అదనపు ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలకు ఆదేశం
రైతుల ఆదాయంపై గణనీయమైన ప్రభావం
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం మరోసారి రైతులకు హానికరంగా పరిగణించబడుతున్న చర్యలను అమలు చేస్తోంది. వరి, గోధుమలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పాటు, రాష్ట్రాలు అదనంగా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ చర్య రైతుల ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎంపీ జాన్ బ్రిట్టాస్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కార్యదర్శి జనవరి 9, 2026న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ పంపినట్టు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
వరి, గోధుమల వంటి పంటలకు అందిస్తున్న ఆర్థిక బోనస్‌లను నిలిపివేయాలని, అలాగే తమ విధానాలను కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మార్చుకోవాలని ఆ లేఖలో రాష్ట్రాలను కోరారు.వరి, గోధుమల వంటి పంటలకు బోనస్‌లను నిలిపివేసినట్టు, వాటి స్థానంలో పప్పుధాన్యాలు, నూనెగింజలు , తదితర పంటలను ప్రోత్సహిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కొత్త ఆదేశం, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై, తమ వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడంలో రాష్ట్రాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా రైతులు ఇప్పటికే పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఆదాయ అభద్రతతో సతమతమవుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు అందిస్తున్న అదనపు మద్దతును ఉపసంహరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచన రైతులకు ఒక గట్టి దెబ్బగా పరిణమించింది. ప్రస్తుతం వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,369గా ఉంది. అయితే, కేరళ ప్రభుత్వం క్వింటాలుకు అదనంగా రూ. 631 బోనస్ అందిస్తూ, కేరళ రైతులకు మొత్తం రూ. 3,000 చొప్పున చెల్లిస్తోంది. ఈ బోనస్‌లను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఆమోదం పొందితే, రైతులు ఈ అదనపు మద్దతును కోల్పోతారు, ఇది వారి ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ ప్రోత్సాహక బోనస్‌లను తొలగించే ప్రతిపాదనతో తమకు విభేదాలు ఉన్నాయని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులపై ప్రతికూల ప్రభావం చూపే ఏవైనా విధానపరమైన మార్పులను పున్ణపరిశీలించాలని ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.



