యువతికి హెచ్ఐవీ ఇంజక్షన్ ఎక్కించిన యువకుడు
నవతెలంగాణ – పోచారం
పెండ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు అన్నోజిగూడలో ఓ యువతికి హెచ్ఐవీ ఇంజక్షన్ ఇచ్చాడు. ఈ దారుణ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోహర్, బాధిత అమ్మాయి వరసకు బావ-మరదలు. చిన్నప్పటి నుంచే ఇద్దరికీ పెండ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే మనోహర్ తండ్రి సతీష్ హెచ్ఐవీ వ్యాధితో మృతి చెందడంతో అమ్మాయి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి మనోహర్‌కు వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో మనోహర్‌కు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెండ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన మనోహర్, అమ్మాయి తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి సదరు యువతికి ఎడమ చేతికి బలవంతంగా హెచ్ఐవీ ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. అదే రోజు సాయంత్రం యువతికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చేతిపై ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నల్లటి మచ్చ కనిపించడంతో ఏమైందని ప్రశ్నించగా, యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పెండ్లికి నిరాకరించిందని…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



