Tuesday, March 17, 2026
E-PAPER
Homeమానవిఅడ్డంకుల‌ను అధిగ‌మించి చ‌రిత్ర సృష్టించాలి

అడ్డంకుల‌ను అధిగ‌మించి చ‌రిత్ర సృష్టించాలి

- Advertisement -

దానసరి అనసూయ సీతక్క… తెలంగాణ ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన మహిళ. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని ఐఐటీలో ఇటీవల జరిగిన షీస్పార్క్స్‌ 2026లో ఆమె పాల్గొన్ని ఓ బహిరంగ వేదికపై మాట్లాడారు. పితృస్వామ్య వ్యవస్థలో సవాళ్లను ఎదుర్కోవడానికి మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం పొందాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా తాను ఎలా పోరాడారో పంచుకున్నారు. అలాగే నక్సలైట్‌ జీవితం నుండి ఓ ప్రజాస్వామ్య శక్తిగా తాను ఎదిగిన క్రమాన్ని ఇలా వివరించారు.

‘నేను నక్సలైట్‌గా ఉన్నప్పుడు న్యాయవాదిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతానని అస్సలు ఊహించలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నా పిహెచ్‌డి పూర్తి చేసి ఈ పదవిని (మంత్రిగా) పొందుతానని అసలే అనుకోలేదు’ అని అన్నారు. యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధ శర్మతో జరిగిన ఒక ఘాటైన సంభాషణలో సీతక్క సమాజంలోని అన్యాయానికి వ్యతిరేకంగా తాను ఎలా పోరాడారో చెబుతూ పితృస్వామ్య వ్యవస్థలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక స్వాతంత్య్రం పొందాలని మహిళలను కోరారు. సమాజంలోని అడ్డంకులను అధిగమించి చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు.

మూడు స్తంభాల ద్వారా…
‘మహిళలు ఆర్థిక శక్తిని పొందినప్పుడు, కుటుంబాలు బలపడినప్పుడు, సమాజాలు మరింత పటిష్టంగా మారినప్పుడు, మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడు సమసమాజం వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను’ అని ఆమె అన్నారు. సీతక్క తన భర్తను, సోదరుడిని కోల్పోయినప్పుడు, నక్సలైట్‌గా తన జీవితంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. జన జీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన విద్యను కొనసాగించింది. ఆమె నాయకత్వం గురించి మాట్లాడుతూ, ఇది మూడు స్తంభాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిందని అన్నారు. అవే సంకల్పం, అంకితభావం, క్రమశిక్షణ. ‘ఈ మూడే నా పోరాటానికి నా విలువలకు పునాది. నేను భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు నా దృష్టి మరొక సూత్రాల సమితిపై ఆధారపడి ఉంటుంది. అదే చేరిక, సమగ్రత, ప్రభావం’ అని సీతక్క అన్నారు.

నిశ్శబ్దంగా బాధపడుతున్నారు
‘వివక్ష అనేది కేవలం దిగువ తరగతి వర్గాల మహిళలకు మాత్రమే పరిమితం కాదు. సమాజంలోని అన్ని వర్గాల మహిళల్లో ప్రబలంగా ఉంది. లక్షలాది మంది మహిళలు ఇళ్లల్లో, కార్యాలయంలో నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. వారు తమ సమస్యలను ఇతరులతో బహిరంగంగా పంచుకునే, చర్చించే వేదికలు అవసరం. ఇటువంటి వేదికలు ఇతర మహిళలకు ప్రేరణగా, మద్దతుగా నిలుస్తాయి. నా జీవితం మొత్తం సమాజ సేవకే అంకితం చేయబడింది. నేను ఎప్పుడూ భయపడను, ఏ విషయంలోనూ వెనక్కి తగ్గను. మనం పోరాడాలి, సవాళ్లను ఎదుర్కోవాలి. అప్పుడే మనం సమాజంలో జీవించి ఉంటాం’ అని ఆమె అంటారు. మహిళలు దృఢ సంకల్పం ద్వారా ఏం సాధించగలరో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ సీతక్క. ‘న్యూఢిల్లీలో జరిగిన ఒక బహిరంగ వేదికలో తాను మాట్లాడటం ఇదే మొదటిసారి’ అంటూ ఆమె తన మాటలు ముగించారు

సంకల్పమే నడిపిస్తుంది
ప్రతి స్త్రీ… తాను ఒక మెట్రోపాలిటన్‌ నగరంలో నివసిస్తున్నా లేదా మారుమూల గ్రామంలో నివసిస్తున్నా అవకాశం, గౌరవం, నాయకత్వం పొందకపోతే సాధికారత భారతదేశ లక్ష్యం సాధించబడదని ఆమె అంటారు. తనకు గాడ్‌ఫాదర్‌ లేదా ఏ ప్రధాన కుల మద్దతు లేదని, సవాళ్లను ఎదుర్కొని సమాజంలో ఒక ముద్ర వేయాలనే సంకల్పమే తనను నడిపిస్తుందని ఆమె అంటున్నారు. ‘ఒక మహిళ అట్టడుగు స్థాయి నుండి పైకి వచ్చినప్పుడు, ఆమె తనను తాను మాత్రమే ఉద్ధరించుకోదు, తనతో పాటు తన మొత్తం సమాజాన్ని కూడా పైకి తీసుకువస్తుందని నేను నమ్ముతున్నాను’ అని ఆమె అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -