Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంఫుడ్‌ డెలివర్రీ

ఫుడ్‌ డెలివర్రీ

- Advertisement -

ఎల్పీజీ కొరతతో గిగ్‌ వర్కర్ల జీవనోపాధికి దెబ్బ
మూతపడుతున్న అనేక రెస్టారెంట్లు
ఆర్డర్లు తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు
వారి సంక్షేమంపై దృష్టి పెట్టని మోడీ సర్కారు
తాజా సంక్షోభంతో బయటపడుతోన్న లోపాలు


న్యూఢిల్లీ :
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు భారత్‌లోని సామాన్య ప్రజల జీవనంపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఫుడ్‌ ఇండిస్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది గిగ్‌ ఎకానమీని సంక్షోభంలోకి నెట్టింది. రెస్టారెంట్లు మూసివేయడం, మెనూలను తగ్గించడం వంటి పరిణామాలు డెలివరీ కార్మికుల ఆదాయాన్ని గణనీయంగా దెబ్బతీశాయి.

ఆర్డర్లు తగ్గారు..ఆదాయం పడిపోయింది..
దేశవ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది గిగ్‌ వర్కర్లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికుడు కుల్దీప్‌ ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ వాపోయాడు. ”ఒకప్పుడు రోజుకు 20 నుంచి 22 ఆర్డర్లు అందుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నాలుగు నుంచి ఐదు గంటలు పని చేసినా ఐదారు ఆర్డర్లకే పరిమితమయ్యా..” అని కుల్దీప్‌ తెలిపాడు. తాను రోజుకు సంపాదించే రూ.275లో సగానికి పైగా ఇంధన ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే పరిస్థితిని మరొక గిగ్‌ వర్కర్‌ సత్యభాన్‌సింగ్‌ కూడా వివరించాడు. గతంలో రోజుకు 25-30 ఆర్డర్లు చేసేవాడిననీ, ఇప్పుడు అది 15కు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ తగ్గుదల కారణంగా తన రోజువారీ ఆదాయం పడిపోయిందని వాపోయాడు.

‘కమర్షియల్‌’తో సమస్యలు
ఎల్పీజీ కొరత కారణంగా దేశంలోని పెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, పూణే వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ నగరాల్లో ఉన్న రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు ఎక్కువగా కమర్షియల్‌ ఎల్పీజీపై ఆధారపడటంతో సమస్య మరింత తీవ్రమైంది. గ్యాస్‌ సరఫరా తక్కువగా ఉండటంతో కొన్ని రెస్టారెంట్లు పూర్తిగా మూతపడ్డాయి. మరికొన్ని తమ మెనూలను తగ్గించాయి. ఇక ఎక్కువ సమయం పట్టే వంటకాలైన దాల్‌ మఖ్నీ, రాజ్మా, కొన్ని నాన్‌-వెజ్‌ వంటకాలను మెనూ నుంచి తొలగించాయి.

మోడీ ప్రభుత్వానికి పట్టని సంక్షేమం
గిగ్‌ వర్కర్ల తాజా పరిస్థితి విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘డిజిటల్‌ ఇండియా’, ‘స్టార్టప్‌ ఇండియా’ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించామని గొప్పలు చెప్పుకునే మోడీ ప్రభుత్వం.. వాటిని నడిపించే గిగ్‌ వర్కర్ల సంక్షేమంపై సరైన దృష్టిని పెట్టలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇంధన సరఫరా వంటి కీలక అంశాల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడం కూడా ఒక ప్రధాన లోపమని వారు అంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా దేశీయ మార్కెట్‌ను రక్షించే విధానాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎల్పీజీ కొరత వంటి సంఘటనలు ఈ లోపాలను స్పష్టంగా బయట పెడుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి గిగ్‌ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగంగా మారుతున్నప్పటికీ.. దాని పునాది అయిన కార్మికుల భద్రత ఇంకా నిర్లక్ష్యంగానే ఉందని వివరిస్తున్నారు. ఈ సంక్షోభం ప్రభుత్వం, కంపెనీలు, సమాజం కలిసి ఆలోచించి స్థిరమైన పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోందని వారు సూచిస్తున్నారు.

ప్రభుత్వం, కంపెనీల అత్యవసర చర్యలు అవసరం : గిగ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫుడ్‌ డెలివరీ సమయాలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం చివరకు గిగ్‌ వర్కర్ల మీదనే పడుతోంది. ఎందుకంటే ఫుడ్‌ డెలివరీ ఆలస్యాలకు వారు పెనాల్టీలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత ఫుడ్‌ డెలివరీ కంపెనీలను గిగ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ (గిగ్వా) కోరింది. తాత్కాలికంగా పెనాల్టీలను నిలిపివేయడం, కార్మికుల రేటింగ్స్‌ను రక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. వినియోగదారులు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని డెలివరీ కార్మికులకు ఎక్కువగా టిప్స్‌ ఇవ్వాలని సూచించింది.


గిగ్‌ వర్కర్లకు రక్షణ వ్యవస్థ కరువు

అయితే ఈ సంక్షోభం భారత్‌లోని గిగ్‌ ఎకానమీ బలహీనతలను బయటపెడుతోంది. గిగ్‌ వర్కర్లకు కనీస వేతనం, ఆరోగ్య బీమా వంటి ప్రాథమిక భద్రతలు లేకపోవడం వారి పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఏదైనా విఘాతం వచ్చినప్పుడు వారి ఆదాయం వెంటనే పడిపోతోంది.
కానీ వారికి ఎలాంటి రక్షణ వ్యవస్థా ఉండటం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -