రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. గత రెండు బడ్జెట్లను పరిశీలించి చూస్తే వైద్య ఆరోగ్యరంగానికి కేటాయింపులు సరిపడా ఉండటం లేదు. పెరుగుతున్న జనాభా, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు వ్యాధుల నివారణ, సెకండరీ గ్రేడ్, టీచింగ్ హాస్పిటల్స్‌లో వైద్య సదుపాయాలు, సిబ్బంది భర్తీ తదితరాలు మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. 2026-27 బడ్జెట్లో నిధులు పదిశాతం కేటాయించాలి. అలాగే వైద్య, ఆరోగ్య రంగంలో ఉద్యోగుల సమస్యలు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్ సుమారు లక్షన్నర మంది ఈ శాఖలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో క్రమంగా సర్కార్‌పట్ల అసంతృప్తి పెరుగుతున్నది.
ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలపై కేంద్రీకరణ తగ్గింది. ప్రతి 20వేల జనాభాకు ఒక పిహెచ్సి ఉండాలి. ఈ లెక్కన 8.14కోట్ల గ్రామీణ జనాభాకు 1070 పీహెచ్సిలుండాలి. కానీ, 638 మాత్రమే ఉన్నాయి. 400 పిహెచ్‌సిలు కొత్తగా ఏర్పాటు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో 1.39 కోట్ల జనాభాకు 276 యూపీహెచ్సిలు ఉండాలి. కానీ, 240 మాత్రమే ఉన్నాయి. ఏరియా, జిల్లా ఆస్పత్రిలో సరిపడా లేవు. అన్నింటిని అప్‌గ్రేడ్ చేసి వదిలేశారు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టటం మంచిదే కానీ మౌలిక సదుపాయాలు సిబ్బంది కొరత తీర్చాలి. కేంద్ర రాష్ట్ర స్కీములు ఉన్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన టార్గెట్ పూర్తి కావాలంటే బడ్జెట్లో పదిశాతం కేటాయించాలి. గత రెండు బడ్జెట్లో సగటున నాలుగు శాతం మాత్రమే కేటాయించడం చూస్తే వైద్యరంగం ప్రభుత్వ ప్రాధాన్యతలో లేదని అర్థం అవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగమే వైద్య ఆరోగ్య ఉద్యోగులు. 2023 జూలై నుండి పిఆర్సి అమలు కావలసి ఉంది. దాదాపు మూడేళ్లు దగ్గరికి వస్తున్నా అతీగతి లేదు. ఉద్యోగులకు మొత్తం పదకొండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. పెన్షనర్స్ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో రావటం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 25 వేల మంది రిటైర్మెంట్ కానున్నారు. మరో 5వేల కోట్లు కావాల్సి ఉంది. హెల్త్ కార్డుల ఉద్యోగ వాటా ధనం లేకుండా ప్రభుత్వమే భరించి ఉచిత వైద్యమందించాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్థానంలో పాత పెన్షన్ స్కీమ్‌ను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి. అలాగే జీవో 317 బాధితులు వైద్య ఆరోగ్య రంగంలో చాలామంది ఉన్నారు స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు బదిలీలు చేయాలి. వీటన్నింటిపై కమిటీలు వేసి కాలయాపన చేయటం వల్ల ఉపయోగం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే వీరంతా వెట్టిచాకిరి చేస్తున్నారు.
నేషనల్ హెల్త్ మిషన్‌లో సుమారు 17వేల మంది పనిచేస్తుండగా, అనేక రాష్ట్రాల్లో వీరిని పర్మినెంట్ చేశారు. తెలంగాణలో మాత్రం పరిశీలనకు కూడా తీసుకోవడం లేదు. జీవో 510 ప్రకారం అందరికీ వేతనాలు పెంచాలి. కానీ, నాలుగు వేల మందికి వేతనాలు పెంచకుండా అన్యాయం చేశారు. ఆరోగ్య రంగంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకం. వీరి కృషి వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయి. శిశు మరణాలు తగ్గాయి. అనేక స్కీములు సమర్థవంతంగా అమలవుతున్నాయి. వీటన్నింటిలో పాత్ర కాంట్రాక్ట్ ఏఎన్ఎంలది రాష్ట్రంలో సుమారు 7వేల మంది ఉన్నారు. పర్మనెంట్ వాళ్లని కలిపిన పదివేలమంది ఉంటారు. సిబ్బంది కొరత ఉంది. పనిభారం పెరి గింది. 2023లో 1930 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. హైకోర్డులో వెయిటేజ్ మార్కుల మీద కేసు నడిచింది. 20 మార్కులు ఇవ్వాలని ఫైనల్ తీర్పు వచ్చింది. నేటికీ భర్తీ చేయలేదు. ‘సమాన పనికి సమాన వేతనం’ ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖలో అమలు కావడం లేదు.
ఏఎన్ఎంలకు 2021లో పెరిగిన వేతనాల బకాయిలు రూ.33 కోట్లు ఇస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి విస్మరించారు. వీరందరికీ వందశాతం గ్రాస్‌శాలరీ ఇవ్వాలి. టిఎ, డిఎ, హెచ్‌ఆర్‌ఎలు వర్తింపచేయాలి. మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా పారామెడికల్ పోస్టులు భర్తీ కోసం 2024 నుండి మూడు నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులో 1284 ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు భర్తీ చేశారు. 2322 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ చివరి దశలో ఉంది. కాలయాపన చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి.కోర్టు వివాదం వల్ల ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులు 732 పెండింగ్‌లో ఉన్నాయి, ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ వెంటనే ఇవ్వాలి. వైద్యఆరోగ్యశాఖలో మొత్తం 20 వేల పోస్టులు భర్తీ చేయాలి. 104 వాహనాల్లో పనిచేసిన 1094 సిబ్బందిని ప్రభుత్వం డిప్లమెంట్ చేసింది. 2021లోనే గత ప్రభుత్వం రద్దు చేసింది. వీరికి 2025 ఏప్రిల్ నుండి 11 నెలలుగా వీరికి ప్రభుత్వ వేతనాలు చెల్లించడం లేదు 108 అంబులెన్స్ సిబ్బంది పట్ల ప్రయివేటు యాజమాన్యం వేధింపులకు గురిచేస్తున్నది. పైలెట్ ఈఎంటిలకు తక్కువ వేతనాలు ఉన్నాయి.
కాల్ వస్తే 30 సెకండ్లలో బండి కదలాలనే నిబంధన పెట్టి ఆందోళనకు గురిచేస్తున్నారు. 95శాతం ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ పథకాన్ని ప్రయివేటు వారికి అప్పగించరాదు. 102 జనని శిశు రక్షణ వాహనాలలో పనిచేస్తున్న సిబ్బంది 12 గంటలు పనిచేసిన వేతనం మాత్రం రూ.13 వేలు మాత్రమే ఉంది వీరందరికీ జీతభత్యాలు పెంచాలి. టీవీ కంట్రోల్ సొసైటీలో 700 మంది సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలి. వైద్య విధాన పరిషత్ వైద్య విద్య ఆస్పత్రుల్లో సుమారు 15వేల మంది ఔట్సోర్సింగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వీరికి జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 ఇవ్వాలి.2021 నుండి ప్రభుత్వమే అమలు చేయడం లేదు. పేషంట్ కేర్, శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డులను రూ.11వేలు మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నారు. పిఎఫ్, ఈఎస్ఐలు రెండు నెలలు కార్మికుడి జీతంలోనే కట్ చేస్తున్నారు. వీళ్ల వేతనాలు రూ. 26 వేలకు పెంచాలి.
ఇటీవల ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని ఆరోగ్య మిత్రులకు వేతనాలు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 నుంచి రూ.19,500కు పెరిగాయి. వీరిని ఆరోగ్య ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదు. ఏరియర్స్, ప్రమోషన్స్, సర్వీస్ రెగ్యులరైజేషన్ లేదు. టీ హబ్‌లో పనిచేస్తూ సిబ్బందికి నెలలు తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయుష్, బ్లడ్ బ్యాంక్ డిపిఎంలలో కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పిహెచ్‌సిలలో పనిచేస్తున్న కంటిన్జెంట్ డైలీవేజ్ వర్కర్స్ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి. పార్ట్ టైం వర్కర్స్ రూ. 4వేలు కూడా ఇవ్వట్లేదు, ఉద్యోగ భద్రత కూడా లేదు. 2023 మేలో జీవో నెంబర్ 16 ఆధారంగా పర్మినెంట్ అయిన వారి సర్వీసు రెగ్యులరైజేషన్‌లో అధికారులు కాలయాపన చేస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రిలో వేల సంఖ్యలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్‌కు సకాలంలో ప్రమోషన్స్ ఇవ్వడం లేదు, నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు ఆలస్యం అవుతున్నది. సర్వీసుల్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్‌కు బిఎస్సి, ఎంఎస్సీ చదువుకోటానికి జీతంతో కూడిన సెలవులుండేవి, ప్రస్తుతం నిలుపుదల చేశారు. వాటిని పునరుద్ధరించాలి. ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులకు గ్రేడ్ 2 వారికి ప్రమోషన్స్ లేవు. జీవో నెంబర్ 69 ప్రకారం హాస్పిటల్లో అనస్తీషియా రేడియాలజీ, సిటి ఇసిసి, కార్డియో, డెంటల్ ,స్టెరిలైజేషన్, టెక్నీ షియన్స్ పోస్టులు భర్తీకి ఉత్తర్వులిచ్చారు. రెండేండ్లయినా భర్తీ చేయలేదు. వెంటనే వీటికి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఈ రకంగా చాలా క్యాడర్లలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో పనిచేస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇతర సిబ్బంది జీతభత్యాలు పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు సంబంధించి కామన్ డిమాండ్స్‌ను ప్రభుత్వం పరిశీలించాలి. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం నిర్ణయించాలి. ప్రమాద బీమా సౌకర్యం రూ.10 లక్షలు కల్పించాలి. రిటైర్మెంట్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులకు గ్రాట్యూటీ చట్టం ప్రకారం ఇవ్వాలి లేదా కనీసం 10 లక్షలు ఫిక్స్డ్ గ్రాట్యూటీ ఇవ్వాలి. పర్మినెంట్ ఉద్యోగులకు 20 లక్షల ఇస్తున్నారు. హెల్త్ కార్డులు, చట్టబద్ధ సౌకర్యాలు అన్ని కల్పించాలి. ఈ సమస్యలన్నీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చించి పరిష్కరించాలి.
భూపాల్
9490098034



