మహిళా ఉపాధ్యాయులను నిత్యం వేధింపులకు గురిచేస్తున్న యాజమాన్యం
ఉపాధ్యాయులకు టార్గెట్ల పేరుతో జీతాల కోత
స్టూడెంట్ పాలసీల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్న యాజమాన్యం
నిత్యం మహిళా ఉపాధ్యాయుల సెల్ ఫోన్ల తనిఖీ
ఎంఈఓ దామాల పుల్లయ్యకి ఉపాధ్యాయులు ఫిర్యాదు
యాజమాన్యం వేధింపులు, జీతాల ఎగవేత పై సమగ్ర విచారణ
నవతెలంగాణ – బోనకల్
ఆ పాఠశాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పటానికి నెలకొల్ప బడింది. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు యాజమాన్యం జీతాలు చెల్లించాలి. ఉపాధ్యాయులు అంటే పాఠాలు మాత్రమే బోధించేవారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు, యాజమాన్యం సహజంగా కృషి చేస్తారు. మంచి ఫలితాల సాధన కోసం యాజమాన్యం, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలి. పాఠాలు బోధించినందుకు ఉపాధ్యాయులకు యాజమాన్యం జీతాలు చెల్లించాలి. కానీ యాజమాన్యం ఇవేమీ చేయటం లేదు. విద్యా వ్యవస్థకు, నిబంధనలను అతిక్రమించి పూర్తి భిన్నంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. నిత్యం పాలసీల పేరుతో ఉపాధ్యాయులను తీవ్ర వేధింపులకు గురిచేస్తుంది.
ఇంతటితో ఆగకుండా మహిళా ఉపాధ్యాయుల సెల్ ఫోన్లను యాజమాన్యం తనిఖీ చేస్తూ మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏనాడు నెల జీతాలు చెల్లించిన పాపాన పోలేదు. యాజమాన్యం ఇచ్చే జీతం కంటే యాజమాన్యం మహిళా ఉపాధ్యాయులను, మనోవేదనకు గురి చేసే మనోవేదనే ఎక్కువ గా ఉందని పలువురు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం పెడుతున్న వేధింపులు, మనోవేదన తట్టుకోలేక 10 మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మంగళవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్యకు ఫిర్యాదు చేసిన సంఘటన మండలంలో సంచలనంగా మారింది.
ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు సాక్షాత్తు మండల కేంద్రంలోని షైన్ హై స్కూల్ లో చోటు చేసుకున్న సంఘటన. బాధిత ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పి నాగేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, షేక్ సైదాబీ, బి శ్రీవాణి, పి శ్రీదేవి, ఆర్ వాణి శైలజ, పి ఎస్ ఎన్ మల్లేశ్వరి, వీ రాజశేఖర్, షేక్ ఉద్దండు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల, ఇప్పుడు ఉపాధ్యాయులను వేధించే అడ్డాగా మారింది. స్థానిక షైన్ హై స్కూల్ యాజమాన్యం మహిళా ఉపాధ్యాయులను దారుణంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధిత ఉపాధ్యాయులు తెలిపారు.
పిల్లలకు పాలసీ చేయండి ధీమాగా ఉండండి! వసూళ్ల టార్గెట్లు.. జీతాల కోత!
పాఠశాల యాజమాన్యం కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్టూడెంట్ పాలసీల’ పేరుతో ఉపాధ్యాయులపై పెను భారం మోపుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థుల కొరకు పాలసీ ని జనవరి 2026న షైన్ స్కూల్ డైరెక్టర్ షేక్ లాల్ మహమ్మద్, కరస్పాండెంట్ షేక్ అన్సర్ పాషా ప్రారంభించారు. విద్యార్థి కనీస డిపాజిట్ లక్ష రూపాయలు చేయవలసి ఉంది.

ఆప్షన్ -1
1.నెలకు రూ.2000 చొప్పున విద్యార్థి పాఠశాల ఫీజు, 2. మెచ్యూరిటీ తర్వాత టిసి స్టడీ మేము ఒక లక్ష రూపాయలు మిగిలిన వడ్డీ బ్యాంకు వడ్డీ 3. మొదటిసారి డిపాజిట్ చేసిన 50 మందికి పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయని పాలసీ ప్రకటించారు.
ఆప్షన్ – 2
1. నెలకు రూ 3,500 చొప్పున స్కూల్ ఫీజు చెల్లించిన రసీదు ఇవ్వబడును.2. స్కూల్ ఫీజు అయిపోయిన తర్వాత మిగిలిన పాయకము నేరుగా విద్యార్థి తండ్రికి ఇవ్వబడుతుంది.3. రూ, లక్ష తక్కువలో తక్కువగా మూడు సంవత్సరాలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. 4. మూడు సంవత్సరాల తర్వాత విద్యార్థి పాఠశాలను వదిలి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థి యొక్క సర్టిఫికెట్లు మిగిలిన డిపాజిట్టు స్కూల్ ఫీజు మినహాయించుకొని మిగిలిన పైకము బ్యాంకు వడ్డీతో కలిపి చెల్లించబడును. 5. ఈ విద్యార్థి పాలసీలో చేరిన మొదటి 50 మందికి ఆ మూడు సంవత్సరాలు ఉచితంగా తరగతి పుస్తకాలు ఇవ్వబడునని షైన్ స్కూల్ యాజమాన్యం ఓ బ్రోచర్ విడుదల చేసింది. కావున తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం ప్రకటించింది.
లక్ష రూపాయల వసూలు: ఒక్కో ఉపాధ్యాయుడు కనీసం ఒక పేరెంట్ (తల్లిదండ్రుల) నుంచి ఒక లక్ష రూపాయల వరకు పాలసీల పేరుతో వసూలు చేయాలని యాజమాన్యం నిర్దేశించినట్లు వారు తెలిపారు.
జీతాల నిలిపివేత: ఈ అసాధ్యమైన టార్గెట్లను పూర్తి చేయని పక్షంలో, ఉపాధ్యాయులకు రావాల్సిన నెలవారీ జీతాలను ఆపివేస్తామని మేనేజ్‌మెంట్ బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిగత గోప్యతకు పాతర:
పాలసీల పేరుతో విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం లేదన్న నెపంతో, మహిళా ఉపాధ్యాయుల వ్యక్తిగత ఫోన్ కాల్స్‌ను అక్రమంగా రికార్డ్ చేయడం, ఫోన్లను బలవంతంగా లాక్కొని అందరి ముందు మెసేజ్‌లను తనిఖీ చేయడం వంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు షైన్ హై స్కూల్ డైరెక్టర్ షేక్ లాల్ మహమ్మద్, కరస్పాండెంట్ షేక్ అన్సర్ పాషా, ప్రిన్సిపాల్ అయిటిపాముల శ్వేత వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు.
మహిళా ఉపాధ్యాయుల విన్నపం:
సీనియర్ ఉపాధ్యాయులని కూడా చూడకుండా అనుచిత పదజాలంతో దూషించడం, మానసిక వేధింపులకు గురిచేయడం వల్ల పాఠశాలలో పనిచేయలేని పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఉపాధ్యాయులను వేధిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రావలసిన జీతాలను ఇప్పించాలని బాధితులు ఆ వినతి పత్రంలో మండల విద్యాశాఖ అధికారిని కోరారు.




