అసెంబ్లీ మీడియా పాయింట్లో కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందనీ..కానీ అది బయటకు కనపడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడారు. గవర్నర్ మూడు భాషల్లో చదివారు..కానీ.. తమకు ఏమీ అర్ధం కాలేదని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు అందాలని చెప్పారు.
సత్యం మాట్లాడుతూ కార్మికుల, ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు రావటం లేదని తెలిపారు. ఉద్యోగులకు బెనిఫిట్స్ అందటం లేదని చెప్పారు. రైతులకిచ్చిన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు.
అదో డొల్ల ప్రసంగం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్బంగా మొదటి రోజు గవర్నర్ చేసిన ప్రసంగం పూర్తి డొల్లగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని శాసన సభ మీడియా పాయింట్ వద్ద గవర్నర్ ప్రసంగంపై ఆయన మాట్లాడారు. గవర్నర్‌తో అబద్ధాలతో నిండిన ప్రసంగాన్ని ప్రభుత్వం చదివించిందని విమర్శించారు. ఆ ప్రసంగంలో స్కీముల గురించి లేదు గానీ… స్కాంల గురించి ఉందని ఎద్దేవా చేశారు. అది చిత్తుకాగితంతో సమానమని తెలిపారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల, 420 హామీలు గురించి ప్రస్తావనే లేదని చెప్పారు. మహిళలకు ఇచ్చిన రూ. 2,500 హామీ ప్రస్తావన లేదని తెలిపారు. మహిళలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకొచ్చి రెండేండ్లు గడిచినా ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచలేదన్నారు.
రెండేండ్లు మోసం చేసి, మరో మారు ఈ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఒక్క కొత్త పెన్షన్‌ను కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆశగా ఎదురు చూస్తున్న పేదవారిని ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు రూ. రెండు లక్షల రుణ మాఫీ చేయకుండానే గవర్నర్ ప్రసంగంలో చేసినట్టు అబద్దం చెప్పించారని తప్పుపట్టారు. ఇస్తామన్న 15 వేల రైతు భరోసా ఏదని ప్రశ్నించారు. రూ. 500 బోనస్ ఎవరికిచ్చారో అర్థం కావటం లేదన్నారు. బోనస్ 20శాతం మంది రైతులకు కూడా ఇవ్వలేదన్నారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేసి తామే 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల హామీ ఏమైందని ప్రశ్నించారు. మూడో సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ రైతు భరోసా రూ.15వేల ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యువత సమయం కోసం చూస్తున్నారనీ, సమయమొచ్చినప్పుడు తప్పక బుద్ధి చెపుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని మోసం చేసినందుకు నల్ల బ్యాడ్జిలతో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపు నిల్చొని నిరసన తెలిపామని వివరించారు. అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.
గవర్నరంటే బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ప్రసంగంపట్ల అవమానకరంగా వ్యవహరించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలవుతున్నా బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని విమర్శించారు. దళితున్నీ ముఖ్యమంత్రి చేస్తామనీ, మూడెకరాల భూమిస్తామని చెప్పిన మీరు వాటిని అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 20 లక్షల మంది రైతులకు రుణ మాఫీ బీఆర్ఎస్ నేతలకు కనిపించడంలేదా? అని నిలదీశారు. ఉన్నదంతా ఊడ్చుకెళ్ళి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పారు.
వారి హయాంలో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయనీ, నిరుద్యోగుల కోపాన్ని చూశారని గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మొదటిసారి కొత్త గవర్నర్ అసెంబ్లీకొస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. హాజరు కోసం అసెంబ్లీకి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఆయన ఐదునిమిషాలొచ్చి పోతారని విమర్శించారు. గవర్నర్ మాట అక్షర సత్యమని చెప్పారు.అదోక రోడ్‌మ్యాప్ అని తెలిపారు. సంక్షేమ పథకాలు ఎంతమందికందాయో లెక్కలతో సహా చెబుతామన్నారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన విషయం బీఆర్ఎస్ నేతలకు కనపడక పోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఉంటే అధికారంలో ఉంటాం. లేదంటే ఫాం హౌస్‌లో ఉంటాం అనే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ ఆర్థిక దోపిడి చేశారని విమర్శించారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల అమలు చూసి ఓర్వలేక ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ లీడర్‌లెస్ పార్టీ అనీ, అది ఇన్లీగల్ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ నాయకుడు ఫాం హౌస్‌లో పడుకుంటే.. మిగతా నాయకులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ 420 గాళ్ళకు ప్రభుత్వ హామీల అమలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
హరీశ్ రావు, కేటీఆర్ వల్ల ఆ పార్టీకి డ్యామేజ్ అని చెప్పారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కునే నాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో లేరని తెలిపారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదవాడికి ఇండ్లు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పారు. తమ ప్రభుత్వం కొత్తగా 13 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రజలకు సన్నబియ్యమిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 70 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు రైతులనుండి కొనుగోలు చేసిందని చెప్పారు. మూసి ప్రక్షాళన మీద కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అన్ని అవాస్తవాలే.. : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
గవర్నర్ ప్రసంగంలో అన్ని అవాస్తవాలే ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆయన మీడియా పాయింట్లో ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు హామీ, రైతుల సంక్షేమం గవర్నర్ ప్రసంగంలో కనిపించలేదన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదని చెప్పారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేదని చెప్పారు. బీసీలను 42శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ నిండా మోసం చేసిందని విమర్శించారు.
అసంతృప్తి ఉంది.. కానీ కానరావట్లే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



