Tuesday, March 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇక ఆ సమయం అయిపోయింది

ఇక ఆ సమయం అయిపోయింది

- Advertisement -

ఇంకా బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను చెప్పుకుంటూ కూర్చోలేం
చిట్‌చాట్‌లొద్దు.. మీరే ప్రతిపక్షం కావొద్దు..
వివాదాల్లోకి వెళ్లకండి.. అనవసరంగా ఇరుక్కోకండి : సీఎల్సీ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ఇప్పటిదాకా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకుంటూ వచ్చాం.. ఇంకా వాటి గురించే చెబుతూ కూర్చోలేం.. ఆ సమయం అయిపోయింది, అందువల్ల మన భవిష్యత్‌ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే విషయాలపై దృష్టి సారించండి…అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగే సమయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడొద్దు.. ఒకవేళ మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి.. సభలో వాదోపవాదాలు చేస్తూ మీరే ప్రతిపక్షంలాగా వ్యవహరించొద్దు.. తద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయొద్దు…’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హితబోధ చేశారు.

సభలో మాట్లాడే అంశాలకు సంబంధించి ప్రభుత్వ విప్‌లు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. చర్చలు పక్కదారి పట్టకుండా, సమయం వృధా కాకుండా సభను సమర్థవంతంగా నడిపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని శాసనమండలి కాన్ఫరెన్సు హాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్‌ ప్రణాళికల గురించి గవర్నర్‌ ప్రసంగంలో విడమరిచి చెప్పామన్నారు. ఆ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్‌ మ్యాప్‌ లాంటిదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల హాజరు విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఇతరత్రా కారణాలు చెప్పి గైర్హాజరు కావొద్దని హెచ్చరించారు. సభకు విధిగా హాజరవటం ద్వారా అనేక అంశాలపై అవగాహన, పట్టు సాధించాలని దిశా నిర్దేశం చేశారు. మహిళా శాసన సభ్యులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని చెప్పారు. వారు చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించటం ద్వారా అక్కడి సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తమకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ నేతలుగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్‌ ఇవ్వలేదని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు సభకు రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. అలాంటి కష్టాలన్నింటినీ దాటుకుంటూ తాము తిరిగి సభలోకి అడుగుపెట్టామని తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్‌ చేస్తుందని పేర్కొన్నారు. అందువల్ల వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ కొనసాగుతుందని వివరించారు. అందువల్ల ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించి పని చేయాలని కోరారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై ఫోకస్‌ పెట్టాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

అలా వచ్చి.. ఇలా వెళ్తే కుదరదు…
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు అలా వచ్చి.. ఇలా వెళ్తామంటే కుదరదని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ రోజూ కచ్చితంగా మూడు పూటలా హాజరు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ మీద నెగెటివ్‌ మాట్లాడటానికే పరిమితం కాకుండా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఏకరువు పెట్టాలని చెప్పారు. ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌.. ప్రభుత్వంపై కసితో ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ తరపున సీరియస్‌గా ఉండి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని సూచించారు. కాగా సీఎల్పీ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరవటం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా? అంటూ ఆయన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో బీ-ఫారాలు ఇచ్చేటప్పుడు ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హెచ్చరించారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరి వెళతారని సీఎంవో వర్గాలు తెలిపాయి.

టీపీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు
కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఏఐసీసీ.. టీపీసీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎనిమిది మందితో కూడిన కమిటీని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచందర్‌ రెడ్డితోపాటు మీనాక్షి నటరాజన్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -