నవతెలంగాణ- ఆలేరు రూరల్
ఆలేరు మండలంలో అర్హులైన పేదలకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలని సిపిఐ మండల కమిటీ డిమాండ్ చేసింది.ఈ మేరకు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో సర్వే నంబర్ 8లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ,పేదలు చాలా రోజులుగా అక్కడ గుడిసెలు వేసుకొని పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే కలెక్టర్,ఆర్డీవో,ఆలేరు తహసిల్దార్,ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పేదల పక్షాన ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో ఏడాది కాలంగా పేదలు భూమిపై గుడిసెల్లో నివసిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భూ పోరాట కమిటీ సభ్యులు మోతే భవాని, పార్వతి, సంపత్తి, కావడి సంధ్య, నర్ర సరిత,కొమ్ము అరుణతో పాటు సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కందుల మధు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఇమ్రాన్, సిపిఐ మండల కార్యదర్శి అన్నమయ్య వెంకటేష్,గ్రామ శాఖ కార్యదర్శి సామీ తదితరులు పాల్గొన్నారు.



