహేనవ రోజైన శనివారం కూడా దాడులు, ప్రతి దాడులతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. ఇరాన్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ఖర్గ్‌ దీవిపై అమెరికా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్‌ నుంచి చమురు ఎగుమతులన్నీ దాదాపుగా ఈ దీవి మీదుగానే జరుగుతుంటాయి. ఖర్గ్‌ దీవి ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు వంటిది. దీనిలోని సైనిక లక్ష్యాలన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు.

అమెరికా- ఇజ్రాయిల్‌ సేనలు సైనిక చర్యలు ప్రారంభించిన తర్వాత ఇవే అత్యంత శక్తివంతమైన బాంబు దాడులని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఇరాన్‌లోని సుమారు ఐదు వేల లక్ష్యాలపై దాడులు జరిగినప్పటికీ అమెరికా, ఇజ్రాయిల్‌ దళాలు ఖర్గ్‌ దీవి వైపు చూడలేదు. ప్రస్తుతానికి దీవిలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని ట్రంప్‌ చెప్పారు. అయితే హర్మూజ్‌ జలసంధిలో చమురు నౌకల ప్రయాణానికి ఇరాన్‌ కానీ, వేరెవరైనా కానీ ఆటంకం కలిగిస్తే తాను కూడా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుంటానని హెచ్చరించారు.

ఆర్థిక-చమురు ఆదాయాలకు కీలకం
ఖర్గ్‌ దీవిని ఇరాన్‌కు చెందిన అత్యంత కీలక ఆర్థిక లక్ష్యంగా భావిస్తారు. ఇరాన్‌ ఆర్థిక, చమురు ఆదాయాలలో ఈ దీవి ప్రధాన పాత్ర పోషిస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున చమురు నిల్వలు ఉన్నాయి. ఖర్గ్‌ దీవి నుంచి పైప్‌లైన్లు నిర్మించి ఇరాన్‌లోని అతి పెద్ద చమురు, గ్యాస్‌ క్షేత్రాలతో అనుసంధానించారు. ఈ దీవి ద్వారా ఏటా 950 మిలియన్‌ బ్యారల్స్‌ ముడి చమురు రవాణా అవుతోంది. ఖర్గ్‌లో ట్యాం కర్లు చమురును నింపుకొని భారత్‌, చైనా వంటి ఆసియా మార్కెట్లకు చేరవేస్తుంటాయి. దీవిలోని చమురు మౌలిక సదుపాయాలపై బాంబు దాడులు జరిగితే ఇరాన్‌ నుంచి జరిగే రోజువారీ ముడి చమురు ఎగుమతులలో 90 శాతం నిలిచిపోతాయి. ఫలితంగా చమురు ధరలు అందుబాటులో లేకుండా పోతాయి.

2024లో చమురు అమ్మకాల ద్వారా ఇరాన్‌ రూ.7.2లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఎక్కువ భాగం ఖర్గ్‌ నుంచి ముడి చమురు విక్రయం ద్వారా లభించిందే. అందుకే ఇప్పటి వరకూ అమెరికా, ఇజ్రాయిల్‌ సేనలు ఆ దీవి వైపు చూడలేదు. తాజా దాడిలో చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లనప్పటికీ బ్యారల్‌ ముడిచమురు ధరలు 150 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇరాన్‌కు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న ఖర్గ్‌ దీవిని స్వాధీనం చేసుకునే అవకాశాలపై శ్వేతసౌధంలో ఇటీవల అమెరికా అధికారులు సమాలోచనలు జరిపారు. ఖర్గ్‌ దీవిపై జరిగిన దాడి నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ప్రతీకారం తప్పదు : ఇరాన్‌
అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, దెబ్బకు దెబ్బ తీస్తామని ఇరాన్‌ ప్రకటించింది. అత్యాధునిక ఆయుధాలతో శత్రువులపై దాడి చేస్తామని తెలిపింది. ఇరాన్‌ దాడుల కారణంగా అమెరికా వాయు సేనకు భారీ నష్టం జరిగింది. సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఐదు రీఫ్యూయలింగ్‌ విమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక ఈ విషయాన్ని తెలియజేసింది. సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్‌ జరిపిన దాడిలో ఐదు కేసీ-135 రీఫ్యూయలింగ్‌ విమానాల ట్యాంకర్లు దెబ్బతిన్నాయని ఆ పత్రిక చెప్పింది. తమ దేశంపై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు కొనసాగిస్తోందని బహ్ రైన్‌ తెలిపింది. ఇప్పటి వరకూ ఇరాన్‌ నుంచి 124 క్షిపణులు, 203 డ్రోన్లు వచ్చి పడ్డాయని చెప్పింది.

ఎల్పీజీ ట్యాంకర్లకు గ్రీన్‌సిగ్నల్‌
హర్మూజ్‌ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు భారత్‌కు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకర్లను ఇరాన్‌ అనుమతించింది. దీంతో భారత పతాకం ఉన్న శివాలిక్‌, నందాదేవి అనే రెండు ఇంధన నౌకలు శనివారం హర్మూజ్‌ జలసంధిని దాటాయి. జలసంధిలో భారత్‌ జెండాలున్న 28 నౌకలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. శివాలిక్‌ నౌకలో 40,000 మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ ఉంది. నందాదేవిలో కూడా భారీ పరిమాణంలో గ్యాస్‌ రవాణా అవుతోంది.

భారత్‌ మా మిత్రదేశం : ఇరాన్‌ రాయబారి
వ్యూహాత్మక హార్ముజ్‌ జలమార్గం ద్వారా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని మన దేశంలో ఇరాన్‌ రాయబారిగా పనిచేస్తున్న మహమ్మద్‌ ఫతాలీ చెప్పారు. భారత్‌, ఇరాన్‌లు మిత్రదేశాలని ఆయన తెలిపారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని స్పష్టం చేశారు. ‘యుద్ధాన్ని అమెరికా మొదలు పెట్టింది. కానీ దానిని ఆపలేదు’ అని వ్యాఖ్యానించారు. ఓ పశ్చిమాసియా దేశంలోని అమెరికా స్థావరం నుంచే ఇరాన్‌ పాఠశాలపై దాడి జరిగిందని చెబుతూ పొరుగు దేశాలపై తాము జరుపుతున్న దాడులను సమర్ధించారు. ‘మా చిన్నారులను చంపుతుంటే మౌనంగా ఎలా చూస్తూ కూర్చోగలం?’ అని ప్రశ్నించారు.

ప్రపంచాన్ని ప్రాధేయపడుతోంది : అమెరికాపై ఇరాన్‌ వ్యంగ్యాస్త్రాలు
రష్యా చమురు విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒకప్పుడు భారత్‌పై ఒత్తిడి తెచ్చిన అమెరికా ఇప్పుడు రష్యా ముడి చమురును కొనుగోలు చేయండంటూ అనేక దేశాలను వేడుకుంటోందని తెలిపారు. చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో విమర్శించారు. ఇరాన్‌పై అక్రమంగా జరుగుతున్న యుద్ధాన్ని సమర్ధిస్తున్న యూరోపియన్‌ ప్రభుత్వాలపై అరాగ్చీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొజ్తాబా ఆచూకీ చెబితే 10మిలియన్‌ డాలర్లు : అమెరికా ఆఫర్‌
ఇరాన్‌ నూతన సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ, ఇతర సీనియర్‌ అధికారుల ఆచూకీ తెలిపిన వారికి పది మిలియన్‌ డాలర్ల నజరానా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు తన ‘రివార్డ్స్‌ ఫర్‌ జస్టిస్‌ ప్రోగ్రామ్‌’ ద్వారా బహిరంగ ఆఫర్‌ ఇచ్చింది. మొజ్తాబా ఖమేనీ సహా ‘ఇరాన్‌ ఉగ్రవాద నేతల’పై సమాచారం ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ బ్యానర్‌ను ప్రదర్శించింది. నగదు బహుమతితో పాటు పునరావాస సాయం కూడా అందజేస్తామని తెలిపింది.

ఖర్గ్‌ చమురు సౌకర్యాలకు ఎలాంటి నష్టం జరగలేదు : ఇరాన్‌ మీడియా స్పష్టత
ఖర్గ్‌ ద్వీపంలో సైనిక లక్ష్యాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయని, ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలు తర్వాతి లక్ష్యంగా ఉంటుందని అమెరికా చేసిన ప్రకటనపై ఇరాన్‌ మీడియా స్పందించింది. అసలు ఖర్గ్‌ ద్వీపంలో ఎలాంటి ధ్వంసమూ జరగలేదు… చమురు మౌలిక సదు పాయాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు ” అని ఇరాన్‌ మీడియా శనివారం స్పష్టమైన నివేదికనిచ్చింది. ఒకవేళ … ఇరాన్‌ చమురు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఏదైనా దాడి జరిగితే, అమెరికాతో సహకరించే చమురు కంపెనీల యాజమాన్యంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతాయని ఇరాన్‌ సాయుధ దళాలు హెచ్చరించాయి.

ట్రంప్‌ ప్రకటనపై ఫార్స్‌ వార్తా సంస్థ స్పష్టత
ఖర్గ్‌ ద్వీపంపై అమెరికా జరిపిన దాడుల్లో చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్‌ మీడియా శనివారం నివేదించి స్పష్టం చేసింది. ద్వీపంపై అమెరికా బాంబు దాడి సైనిక లక్ష్యాలను నాశనం చేసిందని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన తర్వాత … దానిపై స్పష్టతనిస్తూ … చమురు సౌకర్యాలకు ఎలాంటి నష్టమూ జరగలేదని ఫార్స్‌ వార్తా సంస్థ, క్షేత్రస్థాయిలోని వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. టెహ్రాన్‌ వ్యూహాత్మక హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధించడం కొనసాగిస్తే, ఇరాన్‌కు కీలకమైన కేంద్రంగా ఉన్న ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లో బెదిరించిన సంగతి విదితమే.

సముద్రమార్గంలో అమెరికా మెరైన్‌ దళాలు
ఇరాన్‌పై అమెరికా యుద్ధోన్మాదం ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచింది. మిడిల్‌ ఈస్ట్‌కు అమెరికా మెరైన్‌ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్‌ దళాలను మోహరించింది. యూఎస్‌ఎస్‌ ట్రిపోలి యుద్ధనౌకలో 2500 మెరైన్‌ కమాండోలతోపాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్లు మధ్యప్రాచ్యానికి పంపినట్టు ఓ అమెరికా అధికారి వెల్లడించారు.

దాడులు ఆపే ప్రసక్తే లేదు : ఇజ్రాయిల్‌
ఇరాన్‌.. ఇజ్రాయిల్‌, పొరుగున ఉన్న గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో విస్తత దాడులను కొనసాగిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్‌ హెచ్చరించింది. ఇరాన్‌ కూడా అందుకు దీటుగానే సమాధానమిస్తూ ముందుకు కదులుతోంది.

డాలర్‌ ఆధిపత్యానికి ఇరాన్‌ చెక్‌?
హార్ముజ్‌ జలసంధిలో చమురు రవాణాపై నిషేధం విధించడం ద్వారా అమెరికాను గట్టి దెబ్బ తీసేందుకు ఇరాన్‌ పావులు కదుపుతోంది. చమురు వ్యాపారంలో అమెరికా డాలరుకు బదులుగా చైనా యువాన్‌లో చెల్లింపులు జరిపే నౌకలను మాత్రమే హార్ముజ్‌ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు అనుమతించాలని ఇరాన్‌ భావిస్తోంది. ఇది వాస్తవ రూపం దాలిస్తే ప్రపంచ చమురు వ్యాపారంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయి. యువాన్‌లో చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా డాలర్‌ ఆధిపత్యానికి చెక్‌ చెప్పవచ్చునని ఇరాన్‌ భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -