Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాపాలనకు దర్పణం గవర్నర్‌ ప్రసంగం

ప్రజాపాలనకు దర్పణం గవర్నర్‌ ప్రసంగం

- Advertisement -

– మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలనకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగం అద్దం పట్టిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టింది. చర్చను మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రారంభిస్తూ మూసీ పునర్జీవం, గోదావరి జలాలను తరలించేందుకు, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎయిర్‌ పోర్టుల నిర్మాణం, ఏకకాలంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ, సన్నధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ తదితర కార్యక్రమాలను ఆయన వివరించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరాన్ని కూలిపోయేలా నిర్మించి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసి, మిగిలిన ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టిందని ఆయన విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు బీసీలకు అన్యాయం చేస్తే తమ ప్రభుత్వం వారికి న్యాయం చేసిందని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ వచ్చాక పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయన్నారు. మూసీ కంపును అలాగే ఉంచితే పెట్టుబడులు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా ప్రతినిధులందరికి డ్రగ్స్‌ టెస్ట్‌
రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులందరూ డ్రగ్స్‌ టెస్ట్‌కు సిద్ధం కావాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్‌ కల్చర్‌ పెంచిందని ఆయన విమర్శించారు. డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిళించి వేయాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా డ్రగ్స్‌ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారనీ, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ కూడా సిద్ధపడాలని సవాల్‌ విసిరారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ ప్రజాపాలనకు నిలువుటద్దంగా గవర్నర్‌ ప్రసంగం ఉందన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నదనీ, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తున్నదని తెలిపారు.

అవాస్తవాలతో గవర్నర్‌ ప్రసంగం : మధుసూదనాచారి
గవర్నర్‌ ప్రసంగం అవాస్తవాలతో నిండుకుని ఉందని శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ పక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదనీ, పంట పెట్టుబడి సహాయం ఇవ్వడం లేదనీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇవ్వలేదనీ, బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడం లేదని విమర్శించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో, బీసీలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -