Monday, March 16, 2026
E-PAPER
Homeదర్వాజదళిత ఆత్మగౌరవ ప్రకటన 'మాకొద్దీ నల్ల దొరతనం'

దళిత ఆత్మగౌరవ ప్రకటన ‘మాకొద్దీ నల్ల దొరతనం’

- Advertisement -

కుసుమ ధర్మన్న గారి మహోన్నత వ్యక్తిత్వాన్ని, నిప్పు కణికల్లాంటి ఆయన వాక్యాలను మేళవించి, పాఠకుడి రక్తంలో చైతన్యం ఉరకలేసేలా రూపొందిన అద్భుత గేయం ”మాకొద్దీ నల్లదొరతనము”. భావ కవిత్వ యుగం (1910-1940) తెలుగు కవితా సీమలో రాజ్యమేలుతున్న కాలంలో, 1921లో ధర్మన్న గారు ఈ గానయోగ్యమైన గేయాన్ని రచించారు. అదే ఏడాది విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల వేదికగా, అంటరానితనంపై పోరాటంలో భాగంగా దీనిని ఆలపించినట్లు సాహితీ చరిత్ర చెబుతోంది. దళితుల పట్ల నాటి సామాజిక వ్యవస్థ ప్రదర్శించిన వివక్షపై నినదించిన మహోగ్ర స్వరం ఇది.

కులం, మతం, అంటరానితనం వంటి విశ్వాసాలు సమాజ అభివృద్ధికి అడ్డుగోడలని గుర్తించిన ధర్మన్న, ఆ గోడలను కూల్చేయాలని తన రచనల ద్వారా ఉద్యమించారు. అగ్రకులాల సాహిత్యాధిపత్యం ఉన్న ఆ రోజుల్లో, దళిత జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ గేయం రాయడం హిమాలయమంత సాహసంతో కూడుకున్న పని. గరిమెళ్ల సత్యనారాయణ గారు ”మాకొద్దీ తెల్ల దొరతనము” అంటూ బ్రిటీష్‌ పాలనను నిరసిస్తూ.. స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే, ధర్మన్న గారు అదే సమయంలో ”మాకొద్దీ నల్ల దొరతనము” అంటూ గళమెత్తి స్వదేశీయుల సామాజిక వివక్షను ప్రశ్నిస్తూ సామాజిక సమానత్వ కాంక్షను రగిలించిన మేరునగధీరుడు.

గేయ కవితకు ప్రాణమైన మాత్రా ఛందస్సులో, సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా జానపద బాణీలో సాగిన ధర్మన్న గారి రచన ప్రజల నాలుకలపై ఒక ఉద్యమ గీతంగా నిలిచింది. ”మాల మాదిగలంటే మండిపడిపోతారు” అని నినదించిన ఆయన, ఆధునికాంధ్ర సాహితీ చరిత్రలో ప్రప్రథమ ప్రజా వాగ్గేయకారుడు. సుప్రసిద్ధ విమర్శకులు సి.వి. గారు అన్నట్లు, ”ఈ గీతం తరతరాల దళితుల పరాభవ పరంపరల్ని ప్రతిబింబించే ఉష్ణరక్తకాసారం”. ఆ ప్రవాహం నుంచి ఉద్భవించిన అగ్నిజ్వాలే కుసుమ ధర్మన్న. ఆంధ్రాంగ్ల భాషలలో పండితుడైన ధర్మన్న; కవిగా, కథకుడిగా, వ్యాసకర్తగా, పత్రికా సంపాదకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడైన ఆయన, సమాజానికి పట్టిన కులజాడ్యాన్ని తొలగించే ‘సామాజిక వైద్యుడిగా’ అవతరించారు. ఆయన తపస్సులా రచించిన ‘హరిజన శతకం’ దళిత చైతన్యానికి తొలి ఉషస్సు. 1921లో ‘నిమ్నజాతి ముక్తితరంగిణి’, 1930లో ‘మద్యపాన నిషేధం’పై స్వర్ణ పతకం పొందిన వ్యాసం, చిత్రపటాలతో కూడిన ‘అసురపురాణము’, సామాజిక వికతాన్ని ఎండగట్టిన ‘మాలకాకి’ నవల.. ఇవన్నీ ఆయన దార్శనికతకు నిదర్శనాలు.

తొలుత గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ధర్మన్న, తదనంతర కాలంలో అంబేద్కరుడి సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై, ‘రాజీలేని పోరాటమే దళిత విముక్తికి మార్గమ’ని మలిదశ రచనల్లో మరింత ఉదృతంగా ప్రకటించారు. ఆ స్ఫూర్తి శిఖరం నుంచే తెలుగు నేల మీద తొలి దళిత చైతన్య గేయంగా ఈ కావ్యం చరిత్ర సృష్టించింది. ఈ గేయంలో ఆకలి, దప్పికల ఆర్తనాదాలను ఎంత గొప్పగా ఆవిష్కరించారో ఈ క్రింది వాక్యం ఒక ఉదాహరణ: ”ఆకలి చిచ్చూ చేత అడలి చచ్చినగాని/ యన్న సత్రము మాకు లేదు / నోరు ఎండి దోరిన నీరు లేదు”. నాడు ధర్మ సత్రాలు, చలివేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేవి కానీ దళితులకు మాత్రం నిషిద్ధం. ఆకలితో చనిపోతున్నా సరే, అన్నం పెట్టని నైతిక దారిద్య్రం నాటి సమాజానిది. దాహంతో గొంతు ఎండిపోతున్నా గుక్కెడు నీరు ఇవ్వని ”కసాయి కులతత్వం”పై ఆయన చేసిన గర్జన ఇది.

”యెక్క బండి వక్కటైన రాదు/ శ్రమను దీర్ప సత్రమొకటి లేదు” అంటూ మేధోపరమైన అణచివేతను దునుమాడుతాడు పై వాక్యంలో ధర్మన్న. ప్రయాణించే బండిలో చోటు లేదు, అలసిపోతే విశ్రాంతి సత్రం లేదు. ఇది కేవలం భౌతికమైన వివక్ష కాదు, మనిషిని మనిషిగా గుర్తించని మానసిక హింస. నేటికీ మారుమూల గ్రామాల్లో దళితులను బస్సుల్లో కూర్చోనివ్వని వార్తలు వింటున్నామంటే.. ధర్మన్న గారి ప్రశ్న శతాబ్దం దాటినా ఇంకా సజీవంగానే ఉందని అర్థమవుతోంది. నాలుగే నాలుగు పదాల వాక్యంలో ఆధ్యాత్మిక వెలివేతను ఎలా ప్రశ్నిస్తాడో చూడండి. ”మొక్క దేవుడు ఒక్కడైన లేడు”. దేవుడు అందరివాడు అని చెప్పే ధర్మశాస్త్రాలు దళితుడిని గుడి వెలుపలే ఆపేశాయి. ”దేవుడు కూడా మాకు లేడా?” అని ఆయన సంధించిన ప్రశ్న నాటి మత ఛాందసవాదుల గుండెల్లో గునపంలా దిగబడింది.

”మేము మనుషులనూ మాట/ మరచి పోయారండి/ మాలా మాదిగలంటే మండీ పడిపోతారు” అనే వాక్యం ఈ గీతానికి ప్రాణం. వివక్ష కంటే పెద్ద అవమానం ”మనుషులుగా గుర్తించకపోవడం”. ఎదుటివాడిని మనిషిగా చూడలేని ఏ స్వేచ్ఛ అయినా వ్యర్థమని ఆయన తేల్చి చెప్పారు. ”మండి పడిపోవడం” అనే మాటలో అగ్రవర్ణాల అసూయ, ద్వేషం ఎంత తీవ్రంగా ఉండేవో స్పష్టమవుతోంది.
”కుక్క నక్కల కంటె తక్కువగా జూచి/… /కాకి నీటిని తాకనిస్తారు/ మమ్ము దరికి చేరనీరు”. సమాజంలో జంతువులకున్న గౌరవం కూడా దళితులకు లేదని ధర్మన్న గారు ఆవేదన చెందారు. కుక్కలు, పిల్లులు, పందులు, కాకులను కూడా తాకనిచ్చేవారు. కానీ, తోటి మనిషిని మాత్రం దరికి చేరనిచ్చేవారు కాదు. ఇది అగ్రవర్ణాల ”నైతిక పతనాన్ని” ఎండగట్టిన చరణం. ”నడి వీధిలో నడిచీతె తంట/ వంగి తిరుగాకుంటే వళ్ళుమంట”.

నడివీధిలో తల ఎత్తుకుని నడిచే హక్కు కూడా దళితులకు లేని రోజులను ఇది గుర్తు చేస్తోంది. అగ్రవర్ణాల వారు కనిపిస్తే వంగి తిరగాలి, దారి తొలగాలి. ఇది మనిషి ఆత్మగౌరవాన్ని చంపేసే సామాజిక దాస్యం. నాటి కాలంలో శారీరక అణచివేత – వీధి నిబంధనలు ఎలా వుండేవో ఈ వాక్యాలు చెబుతున్నాయి. ”గాలి వెలుగు సుంత తొంగిరాదు…/ దేశమందారికి మేము చేదు” ఈ వాక్యాలలో ఊరి వెలుపల చీకటి గుడిసెలు, తినడానికి సరైన ఆహారం లేని స్థితిని కళ్ళకు కట్టారు. దేశమంతటికీ దళితుల శ్రమ కావాలి కానీ, దళితులు మాత్రం ”చేదు” అంటారు. వారి దారిద్య్రాన్ని చూసి జాలిపడే హృదయం కూడా నాటి సమాజానికి లేదని ఆయన నిలదీశారు. దారిద్య్రం – అట్టడుగు బతుకులు ఎలా వుండేవో నాటి కాలాన్ని ఈ గీతం ద్వారా చరిత్రలో నిక్షిప్తం చేశారు. ”చుట్టు గుడిసె చాలా సుఖమంటారు/గంజి కూడే గుంజు బలమంటారు”.

ఇది చాలా లోతైన సామాజిక విమర్శ. దళితులు అనుభవిస్తున్న దారిద్య్రాన్ని అగ్రవర్ణాల వారు సమర్థిస్తూ.. ‘మీకు గుడిసే సుఖం, గంజి తాగితేనే బలం’ అని నీతులు చెప్పేవారు. అంటే, వారు దారిద్య్రం నుంచి బయటపడకుండా చేసే మేధోపరమైన కుట్రను ధర్మన్న గారు పై వాక్యాలలో గొప్పగా చిత్రించారు. ”నాములిచ్చి నట్టేట ముంచేరు/ చంపగొట్టి కొంపలాగుతారు” దళితులు పండించిన పంటను అగ్రవర్ణాల వారు అనుభవిస్తూనే, వారికి అప్పులిచ్చి ఆ వడ్డీలతో వారి ఇళ్లను, పొలాలను లాక్కునేవారట. కోర్టులకు ఎక్కించి వారిని ఆర్థికంగా కుంగదీసే వ్యవస్థను ఆయన ఎండగట్టారు.
”పొలము పనుల జేసే/ తరుణాలలో మమ్ము/తాకితే తప్పు లేదంట” ఇది అగ్రవర్ణాల ద్వంద్వ నీతికి నిదర్శనం. పొలం పనులప్పుడు, పంటను ఇంటికి చేర్చేటప్పుడు అంటరానితనం ఉండదు. కలిసి పని చేయవచ్చు, తాకవచ్చు. కానీ పని పూర్తయ్యాక మాత్రం ‘ఎడగా ఉండాలి’. అంటే అవసరానికి అంటరానితనం మాయమై, శ్రమ దోపిడీలో అంటరానితనం మాయమై అధికారం చెలాయించడానికి మళ్ళీ పుట్టుకొస్తుందని ఆయన ఈ వాక్యాల ద్వారా నిరూపించారు.

”మాకు హక్కు లేదంటె/ స్వరాజ్యమెక్కడ దక్కు?” ఇది ఈ గేయానికి కిరీటం లాంటి ప్రశ్న. బ్రిటిష్‌ వారితో పోరాడి స్వాతంత్య్రం అడుగుతున్న వాళ్ళు, ఈ దేశంలోని మనుషులకు మాత్రం నూతిలో నీళ్లు, గుడిలోకి ప్రవేశం, కనీస హక్కులు ఇవ్వరు. దళితులకు హక్కులు లేని స్వరాజ్యం ఎవరి కోసం? అని ఆయన గర్జించారు. పై చరణాలన్నీ కలిపితే ధర్మన్న గారు ఎందుకు ”మేరునగధీరుడు” అయ్యారో అర్థమవుతుంది. శతాబ్దం క్రితం ధర్మన్న గారు సంధించిన ప్రశ్నలు నేటికీ సజీవంగా ఉన్నాయంటే, అది ఆయన దార్శనికతకు నిదర్శనం మాత్రమే కాదు, మనం ఇంకా సాధించాల్సిన సామాజిక సమానత్వం ఎంతో ఉందనే హెచ్చరిక కూడా. నాడు ధర్మన్న గారు ఏ కసాయి కులతత్వం గురించి హెచ్చరించారో, అది నేడు రూపం మార్చుకుని కొనసాగుతూనే ఉంది.

(మార్చి 17, కుసుమ ధర్మన్న 126వ జయంతి)

  • విల్సన్‌ రావు కొమ్మవరపు, 8985435515
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -