Wednesday, March 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరైతే బరువా?

రైతే బరువా?

- Advertisement -

‘తాను సాయం చేయడు.. చేసేవాడిని కూడా చెడగొడతాడు’ అన్నట్టుగా దేశ రైతాంగానికి నష్టం చేసే నిర్ణయాలు కేంద్రం నుంచి వరుసగా వెలువడుతున్నాయి. వరి, గోధుమలకు నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) గాకుండా రాష్ట్రాలు అదనంగా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలను కోరడం అందులో భాగమే. నోటికాడి కూడును లాక్కోవడమనే అర్థం వచ్చేలా..రాష్ట్రాలు అందిస్తున్న కొద్దిపాటి ఆర్థిక భరోసాను కూడా అడ్డుకోవాలని ప్రయత్నించడం హేయమైన చర్య.

వరి, గోధుమల వంటి పంటలకు అందిస్తున్న ఆర్థిక బోనస్‌లను నిలిపివేయాలని, అలాగే కేంద్ర విధానాలకు అనుగుణంగా తమ నిర్ణయా లను మార్చుకోవాలని కేంద్రం రాసిన లేఖలో రాష్ట్రాలను కోరింది. సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది జనవరి 9న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ పంపినట్టు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. వరి, గోధుమల వంటి పంటలకు బోనస్‌లను నిలిపి వేసినట్టు, వాటి స్థానంలో పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. దీనిద్వారా రైతుల పట్ల కేంద్రం వైఖరేంటో మరోసారి తెలియజేసినట్టు అయింది. ప్రస్తుతం వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) క్వింటాల్‌కు రూ.2,369గా ఉంది. కేరళం ప్రభుత్వం క్వింటాల్‌కు అదనంగా రూ.631 బోనస్‌ అందిస్తూ, మొత్తం రూ.3వేల చొప్పున చెల్లిస్తోంది. తెలంగాణ లోనూ రాష్ట్రప్రభుత్వం అదనంగా రూ.500 అందిస్తోంది. ఇలా మరికొన్ని రాష్ట్రాల్లో ఒక్కో పంటకు అదనపు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ఈ బోనస్‌లను తొలగించాలన్న కేంద్రం ప్రతిపాదన ఆమోదం పొందితే, కేరళ రైతులతో పాటు మిగతా రాష్ట్రాల అన్నదాతలకు నష్టదాయకమే. ఇప్పటికే రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్రం లాగేసుకుంది. సహాయకచర్యల విషయంలోనూ పెత్తనం చెలాయిస్తే రైతులను ఎవరు ఆదుకోవాలి?

దేశవ్యాప్తంగా రైతులు ఇప్పటికే పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ద్రవ్యోల్బ ణం, ఆదాయ అభద్రతతో సతమత మవుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం వెనుక గత కొన్ని రోజులుగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో కుదుర్చు కున్న వాణిజ్య ఒప్పందాలే కారణం. ఈ ఒప్పందాల నేపథ్యంలో, రాష్ట్రాలు రైతులకు అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాలను పరిమితం చేయాలన్న సూచనలు రావడం, అలాగే దిగుమతుల పెంపు దిశగా తీసుకుంటున్న చర్యలూ రైతు వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది. అమెరికాలో భారీ సబ్సిడీలతో ఉత్పత్తి అయ్యే పంటలు తక్కువ ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలోకి వస్తాయి. అలాంటి పంటలను భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటే, స్థానిక రైతులు పోటీపడటం చాలా కష్టం.

రైతు సంక్షేమంపై గతంలో అనేక కమిటీలు సూచనలు చేశాయి. ముఖ్యంగా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు రైతు ఆదాయాన్ని పెంచడానికి కీలకమైన మార్గదర్శకంగా నిలిచాయి. తాము అధికారంలోకి వస్తే రైతుకు రెట్టింపు ఆదాయం కల్పిస్తామని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని ఇచ్చిన హామీని ఈ పన్నెండేళ్లలో బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. పైగా మూడు నల్లచట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్‌కు అప్పగించాలని చూసింది. చివరికి రైతు సంఘాల ఉద్యమంతో వెనక్కుతీసుకుంది. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీకి ఎసరుపెట్టింది. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో రైతులకు అదనపు ఆర్థికసాయాన్ని అందిస్తున్నాయి. అదనపు బోనస్‌లు, ప్రోత్సాహ కాలు కొంతవరకు భరోసాను కల్పిస్తున్నాయి. కానీ, వాటినెత్తివే యాలని కేంద్రం సూచించ డం రైతులకందే కొద్దిపాటి సాయాన్ని కూడా దెబ్బతీయడమే.

కేంద్రం చర్యలను అడ్డుకునే క్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎమ్‌) రాష్ట్రపతికి లేఖ రాసింది. వరి, గోధుమ రైతులకు ఇచ్చే బోనస్‌ను రద్దు చేస్తూ డెమి-అఫీషియల్‌ ఆర్డర్‌ (డీవో) లేఖను ఉపసంహరించుకునేలా ఆర్థికమంత్రిని ఆదేశిం చాలని కోరింది. అంతేగాకుండా రైతువ్యతిరేక చర్యలను కేంద్రం మానుకోవాలని, అమెరికా, ఇతర దేశాలతో చేసుకో బోయే వాణిజ్య ఒప్పందాల వల్ల మన రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రధానిమోడీకి చెప్పాలని కోరింది. వ్యవసాయం, చిన్న తరహా ఉత్పత్తిని నాశనం చేసే వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో సంతకం చేయవద్దని ఆదేశించాలని పేర్కొంది. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం ముందుంది. రైతు బతికితేనే దేశం బతుకుతుందన్న నిజాన్ని గుర్తించాలి. లేదంటే వ్యవసాయ రంగాన్ని కాపాడే నిర్ణయాల అమలునకు ప్రజలే ఉద్యమించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -