Tuesday, March 17, 2026
E-PAPER
Homeబీజినెస్అమెరికా ఉత్పత్తులకు రెడ్‌కార్పెట్‌

అమెరికా ఉత్పత్తులకు రెడ్‌కార్పెట్‌

- Advertisement -

– పెరిగిన దిగుమతులు
– భారత వాణిజ్యానికి దెబ్బ
– తగ్గిన ఎగుమతులు
న్యూఢిల్లీ :
ట్రంప్‌ ఆంక్షలకు తలొగ్గిన మోడీ సర్కార్‌ అమెరికా ఉత్పత్తులకు రెడ్‌కార్పెట్‌ వేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి భారీగా దిగుమతులు జరగడంతో భారత వాణిజ్య లోటు పెరిగి.. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ట్రంప్‌ విధించిన భారీ టారిఫ్‌ల ప్రభావం భారత ఎగుమతులపై స్పష్టంగా కనిపిస్తోంది.
సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అమెరికాకు జరిగిన ఎగుమతులు 12.88 శాతం పతనమై 6.88 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయం లో అమెరికా నుండి దిగుమతులు 36.53 శాతం పెరిగి 4.48 బిలియన్ల డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు అమాతం దాదాపు 30 బిలియన్‌ డాలర్లకు చేరడం తీవ్ర ఆందోళకరం.

మరోవైపు చైనా నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లోనే చైనాతో వాణిజ్య లోటు 102.01 బిలియన్లకు చేరుకుని.. తొలిసారి 100 బిలియన్ల మైలురాయిని దాటేసింది. చైనాకు ఎగుమతులు పెరిగినప్పటికీ.. దిగుమతులు ఏకంగా 119.55 బిలియన్లకు చేరడం అధిక లోటుకు కారణమైంది. ఇతర దేశాల విషయానికి వస్తే.. స్విట్జర్లాండ్‌ నుండి బంగారం దిగుమతులు ఏడు రెట్లు పెరిగి 2.71 బిలియన్లకు చేరగా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలకు ఎగుమతులు వృద్ధిని నమోదు చేశాయి. అయితే బ్రిటన్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌ వంటి కీలక మార్కెట్లకు ఎగుమతులు క్షీణించాయి.

స్థూల ఎగుమతులు పతనం..
ఫిబ్రవరి 2026లో స్థూల ఎగుమతులు ఆశించిన స్థాయిలో పుంజుకోకపోగా.. దిగుమతులు ఏకంగా 21.61 శాతం ఎగబాకి 80.09 బిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్హం. మరోవైపు సరుకుల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 11 శాతం క్షీణించి 36.61 బిలియన్‌ డాలర్లకు పడిపోవడంతో వాణిజ్య లోటు పెరిగింది. ఎగుమతులు పడిపోయి, దిగుమతుల భారం పెరగడం వల్ల దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రూపాయి విలువపై ఒత్తిడి పెంచడమే కాకుండా, విదేశీ మారక నిల్వలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది. మరోవైపు.. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వాణిజ్య రంగానికి మరిన్ని కష్టాలను తెచ్చిపెటొచ్చని నిపుణులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -