సీఐటీయూ జిల్లా కోశాధికారి జి భాస్కర్
నవతెలంగాణ- మిరుదొడ్డి
అంగన్వాడి టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ నిర్వహిస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో అంగన్వాడి టీచర్లను అక్రమంగా అరెస్టు చేయడానికి సీఐటీయూ జిల్లా కోశాధికారి జి భాస్కర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గత 50 ఏండ్ల నుండి పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. నేటికీ వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ వీరీ సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజులు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారనీ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ట్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు రూ. 18,000/- ల వేతనం పెంచుతామని,పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చి నేటికి వేతనాలు పెంచలేదనీ విమర్శించారు.
24 రోజుల సమ్మె వేతనాలు, డైర్మెంట్ బెనిఫిట్స్, మిని టీచర్స్ ఎరియర్స్, పిఆర్సి ఎరియర్స్ తదితర డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారనీ తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీ తదితర సమస్యలు పెండింగ్లో ఉన్నాయనీ వీటన్నింటినీ పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ఐపి-2020 చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో తెచ్చిన 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని,మార్చి 16 నుండి అంగన్వాడీ కేంద్రాలకు ఒకపూట బడిని నిర్ణయించాలి. మే 1 నుండి 31 వరకు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు ఇద్దరికి ఒకేసారి మే నెలంతా సెలవులు అమలు చేయాలనీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు గ్రాట్యుటీ చెల్లించాలనీ, రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష వెంటనే చెల్లించాలనీ,ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలనీ కోరారు. ప్రైమరీ పిఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ,విజయలక్ష్మి, యశోద, సుజాత,రత్న, నాయకులు ఎమ్డీ.సాజిద్ తదితరులు పాల్గొన్నారు.



