‘అణిచేస్తాం… కోరలు పీకేస్తాం..’ రాష్ట్రాన్ని గుల్లచేస్తున్న మాదక ద్రవ్యాల మాఫియా పేరెత్తగానే నాయకుల నోటివెంట అలవోకగా వెలువడే భీషణ ప్రతిజ్ఞలివి! మాదకాసురులపై ఉక్కుపాదం మోపుతామనే ప్రభుత్వాల మాటలు కొన్నేళ్లుగా కోట దాటుతున్నా, చేతలే గడప కూడా దాటడం లేదు. కొందరు బడా బాబులు.. నగర శివారులను డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఫామ్‌హౌసుల్లో పార్టీలు చేసుకుంటూ మత్తులో తూగుతున్నారు. చట్టాలు చేసి వాటి అమలుకు బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఈ పార్టీల్లో దోషులుగా పట్టుబడుతూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది.
నిందితుల్లో పైలట్ రోహిత్ రెడ్డి, ఏపి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మలు ఉండటం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. మాదక ముఠాలకు మహారాజుల వంటివారి జోలికి సర్కారీ యంత్రాంగం పెద్దగా పోదు. కానీ, ‘అడవిపంది చేను మేసిపోతే.. ఊరపంది చెవులు కోసినట్లు’ చిల్లర నేరగాళ్లపై మాత్రం తన ప్రతాపమంతా చూపిస్తుంటుంది. డ్రగ్స్ కేసుల్లో శిక్షల శాతం చాలా స్వల్పంగా ఉందని, అరెస్టు అవుతున్న వారిలో అత్యధికులు చిన్నచిన్న సరఫరాదారులు, వినియోగ దారులేనని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. యువతను నిర్వీర్యం చేస్తూ రక్తపుకూడుతో విందులు చేసుకునే ఇటువంటి నేరగాళ్లకు చైనా, ఇండొనేసియా వంటి 35 దేశాల్లో శిక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. తద్భిన్నంగా మన దేశంలో నెలకొన్న పరిస్థితి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అందుకు అనేక ఉదాహరణలున్నాయి.
తాజా కేసులో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్‌లోకి వెళ్తున్న క్రమంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పదకొండుమందిపై కేసు నమోదు కాగా, కేవలం ముగ్గరుని మాత్రమే రిమాండ్‌కు తరలించారు. ఒకవైపు పార్లమెంట్ జరుగుతుంటే సదరు ఎంపీ కొకైన్‌తో చిందులు వేయడం ఎంతటి బాధ్యతారాహిత్యం. ఇలాంటి వారు ప్రజాప్రతి నిధులు అని చెప్పుకోవడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు. అయినా ప్రభుత్వాలు వారికి కొమ్ముకాస్తున్నాయి. ఇదే ఘటనలో తెలంగాణకు చెందిన మరో ‘బడానేత’ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అతన్ని తప్పించేందుకే కాల్పులకు పాల్పడ్డారన్న వార్తల్లో నిజం ఎంతో పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.
సాధారణ నేరాల్లోనే… అసలు తప్పు చేశారో లేదో తెలియకుండానే విచారణ ఖైదీలు కోకొల్లలుగా కటకటాల్లో జీవచ్ఛవాలవుతున్నారు. తమ వికృత వ్యాపారానికి ప్రజారోగ్యాన్ని బలిపెట్టే పెద్దమనుషులు మాత్రం చట్టం చేతుల్లోంచి ఇసుక రేణువుల్లా జారిపోతున్నారు! సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంచేసినట్టు సామాజిక శ్రేయస్సుకు అత్యంత ప్రమాదకారులైన డ్రగ్స్ దందాసురులు ఎటువంటి కనికరానికీ అర్హులు కారు. గట్టి నిఘా, సమర్థ పర్యవేక్షణ లోపభూయిష్టమైతే నేర ముఠాల విధ్వంసకర కార్యకలాపాలకు పట్టపగ్గాలు లేకుండా పోతాయనడానికి ఈ సమకాలీన ఘటనలే నిలువెత్తు రుజువు.
దేశీయంగా గంజాయి సాగు, వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంటే… హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు వెలు పలినుంచి జల, వాయు మార్గాల్లో వచ్చిపడుతున్నాయి. 8-12 తరగతుల విద్యార్థుల్లో పది శాతానికి పైగా మద్యం, పొగాకు, గంజాయి, నల్లమందులకు అలవాటుపడ్డారని ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం తమ అధ్యయనంలో నిగ్గుతేల్చింది. దేశ భవిష్యత్తుకు వెలుగుదీపాలు కావాల్సిన చిన్నారులు, యువతను ఒంటి మీద స్పృహ ఉండని వ్యసనపరులుగా తయారు చేస్తున్నాయవి. అంతేకాదు, వాళ్లలో ఎంతోమందిని కరడుగట్టిన నేరగాళ్లుగానూ మార్చేస్తున్నాయి. గంజాయి బ్యాచ్ ఆగడాలతో తరచూ నేరాలు చోటుచేసుకుంటున్నాయన్న స్థానికుల మొత్తుకోళ్లు అరణ్యరోదనలే అవుతున్నాయి.
పాఠశాలలకూ పాకిన మాదక జాడ్యాన్ని పరిమార్చాలంటే కేంద్ర, రాష్ట్ర సంస్థల నడుమ సమన్వయం, వాటికి సరైన సాధన సంపత్తి ప్రాణావసరాలు. వాటికి ప్రోదిచేస్తూ, మాదక మహాసామ్రాజ్యాలకు మకుటం లేని చక్రవర్తులైన వాళ్లందరినీ బోనెక్కించేందుకు పాలకులు ఇప్పటికైనా చిత్తశుద్దితో నడుం బిగించాలి. అప్పుడే సామాజిక పునాదులను కూల్చేస్తున్న ఈ మహావిధ్వంసాన్ని నిలువరించడం సాధ్యం! ఈగల్, ఎన్సీబీ, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ విభాగాలు సమష్టిగా కదం తొక్కేలా కేంద్రం, రాష్ట్రాలు మాదకాసురులపై ఉమ్మడిగా కదనభేరి మోగించాలి. లేదంటే మత్తులో చిత్తు అయిన ‘యువత’తో రాష్ట్రం నిర్వీర్యమైపోయే ప్రమాదం పొంచి ఉంది… తస్మాత్ జాగ్రత్త!
మాదకాసురులు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



