Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: ఎస్పీ నరసింహ

అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: ఎస్పీ నరసింహ

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ప్రజారక్షణ కోసం పనిచేసే వ్యవస్థ అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక భద్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. స్థానికంగా ఉన్న చిన్నచిన్న సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించుకోవాలని, లేనట్లయితే అవి పెను ప్రమాదంగా మారుతాయి అన్నారు. క్షణికావేశంలో తప్పులకు, నేరాలకు పాల్పడవద్దని కోరారు.

ఉద్యోగ ఉపాధి కల్పనలో యువతకు సహాయసహకారాలు అందిస్తామని, పోలీసు ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న యువతకు పోలీసు శాఖ అధ్వర్యంలో శిక్షణ ఇస్తామని అన్నారు. పౌరులు సప్రవర్తనతో నడుచుకోవాలి, పోలీసు ప్రజా భరోసా ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలను చైతన్య పరుస్తున్నాం అన్నారు. గ్రామాల్లోని ప్రజలను చైతన్యవంతం చేయడమే పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. స్మార్ట్ ఫోన్ వాడే విద్యావంతులైన అత్యాశాపరులు మాత్రమే సైబర్ నేరాలకు గురవుతున్నారని అన్నారు. అత్యాశకు పోతే ఆర్థిక నష్టం తప్పదు. సామాజిక మాధ్యమాల్లో,మెసేజ్ లలో వచ్చే బ్లూలింక్స్ అనుసరించి వ్యక్తి గత సంచారం ఇవ్వొద్దు, అపరిచితుల వీడియో కాల్స్కు స్పందించవద్దు అని కోరారు.

షీ టీమ్స్, పోలీస్ భరోసా టీమ్స్ మహిళల శ్రేయస్సు కోసం పని చేస్తున్నాయి అన్నారు. మహిళల, బాలల రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయని, మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. వేధింపులపై 100 కు ఫోన్ చేస్తే పోలీసులు బాధితుల వద్దకు వెళ్ళి పిర్యాదు స్వీకరించి బాధితుల వద్దనే కేసు నమోదు చేస్తాం అన్నారు. గ్రామాల ప్రగతి బాధ్యత సర్పంచులదేనని,నిబద్ధతతో పనిచేసి గ్రామాలను గ్రామ ప్రజల సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, స్థానిక ఎస్ఐ క్రాంతి కుమార్, మద్దిరాల ఎస్ఐ వీరన్న, నూతనకల్  ఎస్ఐ నాగరాజు, పోలీసు సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు, యువత, గ్రామ పౌరులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -