Wednesday, March 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సీఎంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదు

సీఎంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదు

- Advertisement -

– అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే కేపీ వివేకానంద
నవతెలంగాణ-సిటీబ్యూరో

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశానికి హాజరు కాకపోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలే కాకుండా, ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల కాంగ్రెస్‌ నాయకులు సొంత నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నారని అన్నారు. సొంత పార్టీ నేతలపై ముఖ్యమంత్రికి విశ్వాసం లేదని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం లేదని అన్నారు. ”99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కేవలం తొమ్మిది రోజులకే బోర్లా పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి విధి విధానాలూ లేవన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని, గడిచిన రెండేండ్లలో రాష్ట్రంలో ఒక్కటీ సరైన ప్రణాళిక లేదని, అసలు అడ్మినిస్ట్రేషన్‌ అన్నదే లేదని విమర్శించారు.

రైతుల్ని విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం: ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌
రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజరు తప్పుబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమై, రైతులను నష్టాల ఊబిలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రమూ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల రైతులు బయట మార్కెట్లలో తమ పంటను తక్కువ ధరకే అమ్ముకుంటూ, క్వింటాలుకు రూ.700 వరకు నష్టపోతున్నారని తెలిపారు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి చేతికి రాక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు లేదు, కరెంటు లేదు, కనీసం పంట కొనుగోలూ లేదన్నారు. రైతులకు ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైపరీత్యమూ ప్రారంభమైందని విమర్శించారు. ముఖ్యమంత్రికి రైతుల సమస్యలపై కనీస అవగాహన లేదని, కేవలం ‘ఫ్యూచర్‌ సిటీ’ వంటి ప్రాజెక్టుల మీదే ధ్యాస పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

కరీంనగర్‌ సీపీ అరాచకాలు శృతిమించాయి త్వరలోనే ”బాంబు బ్లాస్ట్‌” చేస్తా:బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి
కరీంనగర్‌ సీపీ ఆలం గౌస్‌ అరాచకాలు శృతిమించాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీ ఆలం గౌస్‌ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బోనాలపల్లిలో ఇష్టానుసారంగా ఫైరింగ్‌ చేస్తున్నారని, ఈ క్రమంలో అమృతమ్మ అనే వృద్ధురాలికి గాయమైందని తెలిపారు. 180 బుల్లెట్లతో ఫైరింగ్‌ జరిగిందని విమర్శించారు. హోంగార్డుల నుంచి ట్రాన్స్‌ఫర్ల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నారని, ఐఆర్‌ఎస్‌ అధికారి తండ్రి కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుతున్నారని ఆరోపించారు. సీపీ అక్రమాలు తెలిసినా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆయనకు డబ్బుల మూటలు అందుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ డ్రగ్స్‌, మద్యం పరీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌గౌడ్‌కు సవాల్‌ విసిరారు. తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే బయటపెట్టి ”బాంబు బ్లాస్ట్‌” చేస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్ని స్పీకర్‌ అనుమతితో అసెంబ్లీలో లేవనెత్తుతానని స్పష్టం చేశారు.

ఆత్మ గౌరవం, ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టొద్దు గవర్నర్‌ ప్రసంగాన్ని కేటీఆర్‌ పదేపదే తప్పుదోవ పట్టిస్తున్నారు : ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కేఆర్‌ నాగరాజు, రామచంద్రు నాయక్‌, కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి
గవర్నర్‌ ప్రసంగాన్ని కేటీఆర్‌ పదేపదే తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, రామచంద్రు నాయక్‌, కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్థిక విధ్వంసం చేశారన్నారు. అసెంబ్లీలో సబ్జెక్ట్‌ మాట్లాడండి.. అని చెప్పిన ఆది శ్రీనివాస్‌ను ట్రోల్‌ చేస్తున్నారన్నారు. ఆది శ్రీనివాస్‌ పెట్టుకున్న వాచీ ఖరీదు రూ.కోటి అని కేటీఆర్‌ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ వాచ్‌ కోటి రూపాయల ఖరీదు చేస్తే మీరు రూ.30 వేలు ఇచ్చి తీసుకోండని సూచించారు. ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టొదన్నారు. బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్‌ ఎంతో కష్టపడి పైకొచ్చారన్నారు. ఆయనపై తప్పుడు ఆరోపణలను వెనక్కి తీసుకొని కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. పాడి కౌశిక్‌రెడ్డి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ఆత్మాభిమానం, మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన ముఠా బ్యాచ్‌ కాబట్టి వారి ప్రవర్తన అసెంబ్లీలో అహంకారంగా ఉందని విమర్శించారు. పోలీస్‌ శాఖలో హాఫ్‌ ఇయర్లీ, ఇయర్లీ వెపన్‌ ప్రాక్టీస్‌ (ఫైరింగ్‌) ఉంటుందని, దానికి కుటుంబ సభ్యులను కూడా పిలవడం ఆనవాయితీ అని చెప్పారు. ప్రయివేటు వ్యక్తులతో ఫైరింగ్‌ చేయించడం జరగదన్నారు. పోలీస్‌ అధికారులపై కౌశిక్‌రెడ్డి కావాలని తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కౌశిక్‌రెడ్డి గుండాయిజం ప్రదర్శిస్తున్నారని, ఏకవచనంతో పోలీసు అధికారులను హెచ్చరిస్తున్నారని అన్నారు.

ఆది శ్రీనివాస్‌పై అసత్య ప్రచారం
ఆది శ్రీనివాస్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ అన్నారు. కేటీఆర్‌ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతున్నారని, గతంలో మంత్రి సీతక్కపై కూడా అసత్య ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ను ప్రశ్నిస్తున్నందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. 10ఏండ్ల కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాలేదని, సొంత చెల్లెలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారని విమర్శించారు. కాళేశ్వరం, అంబేద్కర్‌ విగ్రహంతోపాటు ఇతర ప్రాజెక్టులు ప్రతి దాంట్లోనూ అవినీతి జరిగిందని సొంత చెల్లెలు ఆరోపించినా దానికి సమాధానం లేదని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సాక్షిగా పదే పదే అబద్ధాలు నా వాచ్‌ను మీకే ఇచ్చేస్తా..: ఆది శ్రీనివాస్‌
బీఆర్‌ఎస్‌ను ఎప్పటికప్పుడూ ప్రశ్నిస్తున్నందుకు తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కేటీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా పదేపదే అబద్ధాలు మాట్లాడుతు న్నారన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కామ్‌లతోపాటు సొంత చెల్లెలును ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పటి నుంచి అడుగుతున్న ప్రశ్నలపై సమాధానాలు చెప్పలేకపోయారని విమర్శించారు. తాను పెట్టుకున్న వాచ్‌ రోలాక్స్‌ అని, కోటి రూపాయల విలువ చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ, ‘మేకేల్‌ కోర్స్‌’ కంపెనీకి చెందిన తన వాచ్‌ రూ.10వేల నుంచి 40వేల వరకు ఉంటుందని, అది దుబారులో ఉన్న తన స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చారని తెలిపారు. రూ.97లక్షల నుంచి కోటి రూపాయలంటున్నారు కదా ఆ వాచ్‌ను కేటీఆర్‌కైనా లేదా కేసీఆర్‌కు, హరిశ్‌రావుకు ఫ్రీగా ఇచ్చేస్తానన్నారు. దుబారు కేంద్రంగా వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మీ పదేండ్ల పాలనలో ఎంతో మానసిక ఇబ్బంది పెట్టినా తట్టుకొని ఇక్కడివరకు వచ్చానని చెప్పారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తన ఫొటో తీయడంపై స్పీకర్‌కు కంప్లైంట్‌ చేస్తానన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -