Monday, March 16, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్'యుద్ధ' కల్లోలం

‘యుద్ధ’ కల్లోలం

- Advertisement -

అటు ‘గ్యాస్‌’ ట్రబుల్‌… ఇటు ఎగ్స్‌పై ఎఫెక్ట్‌
కమర్షియల్‌ సిలిండర్ల కొరతతో డొమెస్టిక్‌ గ్యాస్‌ వినియోగం
హోటళ్లపై దాడులు.. భారీగా పట్టుబడుతున్న సిలిండర్లు
చేసేది లేక హోటళ్లను మూసివేస్తున్న నిర్వాహకులు
‘గుడ్లు’తేలేస్తున్న పౌల్ట్రీ రైతులు.. ఎగుమతులు లేక డీలా..!


నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
పశ్చిమాసియా యుద్ధం ప్రజలపై చిత్ర విచిత్ర ప్రభావం చూపుతోంది. యుద్ధ కారణంగా కమర్షియల్‌ అవసరాలకు గ్యాస్‌ సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం గృహ వినియోగ అవసరాలకు మాత్రమే డొమెస్టిక్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. కమర్షియల్‌ సిలిండర్లను నిలిపివేసిన దృష్ట్యా చిరు వ్యాపారులు, ముఖ్యంగా హోటళ్లు, దాబాల నిర్వాహకులు డొమెస్టిక్‌ సిలిండర్‌లను ఉపయోగించి చాటుమాటుగా వంటశాలలను నిర్వహిసు ్తన్నారు. యుద్ధం నేపథ్యంలో మరోవైపు డొమెస్టిక్‌ సిలిండర్లకూ కొరత తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు పెద్ద సంఖ్యలో బుకింగ్స్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల వద్ద నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో గృహ వినియోగ సిలిండర్ల కోసం జనం ఎగబడుతున్నారు. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో డొమెస్టిక్‌ సిలిండర్‌ల ను వాణిజ్య అవసరాల నిమిత్తం పక్కదోవ పట్టిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని పౌరసరఫరాల అధికారులు ముమ్మర దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడుతున్నాయి. చిన్నపాటి హోటళ్లలోనూ పదుల సంఖ్యలో సిలిండర్లు పట్టుబడుతున్నట్టు సివిల్‌ సఫ్లయీస్‌ అధికారులు చెబుతున్నారు. గ్యాస్‌ కష్టాలతో సతమతం కాలేక చిన్న హోటళ్లు మూతబడుతున్నాయి. మరోవైపు యుద్ధ ప్రభావం గుడ్లు ఉత్పత్తి చేసే పౌల్ట్రీ రైతులపైనా పడింది. ఎగుమతులు లేకపో వడంతో గుడ్ల ధరలు గణనీయంగా తగ్గిపో యాయి. కొద్దిరోజుల క్రితం 30 గుడ్లుండే ట్రే రూ. 250 వరకు పలకగా ప్రస్తుతం రూ.130కే ట్రే లభిస్తుంది. ఈ పరిస్థితి వినియోగదారులకు మేలు చేస్తుండగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది.

హోటళ్లలో భారీగా పట్టుబడుతున్న సిలిండర్లు
డొమెస్టిక్‌ సిలిండర్లను కమర్షియల్‌ అవసరాలకు వాడటం గ్యాస్‌ సిలిండర్‌ రూల్స్‌ 2004 ప్రకారం చట్టవిరుద్ధం. యుద్ధం నేపథ్యంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను నిలిపివేయడంతో హోటళ్ల నిర్వాహకులు అక్రమ పద్ధతుల్లో గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నారు. వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్ల కొరత కారణంగా హోటల్‌ యాజమాన్యాలు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఆదివారం ఖమ్మంలో పలుచోట్ల పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నపాటి హోటల్స్‌లోనూ భారీ మొత్తంలో గృహ వినియోగ సిలిండర్లు పట్టుబడ్డాయి. వీటిలో భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీకి చెందినవే ఎక్కువగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ హోటళ్లలో సివిల్‌ సప్లరు అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో పెద్ద సంఖ్యలో అక్రమ గృహ వినియోగ సిలిండర్లు పట్టుబడ్డాయి, ఇందులో ఒకేసారి 43 డొమెస్టిక్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకోవటం గమనార్హం. ఇందులో హెచ్‌పీ, ఇండియన్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి.

చికెన్‌ మంట.. ఎగ్స్‌తో తంటా
పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. యుద్ధ సంక్షోభం తలెత్తక ముందు భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు ప్రతిరోజూ సుమారు కోటి గుడ్లు ఎగుమతి అయ్యేవి. భారత్‌లో ఉత్పత్తి అయ్యే గుడ్లలో దాదాపు 80 శాతం గల్ఫ్‌ దేశాలకే వెళ్తాయి. తెలంగాణలో రోజుకు 3.50 కోట్ల నుంచి 5 కోట్ల వరకు గుడుÊ ఉత్పత్తి అవుతున్నాయి. పశ్చిమాసియా (గల్ఫ్‌) దేశాల్లో ఉద్రిక్తతల వల్ల ఎగుమతులు ఆగిపోయాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్లో గుడ్ల నిల్వలు పెరిగి, 30 గుడ్ల ట్రే ధర రూ.250 నుంచి రూ.100-140కు పడిపోయింది. ఈ అదనపు స్టాక్‌ అంతా ఇప్పుడు భారత మార్కెట్లోకి మళ్లించాల్సి వచ్చింది. ధరలు తగ్గడంతో వినియోగదారుల నుంచి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతంలో అధిక ధరల కారణంగా గుడ్ల వినియోగాన్ని తగ్గించిన వారు ఇప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి, పేద కుటుంబాలకు గుడ్డు ఇప్పుడు అందుబాటులో ఉన్న అతిపెద్ద ప్రోటీన్‌ వనరుగా మారింది. మరోవైపు చికెన్‌ ధర పెరగటంతో అందరి దృష్టి గుడ్లపై పడింది. మొన్నటి వరకూ కిలో రూ. 220 ఉన్న చికెన్‌ ధర ఇప్పుడు రూ.350 పలుకుతోంది. ఈ ఆదివారం చికెన్‌ ప్రియులు గుడ్లను విరివిగా కొనుగోలు చేశారు. గతంలో అర డజన్‌, డజన్‌ గుడ్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడూ ట్రే గుడ్లను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మొత్తమ్మీద అంతర్జాతీయ ఉద్రిక్తతలు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై ఇలాంటి విచిత్రమైన ప్రభావాలను చూపుతున్నాయి. ధరలు తగ్గడం వినియోగదారులకు సంతోషాన్ని కలిగిస్తున్నా, పౌల్ట్రీ రైతుల నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ధరలు పెంచుతూ బోర్డులు

హోటల్స్‌ నిర్వహణ భారమైన నేపథ్యంలో యాజమాన్యాలు ధరలు పెంచుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 13 రెస్టారెంట్లు, 114 హోటళ్లు, 236 వరకు టిఫిన్‌ సెంటర్లు, భోజనశాలలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిల్లో ధరలు పెంచారు. గ్యాస్‌ ఆదా చేద్దామని వినియోగదారులు హోటళ్ల నుంచి అల్పాహారం, భోజనం తెచ్చుకోవాలన్నా ధరలు పెరగడంతో సమస్య ఎదురవుతోంది. అయితే, సిలిండర్ల సరఫరా తక్కువగా ఉండటం, కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి రావడం తదితర కారణాలను ధర పెంచినందున సహకరించాలని కోరుతూ హోటళ్ల యాజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక చిన్న హోటళ్లతోపాటు బండ్లపై నిర్వహిస్తున్న ఇడ్లీ, దోశ, వడ, చపాతి, బోండా వంటి టిఫిన్లు అమ్మేవారు కూడా ధరలు పెంచారు. ఫాస్ట్‌ఫుడ్‌ ధరలు కూడా పెరిగాయి. గతంలో రూ.80 ఉన్న ప్లేట్‌ ఇప్పుడు రూ. 120కి చేరింది. నిర్వహణ భారం కావడం, కట్టెలపై వంటలు, సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి రావడంతో తప్పక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరోపక్క పట్టణాలు, మండల కేంద్రాల్లోని చిన్న హోటళ్ల బాధ్యులు చేసేదేంలేక తాత్కాలికంగా మూసివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -