కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘సాటి మనుషులంతా నాతో సమానం’ అని చాటి చెప్పేందుకు ఏప్రిల్ 26, 27 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాష్ట్రస్థాయి కుల రహిత సమానత్వ సాంస్కతిక ఉత్సవాలు’ నిర్వహిస్తున్నట్టు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు తెలిపారు. శనివారం హైదరాబాద్, చిక్కడపల్లిలోని కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద కులరహిత సాంస్కృతిక ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 11 జ్యోతిబాఫూలే జయంతి, ఏప్రిల్14 అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని ఏప్రిల్ మాసాన్ని ‘మహనీయుల మాసం’గా పాటించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న కులవివక్ష అంట రానితనాన్ని రూపు మాపాలని కులరహిత సాంస్కృతిక ఉత్సవాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు రావాలని కోరారు. రాష్ట్రంలో జానపద, డప్పు కళాకారులు వివిధ సాంస్కృతిక రూపాలతో హాజరు కావాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర్ర ఉపాధ్యక్షులు ఎం. కురుమయ్య, పాలడుగు నాగార్జున, నంది పాటి మనోహర్, పల్లెర్ల లలిత, ఎం.ప్రకాష్ కరత్, జి.రాజు, పి. అశోక్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తిప్పారపు సురేష్, డి.రాధాకృష్ణ, కోట గోపి, మంద సంపత్, బొట్ల శేఖర్, దుర్గం దినకర్, ఉప్పలి మల్కయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ గంగాధర్, అన్నం పట్ల కృష్ణ, బి.సుబ్బారావు, ఎన్.బాలపీరు, ఉసిల్ల కుమార్, రత్నం, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.



