Monday, March 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరిటైర్డ్‌ పెన్షన్‌ బెనిఫిట్‌ రాక 60 మంది చనిపోయారు

రిటైర్డ్‌ పెన్షన్‌ బెనిఫిట్‌ రాక 60 మంది చనిపోయారు

- Advertisement -

– వారి చావుకు కారణం రేవంత్‌రెడ్డి
– ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేస్తా : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
– రిటైర్డ్‌ ఉద్యోగుల నిరాహార దీక్షకు మద్దతు

నవతెలంగాణ-సిద్దిపేట
ముప్పై ఏండ్లు కష్టపడి పని చేసి రిటైర్‌ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్‌ రెడ్డి రోడ్డు మీదకు తెచ్చాడనీ, రిటైర్డ్‌ పెన్షన్‌ బెనిఫిట్‌ రాక 60 మంది చనిపోయారనీ, వారి చావుకు రేవంత్‌ రెడ్డి కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షకు హరీశ్‌రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తోందని, ఎన్నికల ముందు పెండింగ్‌ డీఏలు ఇస్తామని హామీలు ఇచ్చారనీ గుర్తు చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి రేవంత్‌రెడ్డికి మనసు రావడం లేదనీ, పదివేల కోట్ల బకాయిలు ఇవ్వమని రిటైర్డ్‌ ఉద్యోగులు అడిగితే నన్ను కోసుకొని తిన్నా డబ్బులు లేవని అంటున్నాడనీ అన్నారు. రూ.96వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, మూసీ అభివృద్ధి కోసం 10వేల ఇండ్లు కూల్చడానికి సిద్ధం అయ్యాడనీ ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తారు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగులకు ఇవ్వడనీ అన్నారు. కేసీఆర్‌ హయాంలో రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు నెల లోపే బెనిఫిట్స్‌ ఇచ్చామని తెలిపారు. ఉపాధ్యాయులను అవమానించేలా విద్యా కమిషన్‌ రిపోర్ట్‌ ఉందన్నారు. మల్లన్న సాగర్‌ నుంచి మూసీకి నీటిని తరలించేందుకు డబ్బులు ఉన్నాయి కానీ, రిటైర్డ్‌ అయిన వారికి ఇచ్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేసి తమకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు సంఘటితం అయి ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పోనమల్ల రాములు, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, కోశాధికారి పన్యాల రాజిరెడ్డి, నాయకులు రాజులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -