– బాధాకరమైనా న్యాయం చేకూరింది : డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అమరులైన 13 ఏండ్ల తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్నామని ఇది కొంత బాధాకరమైనా వారికి న్యాయం చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. ఒరిసా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని బలిమెల రిజర్వాయర్‌లో నక్సలైట్ల చేతుల్లో మరణించిన 38 మంది గ్రేహండ్స్, స్పెషల్ పోలీస్ జవాన్ల కుటుంబ సభ్యులకు డీజీపీ ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2008 జూన్ 29న కూంబింగ్ ఆపరేషన్ ముగించుకుని గ్రేహండ్స్కు చెందిన 60 మంది జవాన్లు, స్పెషల్ పోలీసులు మల్కన్‌గిరి జిల్లాలోని బలిమెల రిజర్వాయర్‌లో లాంచ్‌లో నిర్ధేశిత ప్రాంతానికి చేరుకుంటుండగా అట్టి సమయంలో పోలీసుల సమాచారాన్ని అందుకున్న నక్సలైట్లు రిజర్వాయర్ గుట్టపై నుంచి పోలీసులపై కాల్పులు జరపడం, గ్రానైట్లు వేయడం జరగిందని డీజీపీ తెలిపారు. ఈ ఘటనలో 32 మంది గ్రేహండ్స్ జవాన్లు, ఆరుగురు స్సెషల్ పోలీసులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 200 గజాల ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేసినట్టు డీజీపీ తెలిపారు. ఆ సర్వే నెంబర్లో వచ్చిన వ్యత్యాసాల కారణంగా బాధితులకు అప్పట్లో భూమి కేటాయింపు జరగలేదని తెలిపారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తిరిగి అట్టి భూమి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. గాజులరామారంలోనే ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ మరో కొత్త జీవోను తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఏలాంటి వివాధంలేని భూమిని కేటాయించిందని, దీంతో 38 మంది బాధిత కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటలీజెన్స్ అదనపు డీజీపీ విజరుకుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతీ, గ్రేహండ్స్ కమాండెంట్ రాఘవేందర్, కుత్బుల్లాపూర్ తహసీల్దారు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బలిమెల రిజర్వాయర్ అమరుల కుటుంబాలకు ఇండ్ల స్థలాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



