– డిప్యూటీ సీఎం, పీసీపీ చీఫ్, మంత్రులకు ఇందిరా శోభన్ వినతి
నవతెలంగాణ – హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు కల్పించే 33 శాతం రిజర్వేషన్లలో సామాజిక న్యాయం పాటించాలని, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళలకు సబ్ కోటా కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్లతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాసులను కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్ కోరారు. ఈ మేరకు ఆమె వారిని వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలను సమర్పించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు ఎలాంటి ఉపకోటా లేకపోవడం అన్యాయమన్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం అన్ని వర్గాల మహిళలకు దక్కాలన్నది తమ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల స్వప్నమని, కానీ ప్రస్తుత చట్టం వల్ల బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇందిరాశోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరింత పటిష్టమైన కోటాతో పాటు, బీసీ మహిళలకూ ప్రత్యేకంగా సబ్ కోటాను కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేయాలని వారికి ఇందిరా శోభన్ విన్నవించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టాలని ఆమె కోరారు. ఇది జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల పట్ల కాంగ్రెసుకు ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతుందని డిప్యూటీ సీఎం మంత్రులకు వివరించారు. ఈ విజ్ఞప్తిపై వారంతా సానుకూలంగా స్పందించారని, సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఇందిరా శోభన్ తెలిపారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మొట్టమొదట కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే నిర్ణయం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె గుర్తు చేశారు. అదే తరహాలో మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీలకు సబ్ కోటా కల్పించేలా అసెంబ్లీ సాక్షిగా చారిత్రాత్మక తీర్మానం చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఇందిరాశోభన్ ఆశాభావం వ్యక్తం చేశారు



