ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ ప్రారం భించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమి దవ రోజులో ప్రవేశించాయి. వాటికి ధీటుగా టెహరాన్ కూడా ప్రతిదాడులతో బెంబేలెత్తిస్తు న్నది. హార్ముజ్ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్ కోరికను ఏ ఒక్క మిత్రదేశం కూడా అంగీకరిం చలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌నకు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. వీరిలో రెండు రకాలు ఒకటి రెచ్చగొట్టే వారు, రెండవ తరగతి అన్యాయాన్ని ప్రతిఘటించాలి కదా అని భావిస్తున్నవారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటం లేదని డోనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశాల మీద తిట్లపురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. ‘మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం’ అన్నట్లుగా చైనా ఉంది.నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్ దాడులకు గురవుతున్న గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్-సౌదీ అరేబియా మధ్య 2023లో చైనా సంధి కుదిర్చింది, రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు ఉన్నాయి. టెహరాన్ క్షిపణులు సౌదీ మీద కూడా పడుతున్నాయి. రెండు మిత్రదేశాల మధ్య వివాదం ఉన్నపుడు చైనా ఒక పక్షం వహిస్తుందని ఎవరైనా ఊహించగలరా? రష్యా పరిస్థితీ అంతే. ఐదో ఏడులో ప్రవేశించిన ఉక్రెయిన్ పోరులో రష్యాకు వ్యతిరేకంగా జెలెన్‌స్కీకి పశ్చిమదేశాలు ఆయుధాలు, డబ్బు అందిస్తున్నాయి తప్ప ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు,రష్యాకు మద్దతిస్తున్న దేశాలదీ అదే వైఖరి. ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయి మొత్తం మానవాళికే ముప్పు తలెత్తే పరిస్థితి ఉన్నపుడు వేసుకోవాల్సిన ప్రశ్నలను ఇప్పుడు లేవనెత్తితే సమాధానాలుండవు.
ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న.ప్రారంభించిన అమెరికాకే దిక్కుతో చటం లేదు. ఇరాన్‌వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని స్వయంగా డోనాల్డ్ ట్రంప్ నెపాన్ని సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలందాయని వార్తలు. ఒక వైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డివిరిచామని రోజూ డోనాల్డ్ ట్రంప్ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణిదాడుల సంగతేమి టన్న ప్రశ్నకు సమాధానం చెప్పే వారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా, ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవ ప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చుకదా అని ట్రంప్ మిత్రుడే బహిరం గంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కిన పుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్ధేశ్యం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది.హార్ముజ్ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది.ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా,అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడిం చింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని,దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణకొరియా అధ్యక్షుడు లీ జె మయుంగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంథన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు, ఆస్ట్రేలియా కూడా అదేబాటలో ఉంది.ఐరోపా యూనియన్ విదేశాంగ మంత్రి కాజా కలాస్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ కూడా తమ దేశం విస్తృత యుద్దంలోకి రాదని అన్నాడు.
యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్ మీద దాడి చేయలేదని ట్రంప్ చెప్పుకున్నాడు. హార్ముజ్ జలసంధిలో నౌకలు స్వేచ్చగా తిరిగేందుకు వీలుగా తమ మిత్రదేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణకోసం చైనా,జపాన్ వంటి దేశాలు యుద్ద నౌకలను పంపాలన్నాడు. తమకు చమురు అవసరంలేదని కావాల్సినదానికంటే రెండిం తల కంటే ఎక్కువ ఉంది, ఏ ఇతర దేశంతో పోల్చినా ఎక్కువే ఉత్పత్తి చేస్తున్నాం, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. మాకు మధ్య ప్రాచ్యంలో గొప్పదేశాలు స్నేహితులుగా ఉన్నాయి, ఇజ్రాయిల్ ఉంది, ఇంకా అనేక కారణాలతో దాడులు చేస్తున్నట్లు కూడా చెప్పాడు. దీనికిగాను ఖర్చులు చెల్లించాలని మేం అడగలేదు, నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్రదేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడుకాలమన్నాడు.
ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్ దేశాలు పూనుకోలేదు.అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దునలేస్తే ఇరాన్‌తో ముఖము ఖాలు చూసుకోవాల్సింది తామని ఈరోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పారిపోయింది, ఇరాక్ నుంచి వెళ్లే దిశలో ఉంది, తమ ప్రాంతంలో మాత్రం ఉంటుందనే హామీ ఏదని అక్కడి విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్ మీదనే అని తాజాగా ఇరాన్ ప్రకటించింది.అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు. దుబాయిలో ఉన్న శతకోటీశ్వ రుడు ఖలాఫ్ అల్ హబతూర్ ఎక్స్ ద్వారా స్పందించాడు.” మేం దాడులకు గురువుతున్నామని పూర్తిగా తెలుసు, మా ప్రాంతం మొత్తాన్ని ఈ ప్రమాదంలోకి ఎవరు లాగారో కూడా మాకు తెలుసు. మాతో సంప్రదించకుండానే ఈ ప్రాంతంలో తమ మిత్రదేశాలని పిలిచింది కూడా ఎవరో తెలుసు” అంటూ అమెరికా మీద ధ్వజమెత్తాడు. అయితే అతగాడిపై తీవ్రవత్తిడి రావటంతో ఎక్స్ నుంచి ఆ ప్రకటనను ఉపసం హరించుకున్న ప్పటికీ ఆ ప్రాంత బడాబాబుల మనోభావాలను ప్రతిబింబించాడు.
తాజా పరిణామాల్లో మరో ముఖ్యఅంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రోడాలర్లను కురిపిస్తోంది. ట్రంప్ అనుకున్న దొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయ వచ్చని అన్ని దేశాలకు అవకాశమిస్తున్నట్లు ప్రకటించింది. అన్నింటినీ ముందే ఊహించే దైవాంశ సంభూతుడని కీర్తించిన నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది, రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని బహిరంగం గానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేండ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్, చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్ బెదిరించటంతో మనదేశం సగానికి కొనుగోళ్ల ను తగ్గించింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి వత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్ సర్కార్‌కు రాబడి వస్తోంది. ఒక పీపాకు పదిడాలర్ల మేర ధర పెరిగితే రష్యాకు నెలకు అదనంగా 1.6 బిలియన్ డాలర్ల రాబడి వస్తుంది. భారత్, చైనా కొనుగోలు చేసిన కారణంగానే ఆ సొమ్ముతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం చేయగలుగుతోందని వాపోయిన ట్రంప్ ఇప్పుడు తానే అందుకు తోడ్పడుతున్నాడా?డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని గతంలో ఒక పీపా ముడి చమురును 59 డాలర్లకు అమ్మిని రష్యా ఇప్పుడు దాన్నే 105 డాలర్లకు విక్రయిస్తోంది. కొన్ని దేశాలు దౌత్య సంబంధాల గురించి కూడా సంప్రదింపులు జరుపుతున్నాయి. గతంలో ఇరాన్‌లో తయారైన షాహేద్ డ్రోన్లు రష్యాకు సరఫరా చేస్తే ఇప్పుడు దానికి బదులుగా ఇరాన్ శత్రువుల ఆనుపానులను రష్యా అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో డ్రోన్లను ఎలా కూల్చివేశారో చెప్పండంటూ పదకొండుదేశాల వారు తమను సంప్రదించినట్లు జెలెనెస్కీ చెప్పాడు. పశ్చిమ దేశాల వారు తనకు అందించిన కొన్ని డ్రోన్ల కూల్చివేత వ్యవస్థలను గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ తరలించినట్లు వార్తలు వచ్చాయి. అదీ లాభసాటి బేరమే మరి.
ఇరాక్‌లో విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ చమురు కంపెనీల సిబ్బంది ఉండే బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ ప్రాంతంలోని రషీద్ హోటల్‌పై ఇరాన్ అనుకూల సాయుధ బృందాలు దాడి చేశాయి. టెహరాన్ నగరంలోని ఆడపిల్లల స్కూలుపై జరిగిన దాడికి అమెరికా బాధ్యత అని ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ దర్యాప్తు నిర్ధారించింది. ఆ ఉదంతంలో 160 మంది మరణించారు. వారి కుటుంబాలకు అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. చమురు ధరల్లో ఎగుడు దిగుడు కొనసాగు తోంది. మంగళవారంనాడు బ్రెంట్ క్రూడ్ ధర 103.5 డాలర్లు ఉంది. తమ శత్రుదేశాల నౌకలకు హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే అవకాశం లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. పన్నెండు రోజుల దాడుల తరువాత బ్రిక్స్ కూటమి అధ్యక్ష స్థానం(భారత్) ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు అంతర్జాతీయ న్యాయసూత్రా లకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇరాన్ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజిని తీసుకు వచ్చే మూడు టాంకర్లను సురక్షితంగా హార్ముజ్ జలసంధి నుంచి ఇరాన్ అనుమతిం చింది. మనదేశంపై వచ్చిన వత్తిడి, వంటగ్యాస్ సెగ తగిలిన తరువాత మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!
ఎం కోటేశ్వరరావు
8331013288



