ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ 95వ వర్థంతి సందర్భంగా నిర్వహించనున్న భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సమరంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. సామాజిక న్యాయం, లౌకికత్వం, సమానత్వం కోసం పోరాడిన భగత్‌సింగ్ త్యాగం భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్యా రంగంపై దాడులు, ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భగత్‌సింగ్ ఆలోచనలు నేడు మరింత ఆవశ్యకంగా మారాయని వారు తెలిపారు. యువత సమాజ మార్పు కోసం చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని పట్టి పీడుస్తున్న గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్‌తో యువత ఫెడధోరణులు పడుతున్నారనీ వాటికి వ్యతిరేకంగా విద్యార్ధి, యువత నడుం బిగించాలని సూచించారు. రాబోయే రోజుల్లో నిర్వహించనున్న భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా వేదికలు, యువజన ర్యాలీలు, డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్ వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిక్ అహ్మద్, డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి.జావేద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, లావుడ్య రాజు, సతీష్, లెనిన్, అవినాష్, రాజేష్, రాజు, జ్ఞాప్నిక, నవ్య, ఆంజనేయులు, సుబ్బు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల స్మారక యువజనోత్సవాలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



